శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nirmal - Aug 28, 2020 , 02:35:09

30 రోజుల్లోనే చిట్యాల్‌లో నిర్మాణం పూర్తి

30 రోజుల్లోనే చిట్యాల్‌లో నిర్మాణం పూర్తి

  • అధునాతన హంగులు, సకల సౌకర్యాల కల్పన
  • పర్యవేక్షించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు

సోన్‌ : నిర్మల్‌ మండలం చిట్యాల్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణాన్ని నెల రోజుల్లోనే పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సర్పంచ్‌ పడకంటి రమేశ్‌రెడ్డి. ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వగా.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జూలై 18న పనులు ప్రారంభించారు. నెల రోజుల్లోనే వేదికను రైతులకు అందుబాటులో ఉంచాలని సమావేశంలో పేర్కొన్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్పంచ్‌ 30 రోజుల్లోనే భవనం పూర్తి చేసి ఇస్తామని మంత్రి సాక్షిగా ప్రకటించడమే కాకుండా అనుకున్న ప్రకారం వేదిక నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అదీ వర్షాకాలం సీజన్‌లో, వాతావరణం అనుకూలించకపోయినా 24 గంటల పాటు అక్కడే ఉండి సొంత ఇంటి మాదిరిగా పనులు చేయించారు. అధునాతన సౌకర్యాలు, హంగులతో ఏ లోటూ లేకుండా రైతులకు ఉపయోగపడేలా రైతు వేదికను నిర్మింపజేశారు. వాస్తవానికి ఆగస్టు 15న రైతు వేదిక నిర్మాణం ప్రారంభం కావాల్సింది. జిల్లాలో 15 రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో వేదిక నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ పెద్ద మొత్తంలో కూలీలను ఉపయోగించి మూడు షిప్టుల ద్వారా రాత్రి, పగలు కష్టపడి పూర్తి చేశారు. ఇప్పుడు నిర్మల్‌ జిల్లాలో చిట్యాల్‌ రైతు వేదిక స్ఫూర్తిగా నిలుస్తోంది. 

ఆధునాతన హంగులు, సకల సౌకర్యాలు..

గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలు రైతులకు అనుగుణంగా అన్ని వసతులతో కూడిన విధంగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు అర ఎకరం స్థలంలో వేదిక నిర్మాణం, హాలు, రికార్డుల గది, బయట పచ్చని పార్కు, ప్రత్యేక లొకేషన్‌ ద్వారా వీటి నిర్మాణం చేపట్టారు. గదితో పాటు కరెంట్‌, డోర్లు, ఫ్యాన్లు, రంగులు, రైతుల జీవనశైలిని తెలిపే చిత్రకళలను గోడలపై వేసి ఔరా అనిపించారు. బయట గేటు వద్ద రైతు వేదిక హాలుపై ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మరో పక్క రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చిత్రపటాలను వేయించారు. వేదిక లోపలి భాగంలో సమావేశ హాలు, కింద సాగునీటి ప్రాజెక్టుల చిత్రకళ భవనానికి కొత్త అందాన్ని ఇస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. 

ఎనిమిది గ్రామాల రైతులకు ప్రయోజనం..

చిట్యాల్‌ వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలో చిట్యాల్‌, తాంశ, కౌట్ల(కె), ముజ్గి, వెంగ్వాపేట్‌, మంజులాపూర్‌, తల్వేద, లంగ్డాపూర్‌ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల రైతులకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడనుంది. వేదిక బయట ఖాళీ స్థలంలో రకరకాల పూలమొక్కలు, తీగజాతి మొక్కలు, అలంకరణ మొక్కలు, సేద తీరేందుకు సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే ఆదర్శ మోడల్‌ రైతు వేదిక పూర్తి చేశామని సర్పంచ్‌ రమేశ్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. జిల్లాలో నెల రోజుల్లోనే రైతు వేదిక నిర్మాణం పూర్తి చేయడానికి కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే నాలుగుసార్లు పర్యవేక్షించి పూర్తి సహకారం అందించారని తెలిపారు. 

రైతుల ఐక్యతకు దోహదం.. 

రైతు వేదిక నిర్మాణంతో క్లస్టర్‌లోని రైతులందరూ ఒకచోట కూర్చొని అన్ని అంశాలను చర్చించుకోవచ్చు. క్టస్లర్‌ పరిధిలో రైతులందరూ సమావేశం నిర్వహించుకొని ఏ గ్రామంలో ఏ పంట వేసుకోవచ్చు? దిగుబడులు, మార్కెటింగ్‌, తదితర అంశాలపై చర్చించుకొనే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు ప్రయోజనం చేకూరునున్నది.

- అట్టోలి సాయారెడ్డి, రైతు, చిట్యాల్‌

రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్‌..

30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఎప్పుడు రైతులకు కష్టాలే.  రైతులకు పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్‌, సబ్సిడీ విత్తనాలు, రైతు బీమా, తదితర పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. ఇప్పుడు రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలను నిర్మించడంతో రైతుల్లో ఐక్యత పెంచేందుకు దోహదపడుతున్నది. 

- సాద విజయ్‌కుమార్‌, వెంగ్వాపేట్‌

రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

రైతు వేదికల నిర్మాణంతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఏ సమావేశం నిర్వహించాలన్నా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశానికి తక్కువ మంది రైతులే రావడంతో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అందరికీ చేరడంలో జాప్యం ఏర్పడుతున్నది. రైతు వేదిక పూర్తయితే క్లస్టర్‌ పరిధిలో ఐదు వేల ఎకరాలకు చెందిన రైతులు ఒకేసారి వ్యవసాయానికి సంబంధించిన ఏ అంశమైనా చర్చించుకొని అమలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.           - తాటికొండ హర్షిత, ఏఈవో, చిట్యాల్‌ క్లస్టర్‌