శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nirmal - Sep 21, 2020 , 00:37:52

అగ్రిబిల్లులపై రైతుల ఆగ్రహం

అగ్రిబిల్లులపై రైతుల ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వ్యాపార, వాణిజ్య బిల్లు.. సేవల ఒప్పందాల బిల్లు.. నిత్యావసర సరుకుల సవరణ బిల్లుపై మండిపడుతున్నారు. ఈ బిల్లులు తమ కడుపుకొట్టి కార్పొరేట్‌ సంస్థల కడుపునింపే విధంగా ఉన్నాయని, వ్యవసాయం బడా బాబుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లు నిర్వీర్యమై, రైతులకు మద్దతు ధర దక్కక, వ్యాపారులు నిర్ణయించిన ధరకే పంట ఉత్పత్తులు అమ్మాల్సి వస్తుందని రైతులు ఫైర్‌ అవుతున్నారు. తమతో పాటు వినియోగదారులకు కూడా కీడుచేసేలా ఉన్నదని, పప్పుధాన్యాల కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందనే భావన అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. రైతుల మేలుకోరే సర్కారైతే బిల్లులను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. - నిర్మల్‌, నమస్తే తెలంగాణ 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు తమను నిండా ముంచే విధంగా ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కడుపుకొట్టి కార్పొరేట్‌ కంపెనీల కడుపునింపేలా ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగం పేర్కొంటున్నది. మూడు బిల్లుల్లో ఒకటి వ్యాపార, వాణిజ్య బిల్లు.. రెండోది సేవల ఒప్పందాల బిల్లు.. మూడోది నిత్యావసర సరుకుల సవరణ బిల్లులు ఉండగా.. ఇవీ తమకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, మా బతుకులను ఛిన్నాభిన్నం చేస్తాయని ఫైర్‌ అవుతున్నారు. మొదటి బిల్లు ప్రకారం.. రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చని, ఆ పంటలను పాన్‌కార్డు ఉన్న ఎవరైనా కొనవచ్చని పేర్కొంటున్నది. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పంటలను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. దీంతో రైతులకు మేలు జరుగుతున్నది. పసుపు పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉండగా.. పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టనట్లు వ్యవహరిస్తున్నది. దీంతో రైతులు నిజామాబాద్‌, మహారాష్ట్ర వెళ్లి విక్రయిస్తున్నారు. కనీస ధర లభించకపోగా.. సుదూర ప్రాంతాలకు వెళ్లినందుకు వారు అడిగిన ధరకు విక్రయించి వస్తున్నారు. మిర్చి విషయంలోనూ మహారాష్ట్ర తీసుకెళ్లి.. వారు అడిగినంతకు విక్రయించి వస్తున్నారు. చాలా వరకు స్థానిక మార్కెట్‌లోనే స్థానిక వ్యాపారులకు విక్రయిస్తు న్నారు. అలాంటిది స్థానిక రైతులు ఇతర రాష్ర్టాలకు వెళ్లి పంటలను అమ్ముకోవడం సాధ్యం కాదు. నిల్వ చేసేందుకు తగిన గోదాంలు లేక.. ఇతర రాష్ర్టాలకు రవాణా చేసే స్థోమత లేక దళారులు, వ్యాపారులు చెప్పిన ధరకు విక్రయించాల్సి వస్తది.

మక్క రైతులపై పిడుగు.. 

రెండోదైన సేవల ఒప్పంద బిల్లు ప్రకారం వ్యవసాయ రంగం కార్పొరేట్‌ గుప్పిట్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఏ పంట వేయాలి? ఎలా సాగు చేయాలి? ఏ పంట ఎంత ధరకు అమ్మాలి? అనేవి కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఫలితంగా రైతులకు ఎలాంటి అధికారం లేకుండా పోతుంది. కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన ధరనే చెల్లిస్తారు. దిగుమతి తీరుపైనా షరతులు పెట్టడంతోపాటు ఆ మేరకు పంట రాకుంటే కొనుగోలుకు నిరాకరిస్తాయి. ఒప్పందం పూర్తయ్యే వరకు ఆ భూమిపై కంపెనీకి హక్కులుంటాయి. ఇప్పటికే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. తమకు నష్టమని తెలిసినా.. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి వివిధ పంటలు కొనుగోలు చేస్తున్నది. మక్కజొన్న పంటకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోయినా.. క్వింటాల్‌కు రూ.1,760 చొప్పున తెలంగాణ సర్కారు కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1,100 ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టింది. రవాణా, గోదాంల నిల్వలు అన్ని కలిపి క్వింటాలుకు రూ.2,100 వరకు కాగా.. కేంద్రం మాత్రం మక్కల దిగుమతికి అనుమతి ఇచ్చి రాయితీలను ఇస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 13 లక్షల క్వింటాళ్ల మక్కలు కొనగా.. వీటిని గోదాంలు, స్కూళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో నిల్వ చేశారు. నిర్మల్‌ జిల్లాలో 12.70 లక్షల క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 24వేల క్వింటాళ్ల మక్కలను రూ.1,760 చొప్పున చెల్లించి.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మక్కలకు మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు.

