బహుకళాకోవిదుడు ఈ మాస్టారు

సామల సదాశివ మాస్టారు.. ఈ పేరును సాహితీ ప్రియులు ఎన్నటికీ మరిచిపోరు.. ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటిన మేధావి.. ఈయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజవర్ధన్ తండ్రి బాటలో పయనిస్తున్నారు.. సంగీత, సాహిత్య, చిత్రకళల్లో రాణిస్తున్నారు.. ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో వ్యాఖ్యాతగా అందరి మన్ననలు పొందుతున్నారు.
ఆదిలాబాద్ టౌన్ : ఆయనో సాహితీవేత్త.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సామల సదాశివ మాస్టారు కుమారుడు.. తండ్రినే గురువుగా చేసుకొని తన నడత, రచనల్లో ముందుకు సాగుతున్నాడు.. గంభీరంగా, సాదాసీదాగా కనిపించే వ్యక్తే ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సామల రాజవర్ధన్. ఈయనకు ముందునుంచే తెలుగు అన్నా, తెలంగాణ మాండలికం అన్నా పంచప్రాణాలు. తనదైన శైలిలో రచనలు చేస్తూ తెలుగుభాష ఉన్నతికి కృషి చేస్తూనే రాజవర్ధన్ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన రాసిన తండ్రి సామల సదాశివ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, కేవీ రమణాచారి ఆయనను ఘనంగా సన్మానించారు. తెలంగాణ పత్రికలో .. తెలంగాణలో సంగీతవ్యాప్తి క్రమం గురించి ఆయన రాసిన వ్యాసం చర్చనీయాంశమైంది. సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నది.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా..
విధులు నిర్వర్తించడం కాదు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులకు అంకితమైపోయాడు రాజవర్ధన్ మాస్టారు. తెలుగు పండితుడిగా విద్యార్థులకు గణాలు, చందస్సు, అలంకారాలు నేర్పారు. తెలుగుభాష ఉన్నతికి సేవ చేసినందుకు అవార్డు అందుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఆకాశవాణి వ్యాఖ్యాతగా సమయం ఇస్తూ అన్నింట్లో తనదైన ముద్రవేస్తున్నారు.
సంగీత రచనలు ..
నాదరహిత విశ్వం లేనేలేదని గుర్తుచేసే రాజవర్ధన్ సంగీతం, సంగీత విద్వాంసులపై పరిశోధనలు చేశారు. త్యాగరాజు రచించి, స్వరపరిచిన పంచరత్నాలపై పరిశీ లనాత్మక అధ్యయనం చేశారు. 1985లో మధురాంతకం రాజారాం కథలు అనే సిద్ధాంత గ్రంథం రాసి ఎంఫిల్ పట్టా పొందారు. తెలంగాణ సంగీతం, సంస్కృతీ గ్రంథంలో సంగీత సంప్రదాయ మధురిమలు తెలుగువారికి అందించారు. భారతీయ సంగీతంలో హిందూస్తానీ, కర్ణాటక పద్ధతులు ఎలా ఏర్పడ్డాయో రాజవర్ధన్ గంథ్రం పరిశీలిస్తే అర్థమవుతుంది. పాలపిట్ట మాసపత్రికలో రాజవర్ధన్ రాసిన సంగీత వ్యాసాలు ప్రచురితమయ్యాయి. మూసి వార పత్రికలో భారతీయ సంగీతం గురించి ఇప్పటివరకు 46 వ్యాసాలు రాశారు. మరో నాలుగు రాసి ఈ ధారావాహిక పూర్తిచేస్తానంటున్నాడు రాజవర్ధన్. ఫేస్బుక్ వాల్మీద ‘సునాధ వినోదిని’ పేరుతో 56 భాగాలుగా సంగీత వ్యాసాలు రాశారు.
ఆకాశవాణి వ్యాఖ్యాతగా గుర్తింపు..
