మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Sep 19, 2020 , 02:20:53

‘ముంపు’ పేరిట భూ దాహం

‘ముంపు’ పేరిట భూ దాహం

  • ఎస్సారెస్పీ నిర్వాసితుల పేరుతో భూ కేటాయింపులు 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : భైంసా మండలం సుంక్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబీకులకు చెందిన భూములు లోకేశ్వరం మండలం రాయపూర్‌ కాండ్లిలో ఉండగా, ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో ఈ భూములు ముంపునకు గురయ్యాయి. దీంతో సదరు ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యుల పేరిట ముథోల్‌ మండలం చింతకుంట రిహాబిలిటేషన్‌ సెంటర్‌ (ఆర్సీ)లో డీ-1 పట్టాలు జారీ చేశారు. సదరు ప్రభుత్వ ఉద్యోగి పేరిట 5.10 ఎకరాలు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట మరో 5.04 ఎకరాల భూమి పొందారు. మళ్లీ అదే ప్రభుత్వ ఉద్యోగి పేరుతో చింతకుంట ఆర్సీలో రెండోసారి 5.01ఎకరాల భూమి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో రాయపూర్‌ కాండ్లికి చెందిన ఒక వ్యక్తి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని.. రెండోసారి అక్రమంగా భూములు పొందినట్లు తెలిసింది. ఈ భూములను సదరు వ్యక్తి సాదాబైనామా ద్వారా తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకుని.. వేరే వారికి విక్రయించి భారీగా డబ్బులు సొమ్ము చేసుకున్నారు. లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లికి చెందిన ఒకరి భూములు ఎస్సారెస్పీలో ముంపునకు గురికాగా, వారికి గతంలో 5.10 ఎకరాలకు డీ-1 పట్టా కేటాయించారు. మళ్లీ వారి పేరుతో 5.06 ఎకరాలకు డీ-1 పట్టాను అక్రమంగా తెచ్చి సర్కారు భూములు పొందారు. ఈ వ్యవహారంలో ఇదే గ్రామానికి ఒకరు కీలక పాత్ర పోషించగా.. తర్వాత తమ కుటుంబం పేరుతో సాదాబైనామాలో భూబదలాయింపు చేసుకున్నారు. ఇందులో అప్పటి తహసీల్దారుతో పాటు అదే గ్రామానికి చెందిన ఒక వీఆర్‌ఏ.. ఈ అక్రమాలకు వంత పడారు. రాయపూర్‌ కాండ్లిలో 7 ఎకరాల భూమి (ఖరీజ్‌ఖాతా) ఉండగా, ఈ భూములను సదరు వీఆర్‌ఏతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి డీ-1 పట్టాలు లేకుండానే ఎల్‌ఆర్‌యూపీలో నమోదు చేసుకున్నారు. దీంతో అప్పటి తహసీల్దారు సదరు వీఆర్‌ఏను సస్పెన్షన్‌ చేయగా.. తిరిగి భూమిని ప్రభుత్వ పరం చేశారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే..!

