క్యాంపస్ నుంచే కంపెనీల్లోకి...

బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి సమయం ఆసన్నమైంది. సుమారు 1000 మంది విద్యార్థులకు ఇదో సదావకాశంగా మారనుండగా, ఈ మేరకు మెళకువలపై బోధనా సిబ్బంది శిక్షణ నిస్తున్నది. కొవిడ్ -19 కారణంగా ఈ ఏడాది ప్రముఖ కంపెనీలు ఆన్లైన్ ద్వారానే టెస్ట్‌తోపాటు ఇంటర్వ్యూ నిర్వహించనుండగా, ఇప్పటికే 700 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా సిద్ధం కావడానికి ట్రిపుల్ ఐటీ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పీ హరిబాబు పలు సూచనలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.- బాసర
క్యాంపస్ ప్లేస్మెంట్ సీజన్ మొదలైంది..
ఇక్కడ ఎంపికైన విద్యార్థి కెరీర్లో స్థిరపడినట్లే. సహజంగా రిక్రూట్మెంట్ కోసం వచ్చే కంపెనీలు ఉత్తమ కాలేజీలను ఎంపిక చేస్తాయి. బాసర ట్రిపుల్ ఐటీకి యేటా దాదాపు 60కి పైగా కంపెనీలు వస్తున్నాయి. అలాగే క్యాంపస్‌లో తమదైన పద్ధతుల్లో ఇంటర్వ్యూ నిర్వహించి నైపుణ్యం ఉన్న విద్యార్థులకు తమ కంపెనీల్లో చేరాలని ఆఫర్లు ఇస్తుంటాయి. కంపెనీల్లో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశాలుంటాయి. ప్రత్యేకించి ఒక ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యాలు ఒకెత్తు. ఇంటర్వ్యూను ఎదుర్కొని ఉద్యోగం సాధించడం మరో ఎత్తు. ఈ రెండింటిని కలగలిపి చూసినప్పుడే ఉద్యోగం సాధించవచ్చు. ఇంటర్వ్యూలో నెగ్గుకురావాలంటే ముందస్తుగా సదరు వృత్తికి అవసరమైన నైపుణ్యాలు, లక్షణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి. కంపెనీ అభివృద్ధికి ఉపయోగపడే అభ్యర్థులను ఎంపిక చేసుకొనే ప్రయత్నంలో ఆయా సంస్థలుంటాయి. ప్రత్యేకించి తమకు కావాల్సిన డొమైన్ పరిజ్ఞానం, తెలివితేటలతో నైపుణ్యం చూపే అభ్యర్థులకు అవకాశం కల్పిస్తాయి. తద్వారా తమ వర్క్ ఫోర్స్‌ను అభివృద్ధి పరుచుకొనేందుకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తోడ్పడుతాయి. ఇంటర్వ్యూలో నెగ్గుకురావాలంటే విద్యార్థులు ప్రధానంగా కింది అంశాలను చూసుకోవాలి.
సీవీ(రెజ్యూమ్)
క్యాంపస్ ప్లేస్మెంట్లో తొలి మెట్టు ఇదే. మంచి సీవీ తప్పనిసరి. ఇంజినీరింగ్ ఫస్టియర్ నుంచి సీవీని మొదలు పెట్టాలి. కోర్సులో భాగంగా చేసిన ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్స్, విద్యేతర కార్యకలాపాలు వంటివన్నీ ఇందులో ప్రముఖంగా కనిపించాలి. వ్యాకరణ దోషం, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సరైన ఫార్మాట్లో సీవీని రూపొందించుకోవాలి. అన్నింటికీ మించి విద్యార్థి నైపుణ్యాన్ని ఆయా కంపెనీలు గుర్తించాలి.
ఆప్టిట్యూడ్ టెస్ట్..
