‘కోల’ కలకలం..

- n అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బినామీ జీవన్‌గౌడ్ జిల్లావాసి
- n ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కోల అరెస్టు
- n గతంలో రాజకీయం.. ప్రస్తుతం సినీ, రియల్ దందా..
నిర్మల్, నమస్తే తెలంగాణ : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అవినీతి వ్యవహారంతో నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగేశ్‌కు బినామీగా ఉన్న కోల జీవన్‌గౌడ్ అరెస్టు కావడం తో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లా న ర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్‌కు వీలుగా ఎన్వోసీ జారీ విషయంలో రూ.1.12 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదరగా.. రూ.40 లక్షలు ముట్టజెప్పినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మిగతా రూ.72 లక్షల బదులుగా వారు కొనుగోలు చేస్తున్న ఆ భూమిలో నుంచి ఐదెకరాల భూమిని తన బినామీగా ఉన్న కోల జీవన్‌గౌడ్ పేరిట రిజిస్ట్రేషన్ చేసేలా నగేశ్ వారితో ఒప్పందం చేసుకున్నాడు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూడగా.. బాధితుడి నుంచి నగేశ్ తీసుకున్న లంచం సొమ్మును ఆయన బినామీ జీవన్‌గౌడ్ బ్యాంకుకు తీసుకెళ్లి జమ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో నగేశ్, జీవన్గౌడ్ల మధ్య ఉన్న బంధం ఎలాంటితో పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది.
నిర్మల్ జిల్లా మామడ మండలానికి చెందిన కోల జీవన్‌గౌడ్ గతంలో ఓ ప్రధాన విపక్ష పార్టీలో ఉంటూ.. రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఆయన భార్య మామడ మండల జడ్పీటీసీ సభ్యురాలిగా ఉండగా.. ఆయన సర్పంచ్‌గా కూడా పని చేశారు. ఆయనకు మామడ, నిర్మల్‌లో నివాసాలు, ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికీ నిర్మల్‌లో కొన్ని ఆస్తు లు, ఇండ్లు ఉన్నాయని.. అద్దెకు ఇచ్చారని చెబుతున్నారు. ఓ పాత సినిమా థియేటర్లో భాగస్వామిగా కూడా ఉన్నారని సమాచారం. గత కొన్నేళ్ల కిత్రమే హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ సినీ, రియల్ ఎస్టేట్ రంగంలో దిగారు. కొన్ని సినిమాలకు ఫైనాన్షియర్‌గా, నిర్మాతగా పని చేశారని చెబుతున్నారు. ఆయనకు సినీ, రాజకీయ రంగాలతోపాటు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌లతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కొంతమంది ఐఏఎస్‌లను రెగ్యులర్‌గా కలుస్తుంటారని.. పార్టీలు, విందులు చేసుకుంటారనే చర్చ నడుస్తున్నది. గతంలో నిర్మల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పని చేసిన పలువురు ఐఏఎస్‌లతో సంబంధాలున్నాయనే చర్చ సాగుతున్నది.
నగేశ్ నిర్మల్ డీఆర్వోగా పనిచేసినప్పుడే కోలాకు పరిచయం
తాజాగా మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కూడా నిర్మల్ డీఆర్వోగా ఉన్నప్పుడే.. జీవన్గౌడ్తో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. వివాదాస్పద భూములను గుర్తించి.. వాటి పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తుంటారనే పేరుంది. ఇలాగే నగేశ్‌తో జీవన్‌గౌడ్‌కు మధ్య నమ్మకం, సాన్నిహిత్యం పెరిగి బినామీగా మారినట్లు తెలుస్తున్నది. నగేశ్‌ది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వెల్గటూరు. నిర్మల్ డీఆర్వోగా ఉన్న శివలింగయ్య.. పదోన్నతిపై మహబూబాబాద్ కలెక్టర్‌గా వెళ్లాక.. ఆయన స్థానంలో డీఆర్వోగా నగేశ్ వచ్చారు. 2016లో వచ్చిన ఆయన సుమారు ఎనిమిది నెలలపాటు డీఆర్వోగా పనిచేసి మెదక్ డీఆర్వోగా వెళ్లారు. అక్కడే పదోన్నతి లభించి అదనపు కలెక్టర్‌గా నియామకమయ్యారు. జిల్లాలోనూ కొన్ని వివాదాస్పద భూముల విషయంలో వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య నిర్మల్‌లో మొదలైన పరిచయం, అనుబంధం కాస్తా.. మెదక్ జిల్లాలో ఏసీబీ దాడులతో వెలుగులోకి వచ్చింది.
సంబంధాలపై ఏసీబీ అధికారుల ఆరా..
అదనపు కలెక్టర్ నగేశ్ వ్యవహారంలో అరెస్టు అయిన కోల జీవన్‌గౌడ్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఏ మేరకు సంబంధాలు ఉన్నాయి? ఎవరెవరికి బినామీగా ఉన్నారు? అనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పని చేసిన కొందరు ఐఏఎస్‌లతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పని చేసిన కొందరు ఐఏఎస్‌లు, ఉన్నతాధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మొత్తానికి అదనపు కలెక్టర్ నగేశ్ అవినీతి వ్యవహారంలో జిల్లాకు చెందిన జీవన్‌గౌడ్ అరెస్టు కావడం అటు రాజకీయ వర్గాలతోపాటు ఇటు సామాన్య ప్రజల్లోనూ కలకలం రేకెత్తిస్తున్నది. జీవన్‌గౌడ్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం.. అదనపు కలెక్టర్ నగేశ్ జిల్లాలో పని చేయడంతో.. వీరిద్దరి మధ్య జిల్లాలోనూ ఏవైనా భూలావాదేవీలు జరిగాయా? అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది.
తాజావార్తలు
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష
- ‘వెన్నెల చిరునవ్వై’ సాంగ్ లాంఛ్ చేసిన శంకర్