గురువారం 22 అక్టోబర్ 2020
Nirmal - Sep 17, 2020 , 02:52:49

రెవెన్యూ అధికారుల భూదందా

రెవెన్యూ అధికారుల భూదందా

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : పొరుగు జిల్లాల్లో భూదందాలు, అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులు నిర్మల్‌ జిల్లాలోనూ భూదందా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నష్టపరిహారం చెల్లించిన భూములను కూడా క్రయవిక్రయాలు చేశారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారికి రెవెన్యూ అధికారులు సహకరించడం, తమ బంధువుల పేరిట పట్టాలు చేసుకోవడం వెలుగులోకి వచ్చాయి. తాజాగా పొరుగు జిల్లాల్లో భూదందాలు, భూఅక్రమాల్లో బాధ్యులైన రెవెన్యూ అధికారులపై సర్కారు వేటు వేయడంతో జిల్లాలోనూ చర్చ సాగుతున్నది. ప్రాజెక్టులు, కాలువల కింద భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుంది. ఎస్సారెస్పీ ముంపు భూములకు సర్కారు నష్ట పరిహారం చెల్లించాక కూడా..ఆ భూములను మళ్లీ కొనుగోలు చేసి సాదాబైనామాలో తమ బంధువుల పేరిట పట్టాలు పొందారు. ఈ వ్యవహారంలో ఓ రెవెన్యూ అధికారి హస్తం ఉండగా.. మరో అధికారి పూర్తిస్థాయిలో సహకరించారు. కాళేశ్వరం ప్యాకేజీ-28 కాలువ తవ్వకం కోసం సేకరించిన భూములకు పరిహారం పొందాక.. మళ్లీ విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలోనూ బాధ్యులకు రెవెన్యూ అధికారులు సహకరించటం కొసమెరుపు.

నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో భూసేకరణ

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నిర్మాణ సమయంలో నిజామాబాద్‌, ప్రస్తుత నిర్మల్‌ జిల్లాల్లో 97,800 ఎకరాల భూమిని సేకరించారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1,091 అడుగులు కాగా.. 1,093 అడుగుల వరకు అవసరమైన భూమి ని తీసుకున్నారు. 1,091-1,093 అడుగుల మధ్య 8,700 ఎకరాల భూమిని సేకరించగా.. ఇందులో నిర్మల్‌ జిల్లాలో 5,200 ఎకరాల భూములు తీసుకున్నారు. 1,091 అడుగులకే పూర్తి స్థాయి నీటి నిల్వలు నిర్వహిస్తుండగా.. 1091-1093 అడుగుల మధ్య ముంపునకు గురికాని భూములను పాత పట్టాదారులు సాగు చేస్తుండగా.. కొన్ని చోట్ల వేరే వారికి లీజుకు ఇచ్చారు. మరికొందరు విక్రయిస్తున్నారు. రికార్డుల్లో మాత్రం పాత రైతుల పేరిట పహాణీలు ఉండగా.. పట్టాదారు పాసుపుస్తకాలు ఉండడంతో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతున్నారు. కొందరు ఎకరానికి రూ.లక్ష నుంచి 2 లక్షలకు విక్రయించారు. బాసర మండలంలో చాలా భూములను అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించగా.. పొరుగు జిల్లాలో పని చేసే ఓ రెవెన్యూ అధికారి సుమారు 100 ఎకరాల వరకు ముంపు నిర్వాసితుల నుంచి కొనుగోలు చేసి సాదాబైనామాలో పట్టాలు చేసుకున్నాడు. ఈ భూముల్లో చేపల చెరువులు తవ్వి షెడ్లు కూ డా వేశారు. రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖల ఆధ్వర్యంలో జాయింట్‌ సర్వే చేయగా.. పరిహారం పొందిన భూముల్లో అక్రమ తవ్వకాలు చేశారని గుర్తించారు. అప్పటి జిల్లా అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు ఈ భూములను డీ-నోటిఫైడ్‌ చేసి ఉన్నతాధికారులకు నివేదించారు.  