మీటర్లు పెట్టి ముక్కుపిండి వసూలు చేస్తరు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,18,174 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొమ్మిది గంటలతోపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేయగా.. 2018 జనవరి 1 నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది. నిర్మల్‌ జిల్లాలో 51వేలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 25,874, ఆసిఫాబాద్‌ జిల్లాలో 6,300, మంచిర్యాల జిల్లాలో 35వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రైతులకు ఉచిత విద్యుత్‌ 24 గంటలపాటు సరఫరా చేస్తుండడంతో.. బోరుబావుల కింద సాగుకు ఢోకా లేకుండా పోయింది. మిషన్‌ కాకతీయతో చెరువులు నిండడం, భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో పంటలు బాగా పండుతున్నాయి. కానీ.. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ చట్టంతో అన్ని వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో మోటర్లకు మీటర్లు పెట్టి.. ముక్కు పిండి బిల్లులు వసూలు చేసి.. తర్వాత రాయితీలు ఇస్తామని చెబుతున్నారు. దీంతో రైతులకు ఆర్థికంగా భారం కానున్నది.  పేదలు, విద్యుత్‌ ఉద్యోగులు, అన్ని వర్గాల వారు నష్టపోయే అవకాశం ఉంది. 

కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది..

కేంద్రం తీసుకొచ్చిన మూడో బిల్లు.. నిత్యావసర సరుకుల సవరణతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదనే భావన వ్యక్తమవుతున్నది. మంచి ధర వచ్చే వరకు రైతులు తమ పంటలను నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరగనున్నాయి. దీంతో బడావ్యాపా రులు, కార్పొరేట్‌ సంస్థలు ఒకేసారి కొనుగోలు చేసి.. నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. దీంతో బహిరంగ మార్కెట్‌లో పప్పులు, నూనెగింజలు అధిక ధరలకు విక్రయించనున్నారు. దీంతో రైతులతోపాటు వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులకు నిల్వ చేసే పరిస్థితి, సామర్థ్యం లేక పంట పండిన వెంటనే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్న పంటలు కాకుండా.. వేరే పంటలు బహిరంగ మార్కెట్‌లో దళారులు, వ్యాపారులు అడిగిన ధరకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మూడు బిల్లులు రైతుల నడ్డి విరి చేలా ఉన్నాయి. రైతులకు అన్యాయం జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీ చూ స్తూ ఊరుకోదు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా ఉన్నారు. రైతుల అనేక మంచి నిర్ణయాలు తీసుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కేంద్ర సర్కారు కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కు పిండి బిల్లులు వసూలు చేసి.. తర్వాత రాయితీలు ఇస్తామంటు న్నది.రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. గ్రామస్థా యి నుంచి ఢిల్లీ వరకు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులంతా పోరాటం చేస్తాం. రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేసే కుట్ర సాగుతున్నది. కార్పొరేట్‌ శక్తులకు ద్వారాలు తెరిచి వ్యవసాయదారులను నిండా ముంచాలని చూస్తున్నరు. పంటలను ఏ రాష్ట్రంలో అయినా విక్రయిం చవచ్చంటే.. ఇతర రాష్ర్టాలకు తీసుకెళ్లేందుకు రవాణా, గోదాంలు లేవని, ఆ శక్తి రైతులకు లేదు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ రాష్ర్టానికి చెందిన అకాలీదళ్‌ పార్టీకి చెందిన హరిసిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలి. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ర్టాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. విదేశాల నుంచి మక్క లు దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో.. ఇక్కడి రైతులకు నష్టం వాటిల్లుతున్నది. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసు కున్న నిర్ణయానికి మేమంతా మద్దతు ఇస్తున్నాం.    - మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి

సారంగాపూర్‌ : కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి. మక్కలను కొనుగోలు చేయననడం సరైన పద్ధతి కాదు. దేశంలో మక్కజొక్క పంట అధికంగా ఉత్పత్తి అవుతుంటే విదేశాల నుంచి కొనుగోలు చేస్తాననడం రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నట్లే. పండించిన పంటను మార్కెట్‌లో అమ్ముకుందామంటే కొనేవారు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మక్కలు పండించిన రైతులకు మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. మొండివైఖరిని విడనాడి రైతులకు గిట్టుబాటు ధరతోపాటు మక్కలను కొనుగోలు చేయాలి. అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు.        - ఎస్‌కే ఎజాస్‌, జామ్‌, సారంగాపూర్‌ మండలం.

