శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nirmal - Oct 22, 2020 , 00:48:41

బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

బాసర క్షేత్రాన్ని  అభివృద్ధి చేస్తాం

  • మరో రూ.50 కోట్లు  కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధం
  • రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల 
  • మూలా నక్షత్రం సందర్భంగా ఒడిబియ్యం సమర్పించిన మంత్రి దంపతులు

బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రూ.50 కోట్లు కేటాయించారని, మరో రూ.50 కోట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా మంత్రి దంపతులు ఒడిబియ్యం, చీరెలు సమర్పించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలుకగా.. ప్రత్యేక పూజలు చేశారు.   

- బాసర

మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని బాసర సరస్వతీ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సరస్వతీ అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిచ్చారు. సుహాసిని పూజ, మంత్రపుష్పం, మూలా నక్షత్ర, తదితర పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా 573 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  

 బాసర క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.  సరస్వతీ అమ్మవారికి మంత్రి అల్లోల దంపతులు ఒడిబియ్యం, చీరెలను సమర్పించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 50 కోట్లు కేటాయించారని, ఇప్పటికే రూ. 5 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారని వెల్లడించారు. మరో యాబై కోట్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బాసరలోని ట్రిపుల్‌ఐటీ కళాశాలలో సీట్లు  ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే రావడం సంతోషకరమన్నారు. వెయ్యి సీట్లకు గానూ 1500 సీట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని  కొనియాడారు. మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బాసర సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, నాయకులు బాశెట్టి రాజన్న, సావ్లీ రమేశ్‌, నూకం రామారావు, పవన్‌రావు, రమేశ్‌, మల్కన్న యాదవ్‌, జిడ్డు మల్లయ్య, దేవాదాయ శాఖ ఏడీసీ శ్రీనివాస్‌రావు, శ్యాం, తదితరులున్నారు.