బాధ్యులపై చర్యలు శూన్యం

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలో కాళేశ్వరం ప్యాకేజీ-28 కుడి ప్రధాన కాలువకు 2016లో 36 ఎకరాల భూమిని సేకరించగా.. సర్వే నంబరు 62, 82లో 5.22 గుంటల భూమిని తీసుకున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకున్నాక.. ఇదే భూమిని వాయుదూత్‌ సోలార్‌ ఫర్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రిజిస్ట్రేషన్‌ చేశారు. సదరు సోలార్‌ కంపెనీ వారు ఈ భూములను మ్యుటేషన్‌ చేసుకుని.. నాలా కన్వర్షన్‌(నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దారు నాలా ప్రతిపాదనలు పంపగా.. అప్పటి ఆర్డీవో అనుమతులిచ్చారు. ఈ భూమిలో నాలుగెకరాలను సదరు సోలార్‌ కంపెనీ వారు తమ ప్రహరీ లోపల కలుపుకోవటంతో ఈ భూమిపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై కొన్ని నెలల క్రితం జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. భూసేకరణ సమయంలో, సోలార్‌ ప్లాంటుకు విక్రయించాక మ్యుటేషన్‌, నాలా కన్వర్షన్‌ చేసిన సమయంలో ఒకే తహసీల్దార్‌ ఉండగా.. అప్పటి ఆర్డీవో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నాలా కన్వర్షన్‌ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన అప్పటి తహసీల్దార్‌, ఆర్డీవోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని మోసం చేసిన పట్టాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నివేదికలో తెలిపారు. ఇప్పటి వరకు బాధ్యులైన అప్పటి అధికారులపై చర్యలు లేవు. పట్టాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు ముథోల్‌ ప్రస్తుత తహసీల్దారు ఫిర్యాదు ఇవ్వగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భూమిని తమ ఆధీనంలోకి ఇవ్వాలని ఇరిగేషన్‌శాఖ అధికారులు.. తహసీల్దారుకు లేఖ రాశారు. దీంతో జిల్లా కలెక్టర్‌ నుంచి స్పష్టత తీసుకున్న తహసీల్దారు.. భూమిని స్వాధీనం చేయాలని సదరు కంపెనీ వారికి నోటీసులు ఇచ్చారు. దీంతో సదరు కంపెనీ హైకోర్టును ఆశ్రయించి.. తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. 

పట్టాదారులకు తెలియకుండానే ఇతరులకు పట్టా..

ఎస్సారెస్పీలో భూములు కోల్పోయిన నిర్వాసితుల భూములను కూడా సాదాబైనామాలు, ఆర్వోఆర్‌ ద్వారా 2016లో నిబంధనలకు విరుద్ధంగా పట్టా మార్పిడి చేశారు. నిర్వాసితులకు తెలియకుండానే పట్టాలు జరుగుతుండడం విశేషం. కొందరు దళారులు, మధ్యవర్తులు రెవెన్యూ అధికారులతో కలిసి సర్కారు భూములను కాజేస్తున్నారు. లోకేశ్వరం, ముథోల్‌ మండలాల్లోని కొందరు రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపించింది. లోకేశ్వరం మండలంలోని ఓ వీఆర్‌ఏ ద్వారా అక్రమ దందా నడిపిస్తున్నారు. గతంలో ముథోల్‌ మండలంలో పని చేసిన తహసీల్దారు చనిపోగా.. ఆయన పేరిట ఫోర్జరీ సంతకాలతో భూముల బదలాయింపు చేస్తుండటం కొసమెరుపు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులే.. అక్రమార్కులకు సహకరించడం, తామే బంధువుల పేరిట కొనుగోలు చేసిన వ్యవహారాల్లో బాధ్యులైన వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. ఈ వ్యవహారాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని, అప్పట్లో పనిచేసిన అధికారులపై క్రిమినల్‌ చర్యలతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్‌, శాఖాపరమైన చర్యలు లేకపోగా.. తాజాగా వేరే జిల్లాల్లో భూదందాల్లో అక్రమాలు వెలుగు చూసి సస్పెన్షన్‌కు గురికావడం, ఏసీబీకి చిక్కటం గమనార్హం. ఎస్సారెస్పీ ముంపు భూములకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులు కూడా పొందినట్లు గుర్తించినా.. రికవరీ చేయలేదు. ఇక భూముల్లో అక్రమ నిర్మాణాలను కూడా తొలగించగా.. వీటిని ప్రభుత్వ అవసరాలకు అప్పగిస్తున్నారు. బాసరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. టీఎస్‌ఐఐసీకి 600 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు లేఖ కూడా రాశారు. తాజాగా అసెంబ్లీలో కూడా ఈ విషయంపై చర్చకు వచ్చింది.


logo