ప్రతి మంగళవారం ఉదయం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో మాట సొగసు విని ఆనందిస్తూ ఆశ్చర్యపోని వారు ఈ ప్రాంతంలో లేరంటే అతిశయోక్తి కాదు. శ్రోతల నుంచి విశేష స్పందన ఉండడంతో ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారి సుమనస్పతి రెడ్డి ఇప్పుడు వారానికి రెండుసార్లు ప్రసారం చేస్తున్నారు. ఈ మాటసొగసులో తెలంగాణ యాసలో, అందునా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాడుకలో ఉన్న ఒక పదాన్ని తీసుకొని అర్థాలు, పరమార్థాలు, ఈ పదం పుట్టుపూర్వోత్తరాలు రాజవర్ధన్ చక్కగా కళ్లకు కట్టినట్లు వివరిస్తుంటే .. నా మాండలిక పదంలా ఇంత మాధుర్యం ఉన్నదా? అని ఆశ్చర్యం వేస్తుంది. స్థానిక కళలు, కళాకారులు , రచయితలను ప్రోత్సహించే ఆదిలాబాద్ ఆకాశవాణి ఈ మాటసొగసు కార్యక్రమం 150 భాగాలు పూర్తిచేసుకున్నది. తన రచనలకు ఆదిలాబాద్ ఆకాశవాణి ఒక ముఖ్య వేదిక అయ్యిందని ఈ మాస్టారు సావధానంగా చెప్తారు. మాటసొగసు అనే కాదు.. అన్ని కార్యక్రమాలను యూట్యూబ్‌లో చూడవచ్చని ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు చెబుతున్నారు.
చిత్రకళలో మేటి..
తండ్రి సామల సదాశివ మాస్టారుకు ఉన్న చిత్రకళ రాజవర్ధన్‌కు కూడా అబ్బింది. సదాశివ సారు సరోజినీ నాయుడు మేనల్లుడైన దీన్ద యాళ్ నాయుడు దగ్గర చిత్రకళ నేర్చుకోగా, ఆ కళను తండ్రి వద్ద రాజవర్ధన్ దీక్షగా ఒంటబట్టించుకున్నాడు. బాల్యంనుంచే చిత్రకళపై మక్కువ ఉన్న రాజవర్ధన్ ఉపాధ్యాయ వృత్తిలో విరామ సమయంలో దీక్షగా బొమ్మలు వేసి పిల్లలకు ఇచ్చేవారు. తండ్రి సదాశివ చిత్రకళ కుంచెలిప్పుడు రాజవర్ధన్ వారసత్వంగా గ్రహించి న్యాయం చేస్తున్నారు. పొట్రాయిట్ పెయింటింగ్‌లో రాణిస్తున్న ఈ కళారత్నం వేసిన చిత్రాలు జీవంపోసుకొని మనకు సాక్షాత్కరిస్తాయి. పాఠశాల, కళాశాల స్థాయిలో బహుమతులు పొందారు ఈయన. అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ చిత్రం గీసి ఇచ్చారు. అలా పసి పాప నవ్వు, శ్రమజీవి శ్రమైక జీవన సౌంద ర్యం, కాళోజీ చిరునవ్వు గోచరిస్తాయి ఈయ న చిత్రాల్లో. మహామహుడైన రవివర్మ ప్రేర ణతో రాజవర్ధన్ తన మాతృమూర్తి చిత్రాన్ని నాలుగు ఫీట్ల కాన్వాస్‌పై చిత్రీకరించాడు. అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టప డని రాజవర్ధన్ భగవద్గీతలో ఉద్బోధిం చబడి నట్లుగా ‘తన పని తాను నిష్టగా , దీక్షగా’ అలా చేసుకుంటూనే ముందుకు సాగుతు న్నాడు సాహితీ సంద్రంలా, వర్తమాన సంగీత సాహితీప్రియులకు, అభిమానులకు ఆదర్శంగా ముందుకు సాగుతున్నాడు.
తాజావార్తలు
- నట్టూ.. నువ్వొక లెజెండ్: డేవిడ్ వార్నర్
- ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రైతు సంఘాలతో 11వ సారి కేంద్రం చర్చలు
- మనో వేదనతోనే రాజీనామా: బెంగాల్ మంత్రి
- భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- లాకర్లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు
- ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు
- ఇండియా కొత్త రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- నో టైమ్ టు డై.. మళ్లీ వాయిదా
- చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం