మంగళవారం 27 అక్టోబర్ 2020
Nirmal - Oct 19, 2020 , 02:24:18

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

దీపావళి నాటికి డయాలసిస్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తాం

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

వైద్య సేవలపై ఆరా

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సందర్శన

దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం అల్లోల దంపతులకు  ఆహ్వానం

నిర్మల్‌ అర్బన్‌ : ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానను ఆదివారం మంత్రి సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్‌ సెంటర్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దీపావళి వరకు 10 పడకల డయాలసిస్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీంతో రోగులకు ఇబ్బందులు తొలిగిపోతాయని తెలిపారు. హైదరాబాద్‌ వంటి నగరాలకు పోవాల్సిన పని ఉండబోదన్నారు. మంత్రి వెంట నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్‌ రెడ్డి, సల్మాన్‌, రమేశ్‌ రెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ దేవేందర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

మంత్రికి ఆహ్వానం..

జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలకు హాజరవ్వాలని కోరుతూ మంత్రి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఇక్కడ ఆలయ వ్యవస్థాపకుడు కొండాజి వెంకటాచారి, అధ్యక్షుడు లక్కాడి జగన్‌మోహన్‌ రెడ్డి తదితరులున్నారు.

నీట్‌ విద్యార్థినికి అభినందనలు..

నీట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో 4258వ ర్యాంకు సాధించిన లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ గ్రామానికి చెందిన మేకల శివకృష్ణను మంత్రి అభినందించారు. భవిష్యత్‌లో మంచి విద్య అభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


logo