మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Aug 24, 2020 , 00:49:28

పంటలకు సస్య రక్షణ

పంటలకు సస్య రక్షణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాలో 1.62 లక్షల హెక్టార్లలో పత్తి, 74 వేల ఎకరాల్లో సోయా, 5500 ఎకరాల్లో మినుములు, ఆదిలాబాద్‌ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పత్తి, 72 వేల ఎకరాల్లో సోయా, మంచిర్యాల జిల్లాలో 1.87 లక్షల ఎకరాల్లో పత్తి, 8 ఎకరాల్లో సోయా, 175 ఎకరాల్లో మినుములు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3.40 లక్షల ఎకరాల్లో పత్తి, 1739 ఎకరాల్లో మినుములు, 3 వేల ఎకరాల్లో సోయా సాగుచేస్తున్నారు. ఇప్పటికే మినుము పంట కాయ దశలో ఉండగా, సోయాబీన్‌ పూత, కాత దశలో ఉంది. పతి ఏపుగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట చేలలో భారీగా నీరు నిలుస్తున్నది. ఇప్పటి వరకు తేలికపాటి వర్షాలు అప్పుడప్పుడు పడగా, పంట పెరిగింది.. కానీ.. వేళ్లు భూమి లోపలి వరకు వెళ్లలేదు. ఇటీవల భారీ వర్షాలకు నేలపై పడిపోగా కాత, 

పూత, కాయ నీటిలో నాని నష్టం వాటిల్లే ప్రమాదముంది. మినుములు కూడా కాయ దశలో ఉండగా, నీటిలో మునిగితే మొలకలు వచ్చేలా ఉన్నాయి. దీంతో పత్తి, సోయాబీన్‌, మినుము చేలల్లో నిలిచిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి వరుసలో నీరు బయటకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.

చేలల్లో ఎక్కువ కాలం నీరు నిలిస్తే..

మరోవైపు పత్తి, సోయాబీన్‌ పంటలపై వివిధ రకాల తెగులు ఆశించే ప్రమాదముందని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ కాలం నీరు నిలిస్తే.. పత్తి పంటకు ఎండు, వడ తె గులు, సోయాబీన్‌కు కాయ, ఆకు తినే పురుగులు, ఆకుమచ్చ తెగులు సోకే ప్రమాదముందని చెబుతున్నారు. సో యాబీన్‌లో ఆకులు, కాయలు తినే పురుగులు కనిపిస్తే.. హిమామెక్టిన్‌ బెంజోయేట్‌ను ఎకరానికి 100 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాలి. లేదా క్లోరాన్‌ త్రి నిలిప్రోల్‌(కోరాజిన్‌)ను ఎకరానికి 60 మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు వస్తే.. కార్బోండిజయం, మ్యాంకోజెమ్‌ కలిసి ఉన్న సాఫ్‌ను రెండు లేదా రెండున్నర గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయా లి. 10-15 రోజుల పాటు వర్షాలు కురియక.. ఒకేసారి భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ఎండు తెగులు సోకుతున్నదని చెబుతున్నారు.

పంటలకు సస్యరక్షణ చర్యలు

పత్తి పంటకు ఎండు తెగులు, వడ తెగులు సోకే ప్రమాదముంది. వర్షాలు తగ్గుముఖం పట్టాక.. ఈ తెగుళ్లను అరికట్టేందుకుగాను సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీ క్లోరైట్‌ (సీవోసీ) లేదా.. ఒక లీటరు నీటిలో గ్రాము కార్బేండిజం కలిపి.. మొక్క కుదుళ్లలో వేళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కతో పాటు చుట్టు పక్కల ఉన్న మొక్కల వేళ్లు తడిచేలా చూడాలి. లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీ క్లోరైట్‌తో పాటు లీటరు నీటికి రెండు గ్రాముల పాంటామైసిన్‌ కలిపి.. లీటరుకు రెండు కలిపి ఐదు గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. 15 లీటర్ల స్ప్రే పంపు డబ్బాలో రెండు కలిపి 75 గ్రాముల చొప్పున కలిపి వాడాలి. పంపు నాజిల్‌ ఊడదీసి.. మొక్క వేళ్లు తడిసేలా చేయాలి. తర్వాత రెండు, మూడు రోజులకు ట్రిపుల్‌ 19 (19:19:19) కాంప్లెక్స్‌ ఎరువును లీటరుకు 10 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాలి. దీంతో కొత్త చిగురు వస్తుంది. అవసరాన్ని బట్టి రెండో సారి హెక్సాకొనజోల్‌ను లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఎకరానికి 25 కేజీల యూరియా, 10 కేజీల పొటాష్‌ ఎరువును కలిపి అడుగు మందుగా వేసుకోవాలి. వారం తర్వాతే యూరియా వాడాలి.


logo