ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Oct 06, 2020 , 00:12:51

జోరుగా ఇసుక దందా

జోరుగా ఇసుక దందా

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. జిల్లాలకు మూడు వైపులా సరిహద్దు ప్రాంతంగా మహారాష్ట్ర ఉండడంతో అక్రమ రవాణా పెరిగింది. మహారాష్ట్ర క్వారీల నుంచి ఇసుకను వే బిల్లులు లేకుండానే ఓవర్‌ లోడ్‌తో తీసుకొచ్చి.. జిల్లాలో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రాత్రిళ్లు నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, భైంసా లాంటి పట్టణాలకు ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకొచ్చి నిర్మాణ స్థలాల వద్ద డంప్‌ చేసి అమ్ముతున్నారు. జిల్లాల్లోని ప్రధాన నదులు, వాగుల నుంచి కూడా ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదంతా తెలిసినా పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. - నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. జిల్లాల సరిహద్దుల్లో గోదావరి, ప్రా ణహిత, పెన్‌గంగ నదులు ఉండగా.. నది పరీవాహక ప్రాంతాలతోపాటు పట్టా భూము ల్లో కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు సరిహద్దుల్లో మూడు వైపులా మహారాష్ట్ర ఉండగా.. అక్కడ ఉన్న ఇసుక క్వారీల నుంచి పెద్ద ఎత్తున లారీల్లో జిల్లాకు తీసుకొస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌, కోటపల్లి మండలాల్లో ఇసుక క్వారీలకు టీఎస్‌ఎండీసీ అనుమతి ఉండగా.. ఇక్కడి నుంచి ఇసుక పెద్ద లారీల్లో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సరఫరా అవుతున్నది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ నుంచి ఇసుక రవాణా అవుతున్నది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నదులతోపాటు స్థానికంగా ఉన్న వాగుల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలోని కడెం వాగు, పెంబి మం డలం దొత్తి వాగు, మందపల్లి-రాజూరా పల్కే రు వాగు, స్వర్ణ, కల్లూర్‌, మామడ, కనకాపూర్‌, చిట్యాల వాగుల నుంచి కూడా ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే తవ్వకాలు చేస్తున్నారు.

ఒక్కో లారీ ఇసుకకు లక్ష

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ క్వారీల నుం చి ఇసుకను జిల్లాకు సరఫరా చేస్తున్నారు. అక్కడ వే బిల్లు తీసుకొని.. 4 టన్నులకు రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. క్వారీ వారికి రూ.6వేలు చెల్లించడంతోపాటు మహారాష్ట్రలోని ఆర్టీవో, పోలీసు, మైనింగ్‌ అధికారులకు, ఉమ్మడి జిల్లా సరిహద్దు వరకు ఉన్న పోలీసు స్టేషన్లతోపాటు సరిహద్దు చెక్‌పోస్టుల్లో మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌, కోటపల్లి మండలాల్లో గోదావరి పరీవాహక ప్రాం తంలో పది వరకు ఇసుక క్వారీలు ఉండగా.. డీడీలు తీస్తే ఇసుక సరఫరా అవుతున్నది. టీఎస్‌ఎండీసీకి ఆన్‌లైన్‌లో రూ.13,200 చెల్లిస్తే.. 20 క్యూబిక్‌ మీటర్లు (31-32 టన్నులు) ఇసుక వస్తున్నది. డీడీ కొట్టే వారు ఒక్కో లారీకి రూ.4-5 వేలు తీసుకుంటున్నారు. నిర్మల్‌, హైదరాబాద్‌కు చెందిన వారున్నారు. ఒక్కో లారీకి డీడీ, కమీషన్లు, డీజిల్‌, ఇతర ఖర్చులు కలిపి రూ.50 వేల వరకు అవుతున్నది. బయట రూ.65-70 వేల వరకు విక్రయించాల్సి ఉండగా.. ప్రస్తుతం లారీని లక్ష వరకు విక్రయిస్తున్నారు. కరోనా సమయంలో బొగ్గు లారీలు ఖాళీగా ఉండడంతో.. పెద్ద ఎత్తున బ్లాక్‌లో తరలించారు. రవాణా, పోలీసుశాఖ వారికి మామూళ్లు ఇచ్చి ఇతర ప్రాంతాలకు తరలించారు.  

అంతా మామూళ్ల మయం

బహిరంగ మార్కెట్‌లో అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో లారీలో 40-45 టన్నులు తెస్తుండగా.. 100 ఫీట్ల ట్రాక్టరుకు 4 టన్నులు వస్తున్నది. ఒక్కో లారీకి సుమారు 10-11 ట్రాక్టర్ల ఇసుక వస్తున్నది. ఒక్కో ట్రాక్టరు ఇసుక రూ.10 వేల ధర పలుకుతున్నది. మహారాష్ట్ర నుంచి తెచ్చిన లారీలకు వే బిల్లులు లేకుండానే దందా సాగిస్తున్నారు. మరోవైపు ఓవర్‌ లోడ్‌తో తెస్తున్నారు. రాత్రి ళ్లు నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, భైంసా లాంటి పట్టణాలకు తెచ్చి.. ట్రాక్టర్లు, టిప్పర్లలో డంప్‌ చేసి తీసుకెళ్తున్నారు. నిర్మాణ స్థలాల వద్ద డంప్‌ చేసి.. ఇతరులకు విక్రయిస్తున్నారు. కొందరు స్థానికంగా ఉండే వాగుల నుంచి ఇసుక తెచ్చి.. ఇళ్ల నిర్మాణ ప్రదేశంలో డంప్‌ చేసి తర్వాత విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉండే పోలీసు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొందరు ప్రభుత్వ అవసరాల పేరుతో.. ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. 


logo