ఇలా చెప్పుకుంటూ పోతే.. వందల సంఖ్యలో అక్రమంగా డబుల్‌, నకిలీ, బోగస్‌ డీ-1 పట్టాల పేరుతో భూ దందా సాగుతోంది. బాసర, ముథోల్‌, లోకేశ్వరం, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జి), నిర్మల్‌ రూరల్‌, మామడ, లక్ష్మణచాంద మండలాల్లో ఎస్సారెస్పీ ముంపు భూములు డీ-1 పట్టాల పేరిట పెద్ద ఎత్తున భూదందా ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం నష్ట పరిహారంతో పాటు కుటుంబానికి ఐదెకరాల చొప్పున భూములను కేటాయించింది. ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో నిజామాబాద్‌, ప్రస్తుత నిర్మల్‌ జిల్లాల్లో 97,800 ఎకరాల భూమిని సేకరించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు డీ-1 పట్టాలను జారీ చేసి.. ఐదెకరాల ప్రభుత్వ భూములను ఇచ్చేలా జీవో నంబరు 1030, తేదీ : 07.10.1968న జారీ చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి నాలుగైదు దశాబ్దాలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ బోగస్‌, నకిలీ, డబుల్‌ డీ-1 పట్టాల పేరుతో భూ కేటాయింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో అసలు నిర్వాసితులకు డీ-1 పట్టాల విషయం తెలియకుండానే.. కొందరు మధ్యవర్తులు, దళారులు, రెవెన్యూ అధికారులతో కలిసి భూముల దందా సాగిస్తున్నారు. బాసర, ముథోల్‌, లోకేశ్వరం, మామడ, లక్ష్మణచాంద, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జీ) మండలాల్లో కొందరు మధ్యవర్తులు, దళారులు డీ-1 పట్టాల పేరిట భూముల దందా సాగిస్తున్నారు. గతంలో భూములు కోల్పోయిన వారిలో కొందరు.. భూములను తీసుకోలేదు. వీరి వద్ద ఉన్న పట్టాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారి పేరిట భూ కేటాయింపులు చేసి తమ పేరిటా రిజిస్ట్రేషన్‌ చేసుకుని విక్రయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చాలా వరకు అక్రమంగా నకిలీ, బోగస్‌, డబుల్‌ డీ-1 పట్టాలు తీసుకుని భూ కేటాయింపుల దందా జోరందుకుంది. గతంలో భూములు పొందిన వారి పేరుతో మళ్లీ డీ-1 పట్టాలు తీసుకుని.. రెండోసారి భూముల కేటాయింపు చేసుకుంటున్నారు. కొందరికి మాత్రం కొన్ని డబ్బులు ఇచ్చి సర్దుబాటు చేస్తున్నారు. వాస్తవానికి వీటిలో చాలా మంది నిర్వాసితులు కాకున్నా వారి పేరుతో డీ-1 పట్టాలు రావడం గమనార్హం. చాలా మంది ముంపు నిర్వాసితులకు రెండోసారి డీ-1 పట్టాల జారీ, భూ కేటాయింపులు, విక్రయం జరిగిన విషయం తెలియకుండా అంతా గుట్టుగా చేస్తున్నారు. మరికొందరికి కొన్ని డబ్బులు ముట్టజెప్పి.. భూ కేటాయింపులు, బదలాయింపులు, విక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని సాదాబైనామా, ఆర్వోఆర్‌లో తమ పేరిట భూ బదలాయింపు చేసుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో అక్రమాలు తేలినప్పుడు నిర్వాసితులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మధ్యవర్తులు, దళారులు మాత్రం భూములు అమ్మేసి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఒకటే ఫైల్‌ నంబర్‌పై రెండు డీ-1 పట్టాలు తెస్తుండగా, వీటికి అధికారులు భూములను కేటాయిస్తున్నారు. ఎస్సారెస్పీ నిర్వాసిత గ్రామాలతో పాటు కొందరు దళారులు, మధ్యవర్తులు ఇదే దందా చేస్తున్నారు. ప్రతి ఎకరానికీ రూ.30-50 వేలను అధికారులకు ముట్టజెప్పుతున్నారు. స్థాని క వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముథోల్‌, లోకేశ్వరం మండలాల్లో కొందరు తహసీల్దార్లు అక్రమంగా భూ కేటాయింపులు చేసి.. పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. కొందరు మధ్యవర్తులు, దళారులు ఇప్పటికీ అదే భూదందా చేస్తున్నారు. ఓ వీఆర్‌ఏ ఈ డీ-1 పట్టాల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించగా.. స్థానికంగా ఉండే ఒకరితో కలిసి పెద్ద ఎత్తున భూదందా చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కొన్ని అక్రమాలు వెలుగు చూడగా.. ఇందులో బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ మళ్లీ విధుల్లో చేరి.. అక్రమాల తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. వాస్తవానికి నిర్వాసితులకు ఒకసారి భూమి కేటాయించాక.. మళ్లీ భూములు కేటాయించడానికి లేదు. నిర్వాసితులకు మాత్రమే భూములు కేటాయించాల్సి ఉండగా.. నిర్వాసితులు కాని వారికి, రెండు, మూడు సార్లు కేటాయించడం విశేషం. అదీకాక ఈ భూములను సాదాబైనామా, ఆర్వోఆర్‌లో భూబదలాయింపు చేయడానికి అధికారం లేకున్నా.. విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు.logo