మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Aug 28, 2020 , 02:35:08

జనవరి 1, 2021 నాటికి 18 ఏండ్లు నిండితే చాలు

జనవరి 1, 2021 నాటికి 18 ఏండ్లు నిండితే చాలు

  • n కొత్త, వివిధ సమస్యలపై దరఖాస్తుల ఆహ్వానం 
  • n ఓటరు జాబితాలో సవరణలకు అవకాశం
  • n ఉమ్మడి జిల్లాలో 20,84,672 మంది ఓటర్లు

సారంగాపూర్‌ :వయస్సు 18 యేండ్లు నిండితే ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఓటు వజ్రాయుధంగా పని చేస్తుందని పెద్దలు చెబుతారు. అలా యువత ఓటరుగా మారితే సమాజంలో మార్పు వస్తుందంటారు. యువత ముందుకు వచ్చి ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం ఇచ్చింది. ఓటరు జాబితా సవరణతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు ప్రణాళిక జారీ చేసింది. ఇటీవల ప్రకటన విడుదల చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు మృతులు, అనర్హుల ఓట్లను తొలగించనున్నారు. అదే సమయంలో జాబితాలో సవరణకూ అవకాశం కల్పించనున్నారు. 2021, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఆన్‌లైన్‌లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. లేదంటే గ్రామాల్లో బూత్‌స్థాయి అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు డిసెంబర్‌ 15 లోపు ఆన్‌లైన్‌లో ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో పాటు ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణను సైతం అధికారులు చేపట్టనున్నారు. 

ఫారం-6తో కొత్త ఓటు నమోదు..

కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునే వారు బూత్‌స్థాయి అధికారిని కలిసి ఫారం-6 తీసుకోవాలి. తమ వివరాలు అందులో నమోదు చేసి అదే అధికారికి సమర్పించాలి. ప్రతి రెండో శనివారం, ఆదివారాల్లో అన్ని బూ త్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. 2021, జనవరి 1నాటికి ఎవరికైతే 18 ఏండ్లు నిండుతాయో వారికి దరఖాస్తులను అందుబాటులో ఉంచుతారు. ఓటరు జాబితాలో పేరు తొలగించడం, నివాస మార్పిడి, ఇతర అభ్యంతరాలుంటే ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు పేరు, తల్లి, తండ్రి పేర్లు తప్పుగా నమోదైతే ఫారం-8 నింపి అందజేయాలి. ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండి నివాసం, పోలింగ్‌ కేంద్రం పరిధి మారినప్పుడు నివాస ప్రాంతం మార్పిడికి ఫారం-8(ఏ) సమర్పించాలి. ఇక ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 

 జాబితా సవరణ ప్రక్రియ ఇలా..

అక్టోబర్‌ చివరి వరకు ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, కొత్త ఓటర్ల చేర్పులు, మృతుల ఓట్లను తొలగించడం వంటివి చేపట్టనున్నారు. 

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ అక్టోబర్‌ 31లోగా పూర్తి చేయనున్నారు.

నవంబర్‌ 16న ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. 

డిసెంబర్‌ 15 వరకు అభ్యంతరాల స్వీకరణతో పాటు ఓటరు జాబితాలో మార్పులు , చేర్పులకు అవకాశం.

వచ్చే ఏడాది జనవరి 5 వరకు వాటి పరిష్కారం ఉంటుంది.  2021 జనవరి 15 ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. 


logo