సరిగ్గా ఈ దశలోనే తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆప్టిట్యూడ్ పరీక్షలంటేనే ఆందోళన చెందుతారు. నిజానికి సరైన ప్రాక్టీస్ ఉంటే ఈ టెస్టులో నెగ్గుకురావడం సులువు. ఐక్యూ నైపుణ్యాలను పెంపొందించే పుస్తకాలను చదివి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. వీటి కోసం ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆన్లైన్లో మెళకువలను నేర్పిస్తున్నారు.
ఇంటర్వ్యూ..
అతి నమ్మకం, అత్యుత్సాహం ఉండొద్దు. ఇంటర్వ్యూలో ప్రశ్న పూర్తిగా అడిగే వరకు ఓపిక పట్టాలి. శ్రద్ధగా విని అడిగిందాన్ని తెలుసుకొని స్పష్టంగా జవాబు చెప్పాలి. అలాగే టాపిక్, సబ్జెక్టుపై మంచి అవగాహనతో సమాధానాలు చెప్పాలి.
ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్ టాపిక్ ఎంచుకోవాలి..
మీకు నచ్చిన సబ్జెక్టు, టాపిక్ ఏదేని ఇంటర్వ్యూలలో సాధారణంగా సంస్థలు అడగొచ్చు. వారు అడగ్గానే తమ కు నోటికి వచ్చింది చెప్పొద్దు. దానిపై కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అదీ కాదంటే తాము దేనిపై పనిచేస్తున్నా రో వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగొచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమకు సౌకర్యంగా అనిపించే టాపిక్స్ ఎంచుకోవడం మంచిది. ఈ విషయంలో ఆయా కంపెనీల్లో ఉద్యోగం పొందిన సీనియర్లతో మాట్లాడడం కూడా మంచిదే. లేదంటే యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఎలా ఉండాలో ఆన్లైన్లో మెళకువలను నేర్పిస్తున్నారు.
కొత్త నైపుణ్యాలను తొందరగా నేర్చుకోవాలి..
ఆయా కంపెనీల మానవ వనరుల విభాగాలు తాము తీసుకునే వ్యక్తులకు నైపుణ్యాలు ఏవైనా సరే, త్వరితగతిన నేర్చుకునే విధంగా ఉండాలని భావిస్తాయి. సాధారణంగా ఈ క్విక్ లెర్నర్లు పోటీల్లో ముందుంటారు. జాబ్ ప్రొఫైల్‌ను అనుసరించి సంబంధిత కోణంలో వివిధ నైపుణ్యాలను నేర్చుకొని అతి కొద్ది రోజుల్లోనే ఎక్స్‌పర్ట్‌గా మారొచ్చు. దీంతో కంపెనీ మేనేజ్మెంట్ను రిక్రూట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తాయి.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యాలు..
విద్యార్థులకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడగలిగి, రాయగలిగే విద్యార్థులకే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొద్ది మంది విద్యార్థులు మాత్రమే ఈ నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నారు. మా సిబ్బంది ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేలా ప్రత్యేకంగా తరగతులు నిర్వహించేది. ఈ ఏడాది ఆన్లైన్లో ఇంగ్లిష్‌పై అవగాహన ఇస్తున్నారు. ఇంగ్లిష్‌పై పట్టు కెరీర్ మొత్తానికి ఉపయోగపడుతుంది. అన్ని అర్హతలు, సామర్థ్యాలు ఉండి కూడా కేవలం ఇంగ్లిష్లేని లోపంతో ఉద్యోగానికి ఎంపిక కాలేని వారు ఉంటున్నారు. విషయాన్ని సమగ్రంగా ఇంగ్లిష్‌లో ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం ద్వారా పలు కంపెనీలకు విద్యార్థులు ఆకర్షితులవుతారు.
ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్..
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లకు సంబంధించి ఫండమెంటల్స్‌పై స్పష్టత లేదంటే ఉద్యోగ సాధన కష్టమే. సీ, సీ ప్లస్ ప్లస్, జావా తదితరాల్లో కనీసం ఒకదానిపై చక్కటి కమాండింగ్ చాలా అవసరం. ప్రస్తుతం ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రోగ్రాంలపై విద్యార్థులకు గతం నుంచే దృష్టి సారించే విధంగా మెళకువలను నేర్పాం.
