శనివారం 16 జనవరి 2021
Nirmal - Oct 23, 2020 , 00:31:58

లెక్క తేలుతోంది..

లెక్క తేలుతోంది..

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  కొనసాగుతున్న ఆస్తుల సర్వే
  • గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో  90.96 శాతం పూర్తి..
  • అత్యధికంగా మంచిర్యాల,  అత్యల్పంగా ఆదిలాబాద్‌..
  • వెంట వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆస్తుల సర్వే కొనసాగుతున్నది. అధికారులు వ్యవసాయేతర ఆస్తులను లెక్కిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 1,508 గ్రామ పంచాయతీల పరిధిలో 6,54,316 ఆస్తులుండగా.. వీటిలో 5,94,163 ఆస్తులను సర్వే చేశారు. ఇంకా 60,153 మాత్రమే లెక్కించాల్సి ఉంది. 20 రోజులుగా సర్వే చేస్తుండగా.. 90.96 శాతం పూర్తయింది. గ్రామాలతోపాటు మున్సిపాలిటీల్లో పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి ఆస్తినీ పకడ్బందీగా సేకరించి నమోదు చేస్తున్నారు. 


నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 1,508 గ్రామ పంచాయతీలు ఉండగా.. 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని జీపీలతోపాటు మున్సిపాలిటీల్లోనూ సర్వే తుది దశకు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో కేవలం 60,153 ఆస్తులను మాత్రమే లెక్కించాల్సి ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 6,54, 316 ఆస్తులుండగా.. వీటిలో 5,94,163 ఆస్తులను సర్వే చేశారు. 90.96 శాతం సర్వే పూర్తయింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 94.71 శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 87.71 శాతం సర్వే పూర్తయింది. నిర్మల్‌ జిల్లాలో 91.48 శాతం, ఆసిఫాబాద్‌ జిల్లాలో 89.93 శాతం పూర్తి చేశారు. గ్రామాలు, పట్టణాల పరిధిలో ప్రతి నిర్మాణాన్ని ధరణిలో ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఇండ్లు, భవనాలు, గుడిసెలు, షెడ్లు ఇలా అన్ని పన్నులు చెల్లించే నిర్మాణాలను లెక్కలోకి తీసుకున్నారు. ఇంటి యజమానితోపాటు వారసుల వివరాలూ నమోదు చేశారు. ఆధార్‌, కరెంటు బిల్లు, ఆస్తి పన్ను, రసీదుల వివరాలు తెలుసుకొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆస్తుల సర్వేను పకడ్బందీగా చేపట్టి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.