ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి

లక్ష్మణచాంద: ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంగా మారిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. వడ్యాల్ గ్రామంలోని రాజరాజేశ్వర ఫంక్షన్హాల్లో కల్యాణ లక్ష్మి చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పేదింటిలో ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తూ, ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లోనే 75 శాతం కాన్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాలికా విద్యకు మరింత ప్రో త్సాహం అందిస్తున్నామని చెప్పారు. కస్తూర్బా విద్యాలయాలతో పాటు మరిన్ని పాఠశాలల ద్వారా బడిమానేసిన బాలికలను మళ్లీ చదువుల వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రమే టాప్‌లో నిలిచిందని పేర్కొన్నారు. నాయకులు రాంకిషన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, వడ్యాల్ గ్రా మ సర్పంచ్ అట్ల లలిత, తహసీల్దార్ సత్యనారాయణరావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లాలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రికికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 500 ఆలయాల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నో ఆలయాలు నిరాదరణకు గురయ్యాయని, వాటికి నిధులు మంజూరు చేసి ధూపదీప నైవేద్యాలతో పునర్వైభవం తీసుకువచ్చామని చెప్పారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్క రూ భక్తి భావనను అలవర్చుకోవాలని తెలిపారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రంత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు ఆకోజి కిషన్, సోమేశ్, శ్రీనివాస్, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్ ఉన్నారు.