బృందంగా పని చేయగలగాలి..
ఏటా ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులందరూ ఒకే టీంలా కలిసి పనిచేసి సిబ్బందితో అణుకువగా ఉండేవారు. దీంతో అటు పర్సనల్, ఇటు ప్రొఫెషనల్‌గా ఎదుగుదలకు దోహదపడింది. విద్యార్థులు తమకు తెలిసినవి సహచరులతో పంచుకోవాలి. ప్రాజెక్టులో విద్యార్థుల మధ్య కమ్యూనికేషన్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ ఏడాది ఆన్లైన్లో విద్యార్థులను ఒక టీంగా ఎంపిక చేసి వారికి ఏదైనా సందేహాలు వస్తే తీరుస్తున్నాం.
పర్సనల్ క్రెడిబులిటీ..
వ్యక్తిగతంగా, పని విషయంలో ఉద్యోగుల నుంచి నిజాయితీని కంపెనీలు కోరుకుంటాయి. ఇంటర్వ్యూ చేసే కంపెనీల వ్యక్తులు ఈ విషయాన్ని ముఖాముఖీ సమయంలోనే అంచనా వేస్తారు. కంపెనీ ప్రమాణాలతో రాజీ పడకుండా తమకిచ్చిన టాస్కులను ఎలా నెరవేరుస్తారో అన్న విషయాన్ని కనిపెడుతారు. పని ప్రదేశంలో నిజాయితీగా ఉండడం ద్వారా ఉద్యోగి ప్రయోజనం పొందుతాడు. స్నేహపూరిత స్వభావం, మంచి వ్యక్తిత్వం, ఎదుటి వారికి నమ్మకం కలిగించేలా చేయడం కారణంగా ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించవచ్చు. ఇప్పటి వరకు చర్చించుకున్న పై విషయాలన్నీ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలే. ఈ విషయంలో తగు జాగ్రత్తలు చాలా అవసరం. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి చేపడుతున్న ప్రాజెక్టులు, ఇతర స్టాఫ్ గురించి తెలుసుకోవడం మంచిది. వాటిపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందు ఫార్మల్ డ్రెస్‌లో హుందాగా ఉండడం మంచిది.
ఇప్పటి వరకు ఎంపికైన వారు..
బాసర ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్లుగా ఎందరో విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారు. 2013, 2014లో 57 కంపెనీలు క్యాంపస్‌కు రాగా అందులో 26 శాతం ఉద్యోగాలు సాధించారు. 2014-2015లో 54 కంపెనీలకు 21శాతం, 2015-16లో 48 కంపెనీలకు 42శాతం, 2016-17లో 47 కంపెనీలకు 36శాతం, 2017-18లో 64 కంపెనీలకు 41శాతం, 2018-19లో 77 కంపెనీలు రాగా 54శాతం, 2019-20లో 64 కంపెనీలు రాగా 61శాతం విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ప్రముఖ కంపెనీలు టీసీఎస్, క్యాబ్జెమినీ, మహీంద్ర, విప్రో, ఇన్ఫోసిస్, ఇలా పలు కంపెనీలు ఈ ఏడాది వస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించింది. పరీక్షల్లో ఎంపికైన వారిని త్వరలోనే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: హర్సిమ్రత్ కౌర్
- పిస్టల్‌తో బర్త్‌డే కేక్ కట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి కన్నుమూత
- ఇది సంక్రాంతి విజయం కాదు.. నిర్మాతలకు పెరిగిన నమ్మకం
- బీఈడీ తొలి విడుత సీట్లు కేటాయింపు
- ‘సలార్’లో యశ్ ఉన్నాడా..! పాన్ ఇండియన్ స్టార్స్ కలుస్తున్నారా..?
- ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..
- శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
- ‘కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పక్కాగా చేపట్టాలి’
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్