మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Sep 30, 2020 , 02:08:30

నల్లసూర్యులకు తీపి కబురు

నల్లసూర్యులకు తీపి కబురు

  • సింగరేణిలో నేటి నుంచే మెడికల్‌ బోర్డు 
  • కరోనా సంక్షోభంతో గత మార్చిలో పరీక్షలకు బ్రేక్‌ 
    • తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో యాజమాన్యం నిర్ణయం

సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సింగరేణి మెడికల్‌ బోర్డుకు యాజమాన్యం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిం ది. కరోనా సంక్షోభంతో గత మార్చిలో పరీక్షల ప్రక్రియ నిలిచిపోగా, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేల కృషి.. సీఎం కేసీఆర్‌ చొరవతో మళ్లీ నేటి నుంచి నిర్వహించేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. ఫలితంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 3వేల మంది నల్లసూర్యుల ఎదురుచూపులకు తెరపడనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.      

గోదావరిఖని : కరోనా సంక్షోభంతో ఆరు నెలల కింద నిలిచిన సింగరేణి మెడికల్‌ బోర్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మళ్లీ నేటి (బుధవారం) నుంచి రెండు రోజులపాటు నిర్వహించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. సింగరేణిలో కార్మికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు యాజమాన్యం మెడికల్‌ బోర్డులు నిర్వహిస్తున్నది. పనిచేయలేని కార్మికులను అన్‌ఫిట్‌ చేసి, కారుణ్య నియామకాల కింద వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నది. ఫిట్‌గా ఉన్న కార్మికులను మళ్లీ విధులకు పంపిస్తున్నది. ఈ క్రమంలో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి సంస్థలో 59 మెడికల్‌ బోర్డులు నిర్వహించి, అర్హులైన 6,611 మంది కార్మికులను ఇన్‌వాలిడేషన్‌ (మెడికల్‌ అన్‌ఫిట్‌) చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చింది. 

ఈ క్రమంలో గత మార్చిలో మెడికల్‌ బోర్డు జరుగ గా, ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా విస్తరించడంతో బోర్డును నిలిపివేశారు. దీంతో అప్పటికే దరఖాస్తు చేసుకున్న 3 వేల మంది కార్మికులు అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బోర్డు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో కోల్‌బెల్ట్‌ ఏరియాకు చెందిన ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కోరుకంటి చందర్‌, నడిపెల్లి దివాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేసీఆర్‌, వెంటనే ఏర్పా టు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సింగరేణి ఉన్నతాధికారులు బోర్డు ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ క్రమంలో తొలి విడుతగా రివ్యూ కోసం వేచిచూస్తున్న 50 మంది కి, బోర్డుకు దరఖాస్తు చేసుకున్న మరో 50 మంది కి మొత్తం 100 మందికి బుధ, గురువారాల్లో మెడికల్‌ బోర్డు నిర్వహించనున్నారు. మిగతావారికి వచ్చే ఆరు నెలల్లో బోర్డుకు పిలువనున్నారు.

మూడు వేల మంది నిరీక్షణకు తెర

అన్‌ఫిట్‌ అయిన వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలతో ఇప్పటికే 3వేల మంది దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్ల సర్వీసు నిబంధన ఉంది. రెండేళ్ల సర్వీసు ఉండి బోర్డులో అన్‌ఫిట్‌ అయితేనే వారి వారసులకు ఉద్యోగం ఇచ్చే వీలుంటుంది. గత మార్చికి ముందే చాలా మంది రెండేళ్ల సర్వీసు ఉన్న కార్మికులు దరఖాస్తు చేసుకొని వేచి చూస్తుండడం, కరోనా కారణంగా బోర్డు నిలిచిపోవడంతో రెండేళ్ల సర్వీసు నిబంధనను సడలించాలని టీబీజీకేఎస్‌ కోరడంతో యాజమాన్యం ఒప్పుకుంది. ఈ క్రమంలో నేటి నుంచి మెడికల్‌ బోర్డు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 3వేల పైచిలుకు కార్మికులకు వచ్చే 6 నెలల్లో బోర్డుకు పిలిచి వారికి పరీక్షలు చేయనున్నారు. 

కేసీఆర్‌ ఆదేశాలతోనే బోర్డు 

-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మళ్లీ మెడికల్‌ బోర్డు నిర్వహణకు మోక్షం లభించింది. కరోనా కారణం గా నిలిచిపోయిన బోర్డును తిరిగి ప్రారంభించేందుకు గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ తరఫున మేము తీవ్రంగా కృషి చేశాం. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావు, నేను కలిసి ఇటీవల కోల్‌బెల్ట్‌కు చెందిన ఎమ్మెల్యేలకు విన్నవించాం. మా అందరి కృషితోనే మళ్లీ బోర్డు ప్రారంభమైంది. ఏది ఏమైనా కార్మికుల పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్‌కు టీబీజీకేఎస్‌ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాం.


logo