శనివారం 16 జనవరి 2021
Nirmal - Oct 17, 2020 , 04:06:51

వరద ప్రవాహంలో చిక్కుకున్న కౌలు రైతులు

వరద ప్రవాహంలో చిక్కుకున్న కౌలు రైతులు

సదర్మాట్‌ కుర్రు ప్రాంతంలో పెరిగిన గోదావరి ఉధృతి

సహాయక చర్యలు చేపట్టి కాపాడిన పోలీసులు

ఖానాపూర్‌రూరల్‌ : పంట చేను కావలికి వెళ్లి ఇద్దరు రైతులు ఖానాపూర్‌ మండలం మేడంపెల్లి సదర్మాట్‌ కుర్రు గోదావరి పరీవాహక ప్రాంతంలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి పోలీసులు వీరిని కాపాడారు. ఎస్‌ఐ భవానీసేన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సిర్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతులు పూస మల్లయ్య(50), చిలివేరి తిరుపతి (45) సదర్మాట్‌ కుర్రు ప్రాంతంలో రెండు పాయలుగా విడిపోయిన ద్వీప కల్పం ప్రాంతంలో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ప్రతిరోజూలాగే శుక్రవారం రాత్రి పంటలను అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి కావలికి వెళ్లారు. బుధ, గురు వారాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో రెండు పాయల మధ్య ప్రాంతంలో మల్లయ్య, తిరుపతి ఉండిపోయారు. విషయం తెలిసిన పొలీసులు జాలర్లు, గజ ఈతగాళ్లు తాడు సహాయంతో రైతులను ఒడ్డుకు చేర్చారు. ఎంతో శ్రమించి కౌలు రైతుల ప్రాణాలను కాపాడిన గజఈతగాళ్లకు ఎస్‌ఐ రూ.2 వేల సహాయాన్ని అందించారు. సీఐ శ్రీధర్‌, సర్పంచ్‌ గుగ్లావత్‌ రాజేందర్‌, మాజీ సర్పంచ్‌ లింబాద్రి, గజ ఈతగాళ్ల్లు ప్రభాకర్‌, గణేశ్‌, వినేశ్‌, రవి, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌, విజయ్‌, లక్ష్మీనారాయణ, గ్రామస్తులు ఉన్నారు. 

గోదావరి పాయలో చిక్కుకున్న పశువుల కాపర్లు..

లక్ష్మణచాంద : గోదావరి పాయలో గొర్రెలు మేపడానికి వెళ్లిన కాపరులు నది ప్రవాహం పెరగడంతో చిక్కుకున్నారు. తహసీల్దార్‌ సత్యనారాయణ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాచాపూర్‌ గ్రామానికి చెందిన మేకల ముత్తన్న, మేకల అనిల్‌, మేకల ముత్యం పశువుల కాపరులు. గోదావరి ప్రవాహం తగ్గడంతో 400 గొర్రెలను గోదావరి మధ్యలోగల పాయలోకి మేపడానికి గురువారం తీసుకెళ్లారు. వారు పాయలోకి వెళ్లిన తర్వాత గోదావరి ప్రవాహం క్రమంగా పెరిగింది. శుక్రవారం కూడా ప్రవాహం కొనసాగడంతో ఆందోళన చెందిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తహసీల్దార్‌ సత్యనారాయణరావుకు సమాచారం అందించారు. దాంతో ఆయన మునిపెల్లి పుష్కరఘాట్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో ఫోన్‌ద్వారా మాట్లాడారు. ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడిన ఆయన, శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో గోదావరికి నీటివిడుదల క్రమంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో తమకు సమాచారం అందిస్తే తగిన సహాయం అందిస్తామని బాధితులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చాడు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలను జాలర్లతో పంపినట్లు ఆయన తెలిపారు.