మంగళవారం 27 అక్టోబర్ 2020
Nirmal - Oct 19, 2020 , 02:12:39

అట్టహాసంగా అమ్మవారి అభరణాల శోభాయాత్ర

అట్టహాసంగా అమ్మవారి అభరణాల శోభాయాత్ర

గ్రామాల్లో అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం

కానుకలు సమర్పించి, ప్రత్యేక పూజలు  

దారిపొడవునా భారీ పోలీస్‌ బందోబస్తు

సారంగాపూర్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం  

నిర్మల్‌ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులు

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అల్లోల దంపతులు

అడెల్లి పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

సారంగాపూర్‌/ దిలావర్‌పూర్‌: నిర్మల్‌ జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం గంగనీళ్ల జాతర అట్టహాసంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చా రు. ఉదయాన్నే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ‘సల్లంగ సూడు పోచమ్మ తల్లీ..’ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్యాలు వండి బోనాలు సమర్పించారు. మరికొంత మంది భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఉన్న అల్లుబండ వద్ద భక్తు లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో మహేశ్‌ ఆధ్వర్యంలో వలంటీర్లు పూర్తి ఏర్పాట్లు చేశారు. సారంగాపూర్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆలయం వరకు ప్రత్యేక బస్సులు నడిపారు.

భారీ బందోబస్తు..

జాతరకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, రూరల్‌ సీఐ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు కలుపుకొని 80 మంది విధుల్లో పాల్గొన్నారు. అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చొరవ తీసుకున్నారు. దిలావర్‌పూర్‌లో ఎస్‌ఐ సంజీవ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 

గ్రామాల్లో ఘన స్వాగతం..

అడెల్లి పోచమ్మ అమ్మవారి నగలు శనివారం గంగస్నానానికి బయల్దేరగా, అడుగడుగునా భక్తులు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం దిలావర్‌పూర్‌ మండలంలోని సాంగ్వి పోచమ్మ ఆలయం నుంచి గోదావరికి తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం చేయించి, ప్రత్యేక పూజల అనంతరం తిరుగు పయనమయ్యారు. దిలావర్‌పూర్‌ మండలంలోని కంజర్‌, బన్సపల్లి, దిలావర్‌పూర్‌, మాడెగాం గ్రామాల గుండా శోభాయాత్ర సాగింది. దిలావర్‌పూర్‌ వీడీసీ ఆధ్వర్యంలో డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దిలావర్‌పూర్‌లోని హిందూవాహిని ఆధ్వర్యంలో ఉచితం గా అల్పాహారం, పులిహోర అందించారు. ఓమౌజయ ఆధ్వర్యంలో స్థానిక పంచముఖి హనుమాన్‌ ఆలయం వద్ద తాగునీరు అందించారు. మధ్యాహ్నానికి సారంగాపూర్‌ మండలంలోని ప్యారమూర్‌ చేరుకోగా.. అక్కడి నుంచి వంజర్‌, యాకర్‌పల్లి, సారంగాపూర్‌ గుండా అడెల్లికి సాయంత్రం చేరుకుంది.

పాల్గొన్న ప్రముఖులు..

దిలావర్‌పూర్‌ ఎంపీపీ ఏలాల అమృత, సర్పంచ్‌ వీరేశ్‌ కుమార్‌, రైతు బంధు సమితి సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కోడే రాజేశ్వర్‌, ఎంపీటీసీలు పాల్దే అక్షర, అనీల్‌, గంగవ్వ, జడ్పీటీసీ రమణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ సుభాష్‌రావు, సర్పంచ్‌ అచ్యుత్‌రావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

భక్తుల కొంగు బంగారం అడెల్లి పోచమ్మ

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఆలయంలో పూజలు చేసిన అల్లోల దంపతులు

సారంగాపూర్‌: భక్తుల కొంగు బంగారంగా అడెల్లి పోచమ్మ వెలుగొందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గంగ నీళ్ల జాతర సందర్భంగా అమ్మవారిని సతీమణి అల్లోల విజయలక్ష్మితో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మహేశ్‌ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకుడు శ్రీనివాస్‌ శర్మ ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. అడెల్లి పోచమ్మ ఆలయానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసి, సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మరో రూ.12కోట్లతో వివిధ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పంటలు బాగా పండి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ దేవతను వేడుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కోనేరు వద్దకు వెళ్లి, భక్తులను లోపలికి అనుమతించవద్దని ఆలయ అధికారులకు సూ చించారు. కోనేరు నీటిని శుభ్రంగా ఉంచాలని, షవర్‌బాత్‌ల నీళ్లు కోనేరులోకి రాకుండా చూడాలని చెప్పారు. మంత్రి సోదరులు అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్‌రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఐర నారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మాధవరావు, ఆలూర్‌ సొసైటీ చైర్మన్‌ మాణిక్‌రెడ్డి, సర్పంచ్‌ సుచరిత, నాయకులు రాంకిషన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఆయిటి చందు, రాజేశ్వర్‌రావు, నర్సారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇప్ప మధూకర్‌రెడ్డి, ఉట్ల రాజేశ్వర్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo