శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Aug 25, 2020 , 03:48:54

కోవెల.. అభివృద్ధి బిరబిర

కోవెల.. అభివృద్ధి బిరబిర

ఆలయానికి ఘన చరిత్ర..

స్థానిక భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. వందలాది సంవత్సరాల క్రితం సహ్యాద్రి పర్వత శ్రేణులను ఆనుకొ ని ఉన్న అటవీ ప్రాంతంలో పోచమ్మతల్లి వెలిసినట్లు స్థానికులు పేర్కొంటారు. ఈ ఆలయానికి ఓ చారిత్రక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్ర కరువుకాటకాలు సంభవించి ప్రజలకు తినడానికి తిండి దొరకని దుర్భర స్థితి వచ్చింది. అనేక అంటువ్యాధులు సోకి ప్రజలు మృత్యువాతపడ్డారు. గ్రామాల్లో శ్మశాన వైరాగ్యం నెలకొన్న దశలో భక్తులు పరమ శివున్ని ప్రార్థించగా, ప్రజల రక్షణార్థం తన కుమార్తెయగు పోచమ్మను ఈ ప్రాంతానికి పంపినట్లు పురాణగాథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి చేరుకున్న పోచమ్మతల్లి భక్తులను సంరక్షిస్తూ, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు వర్ధిల్లేలా దీవిస్తూ వస్తున్నదని నానుడి. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన పోచమ్మతల్లిని స్థానిక భక్తులు ఆరాధిస్తూ వస్తున్నారు. పోచమ్మతల్లి దర్శనానికి  యేటా లక్షల సంఖ్యల్లో భక్తులు తరలివస్తున్నారు. 

రూ. 3.63 కోట్లతో అభివృద్ధి పనులు..

తెలంగాణ ప్రభుత్వం, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద రూ.3.63 కోట్లతో అభివృద్ధి పనులు  పూర్తయ్యాయి. ఇందులో రూ.38 లక్షలతో ఆలయ రాజగోపురం, రూ.32 లక్షలతో ప్రాకార మండపం, రూ.60 లక్షలతో కోనేరు పునః నిర్మాణం చేశారు. రూ.21 లక్షలు వెచ్చించి నాలుగు వసతి గృహాలు, రూ.10 లక్షలతో కాలక్షేప మండపం, రూ.27 లక్షలతో మరుగుదొడ్లు, రూ.29 లక్షలతో ఆలయం లోపల భక్తులకు నీడ కోసం చుట్టూ షెడ్లను నిర్మించారు. రూ.16 లక్షల అంచనా వ్యయంతో రెండు స్వాగత తోరణాలు, రూ.12 లక్షలతో మహామండపం, రూ.14 లక్షలతో నూతన కార్యాలయ భవనం, రూ.36 లక్షలతో డ్రైనేజీలు నిర్మించారు. రూ.4 లక్షలతో కల్యాణకట్ట, తులాభారం షెడ్డు, రూ.3 లక్షలతో టికెట్‌ బుకింగ్‌రూమ్‌, రూ.3 లక్షలతో పోతరాజు, నాగదేవత ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. దాతల సహకారంతో రూ. 50లక్షలు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం పక్కాగదులు, షెడ్లు నిర్మించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టడానికి మరో రూ.6 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఏఏ పనులు చేపట్టాలనే దానిపై ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.   

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పోచమ్మతల్లిని భక్తులు భావిస్తారు. పుట్టువెంట్రుకలు తీయడం, ఖుషీ పండుగలు నిర్వహించడం ద్వారా భక్తులు తమ మొక్కలను తీర్చుకుంటారు. ప్రతి యేటా అశ్వయుజ మాసంలో వచ్చే మహాలయ అమావాస్య తదుపరి ఆదివారం ఆలయం వద్ద గంగనీళ్ల జాతర నిర్వహిస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్వహించే ప్రధాన జాతరల్లో దీనిని ఒకటిగా పేర్కొంటారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి భక్తులు వస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల భక్తులు జాతరలో భాగస్వాములవుతుండడం విశేషం. 

మంత్రి ఐకేరెడ్డి చొరవతోనే..

రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతోనే ఆలయం అన్ని హంగులతో అభివృద్ధి చెందింది. గతంలో ఆలయం వద్ద వివిధ పనులు చేయించడం కోసం రూ.3 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించారు. మరో రూ.6 కోట్ల పనులకు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. అవి మంజూరైతే అవసరమైన పనులు చేపడుతాం. గతం కంటే ఈ గుడి చాలా అభివృద్ధి చెందింది. ఏటా శ్రావణమాసం మినహా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 

- మహేశ్‌, ఈవో, అడెల్లి పోచమ్మ ఆలయం

1983 పాలకమండలి ఏర్పాటు..

అడెల్లి పోచమ్మ ఆలయం 1975 సంవత్సరంలో దేవాదా యశాఖ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అంతకుముందు గ్రామస్తులు ఆలయం నిర్వహణ బాధ్యతలను అడెల్లి గ్రామస్తులు చూసుకునేవారు. పాలకమండలి వ్యవస్థ 1983 నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఆలయానికి మొట్టమొదటి చైర్మన్‌గా మలక్‌చించోలి గ్రామానికి చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి నియమితులయ్యారు. అప్పటి నుంచి అడెల్లి పోచమ్మ ఆలయానికి పాలకమండలి కొనసాగుతూ వస్తున్నది. దేవస్థానానికి భక్తులు హుండీలో వేసిన కట్నకానులు, టెండర్ల రూపంలో రూ.కోటి వరకు ఆదాయం వస్తున్నది.