దండేపల్లి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతు లోకానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. రైతులను దెబ్బతీసి, కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లును ప్రతి రైతు వ్యతిరేకించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో లాభం చేకూర్చే పథకాలు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం రైతులను ముంచే పరిస్థితి తీసుకొస్తున్నది. ఇప్పటి వరకు మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్నీ రాష్ట్ర పరిధిలో ఉంటే, కేంద్రం తెచ్చే ఈ బిల్లుతో అన్ని కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. దేశంలోని రైతులను కూలీలుగా మార్చే కేంద్ర సర్కారుకు ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలి.- కొడపర్తి గంగాధర్‌, రైతు, కాసిపేట, దండేపల్లి మండలం.

రాష్ర్టాన్ని చూసి కేంద్రం నేర్చుకోవాలి..

ఖానాపూర్‌ : కేంద్ర సర్కారోళ్లు రాష్ట్ర సర్కారును చూసి నేర్చుకోవాలి. రైతులను ఇబ్బందులు పెట్టే ఏ ఒక్క బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదు. దేశంలో మొదటిసారి రైతులకు రైతుబంధు, రైతుబీమా చెల్లించిన రాష్ట్ర సర్కారును చూసి కేంద్రం నేర్చుకోవాలి. ఐదు గుంటల భూమి కలిగిన వారిని కూడా రైతుగా భావించి రైతుబంధుతోపాటు, రైతుబీమా అందిస్తున్నది. కానీ.. కేంద్ర సర్కారు నిర్ణయం సరైంది కాదు. అంతకుమించి రైతులకు న్యాయం చేయాలి కానీ, కార్పొరేట్‌ వ్యవస్థలకు అనుకూలంగా ఉండడం తగదు.- గొర్రె గంగవ్వ, రైతు, ఖానాపూర్‌.

ఖానాపూర్‌ : కేంద్ర సర్కారు రైతులపై చిన్నచూపు చూస్తున్నది. దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందులకు గురిచేసే కుట్రలు పన్నుతున్నది. రైతు కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్‌ రైతులకు అనేక ప్రయోజన పథకాలు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి సాగు నీటిని అందిస్తున్నారు. వేలాది ఎకరాలు సాగులోకి వచ్చి అద్భుతమైన పంటలు పండుతున్నాయి.- సంగర్తి ముత్తన్న, రైతు, ఖానాపూర్‌. 
ఖానాపూర్‌ : కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నిర్మాణంతో ఇవ్వాళ దేశంలో ఎక్కడాలేని విధంగా పంట పొలాలకు సాగునీటిని అందించే అద్భుతమైన కట్టడం. అది దేశానికే ఆదర్శం. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో అధికంగా రైతులకు కేటాయించడం అభినందనీయం. కానీ.. కేంద్ర ప్రభుత్వ చర్యలు మాత్రం సరికాదు. తక్షణమే కేంద్ర వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలి. - నర్రకుంట్ల బద్దెన్న, రైతు, ఖానాపూర్‌.
కుంటాల : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మద్దతు ధరపై డిమాండ్‌ చేసే హక్కును కోల్పోతారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాసే విధంగా బీజేపీ ప్రభుత్వం పేద రైతులపై పిడుగు వేస్తున్నది. నేల తల్లిని నమ్ముకొని పండించే పంటలకు కార్పొరేట్‌ కంపెనీలు నిర్ణయించిన ధరకే విక్రయించుకొనే దుస్థితిని తీసుకొస్తున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ రైతును రాజు చేయాలనీ ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని అన్నదాత నోట్లో మట్టి కొడుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. - కుమ్మరి ముత్యం, రైతు, కుంటాల మండలం
కుంటాల : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమనాయకుడు కేసీఆర్‌ వ్యవసాయన్ని లాభాల బాట పట్టిచ్చిండు. నిరంతర కరెంట్‌ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, రాయితీ విత్తనాలు, ఎరువులు అందజేసి గిట్టుబాటు ధరలను కల్పిస్తూ ఆదుకుంటున్నడు. మక్కజొన్న వేసుకొని లాభాలు గడించే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడే అవకాశముంది. బడా వ్యాపారులు ఒక్కటై మక్కజొన్నలను తక్కువ ధరకే కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచే అవకాశం కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్‌ సూచనతో వచ్చే యాసంగిలో మక్కజొన్న పంట వేద్దాం అనుకున్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందోళనకు గురిచేస్తున్నది. మాలాంటి పేద రైతులకు అండగా నిలిచిన కేసీఆర్‌ సారు కేంద్రంపై రైతుల హక్కుల కోసం పోరాడాలని కోరుతున్నాం.- లింగన్న, రైతు, అంబకంటి, కుంటాల మండలం