ఆదివారం 25 అక్టోబర్ 2020
Nirmal - Sep 25, 2020 , 02:28:16

కరోనా నుంచి సాధారణ స్థితికి జనం

కరోనా నుంచి సాధారణ స్థితికి జనం

  • యథాస్థితికి చేరిన జనజీవనం
  • n వైరస్‌తో సహజీవనం చేయడం నేర్చుకున్న ప్రజలు
  • n రహదారులు కిటకిట.. వ్యాపారాలు గలగల..
  • ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న ప్రయాణికులు
  • n హోటళ్లలో మళ్లీ గిరాకీ.. వ్యవసాయ పనులకు కూలీలు.. 
  • n గుంపులు వద్దు.. భౌతిక దూరమే ముద్దు.. 
  • n జీవనంలో భాగమైన మాస్కులు, శానిటైజర్లు
  • n పంచసూత్రాలు పాటిస్తే మేలంటున్న వైద్యులు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19 పేరు వినగానే భయపడిపోయేవారం. అలాంటి పరిస్థితి నుంచి జనం బయటపడుతున్నారు. వైరస్‌తో సహజీవనం చేయడం నేర్చుకుంటున్నారు. మార్చి నెలలో కరోనా కలవరం మొదలవగా.. ప్రస్తుతం ప్రజల్లో కాస్త ప్రశాంతత నెలకొంటున్నది. భయం తొలగిపోతుండగా.. అవగాహన, ధైర్యం పెరుగుతోంది. పట్టణాల్లో జనజీవనం యథాస్థితికి చేరుకొంటున్నది. రోడ్లు, వీధులు కళకళలాడుతుండగా.. ట్రాఫిక్‌ పెరుగుతున్నది. బయటకు వెళ్లాలంటే భయపడే స్థితి నుంచి తగిన జాగ్రత్త లు తీసుకుంటూ  ప్రయాణాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రజారవాణాలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. వ్యక్తిగత పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇలా అందరూ తమ పనులపై వె ళ్తుండడంతో సాధారణ స్థితికి వస్తున్నది. కూరగాయా ల మార్కెట్‌ నుంచి షాపింగ్‌ మాల్స్‌ వరకు వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నాయి. హోటళ్లలో మళ్లీ గిరా కీ పెరగగా.. టిఫిన్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి.

యథాస్థితికి జనం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, బోథ్‌, ఖానాపూర్‌, కాగజ్‌నగర్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్‌, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ రద్దీ పెరిగింది. వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతుండగా ప్రజలు అన్ని పనులు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాతో సహజీవనం చేస్తున్నారు. పనులు వాయిదా వేసుకోవడం లేదు. చాలా మంది మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తున్నారు. శానిటైజర్లు వాడుతున్నారు. పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకుంటున్నది.

తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. 

కరోనా కేసులు పెరిగినా.. త్వరగా రికవరీ కావడం, మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. మొదట్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండగా.. ప్రస్తుతం కాస్తా తగ్గుముఖం పట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. 10-12 రోజుల్లో కోలుకుంటుండడంతో భయపడడం లేదు. రోగ నిరోధకశక్తి అధికంగా ఉన్న వారికి ఇబ్బంది కాకపోయినా.. వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి కొంచెం సమస్యగా మారుతున్నది. అవసరం ఉంటేనే బయటకు రావాలని, తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కు, శానిటైజర్‌, భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపులుగా ఉండకపోవడం వంటి పంచ సూత్రాలు తప్పక పాటించాలని చెబుతున్నారు.

రోగులకు ఫోన్‌ చేసి  పరామర్శిస్తే మంచిది

ప్రధానంగా దవాఖానలకు వెళ్లొద్దని, అత్యవసరమైతేనే వెళ్లాలని సూచిస్తున్నారు. డెలివరీలు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు పేషెంట్లతో ఎక్కువ మంది వెళ్లడం, దవాఖానకు, ఇంటికి వెళ్లి పరామర్శించడం వంటి వాటితో మహమ్మారి విజృంభిస్తున్నది. రోగికి కరోనా లేకపోయినా.. వేరే రోగులకు ఉండడంతో వెంట వెళ్లిన వారికి సోకే ప్రమాదం ఉంది. ఆపరేషన్‌ అయిన పేషెంట్లకు ఇమ్యూనిటీ తగ్గగా.. ఇంటికి వచ్చి పరామర్శించిన వారిలో కొందరికి సోకుతున్నది. ఇటీవల కొన్ని మరణాలు కూడా జరిగాయి. దవాఖానలు, ఇండ్లకు నేరుగా వెళ్లి పరామర్శించే బదులు.. ఫోన్లలో మాట్లాడడం, దగ్గరి వారైతే వీడియోకాల్‌ చేస్తే అందరికి మంచిది. ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నందున.. అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ప్రైమరీ కాంటాక్టు అయిన వారు పరీక్షలు చేసుకుంటే మంచిది. అనుమానం ఉంటే హోం ఐసొలేషన్‌ కావ డం,  లక్షణాలు ఉంటే పరీక్ష చేసుకొని ఇంటి వద్ద నే మందులు వాడితే సరిపోతుంది.

 ఇంట్లో ఉంటే కుదరదు కదా..

కరోనాకు భయపడి ఇంట్లోనే ఉంటే కుదరదు కదా. పని చేసుకుంటేనే కదా కడుపులోకి వచ్చేది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూనే షాపు నడిపిస్తున్న. మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకుంటున్న. శానిటైజర్లు వాడుతున్న. గంటకోసారి చేతులు శుభ్రం చేసుకుంటున్నం. మా దగ్గరికి వచ్చే కస్టమర్లకు కూడా మాస్క్‌లు పెట్టుకోమని చెబుతున్నం. ఇక స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్తున్న.

- నోముల ప్రకాశ్‌, టైలర్‌, ఆసిఫాబాద్‌

భయం వద్దు.. నిర్లక్ష్యంగా ఉండొద్దు..

కరోనా విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నిర్లక్ష్యం కూడా పనికి రాదు. మా పోలీసు సిబ్బంది కరోనా సమయంలో ఎంతో ధైర్యంగా పనిచేశారు. చాలా మందికి కరోనా సోకింది. తగ్గిన తర్వాత మళ్లీ విధుల్లో చేరుతున్నారు. కరోనా వైరస్‌ ఉధృతి దాదాపుగా తగ్గింది. ఈ నేపథ్యంలో సాధారణ జనజీవనం నెలకొంటోంది. జనాలు మాస్కులు ధరించి బయటకొస్తున్నారు. అయితే వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బయటకొచ్చినప్పుడు పూర్తిగా మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం,  చేతులు శానిటైజేషన్‌ చేసుకోవడం మరువద్దు.     - నరేందర్‌, ఏసీపీ, జైపూర్‌


logo