గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 22, 2020 , 00:12:49

వైద్య సేవలు ప్రత్యేకం

వైద్య సేవలు ప్రత్యేకం

నిర్మల్‌ అర్బన్‌ : స్వరాష్ట్రం ఏర్పడడంతో వైద్యశాఖలో పూర్తి ప్రక్షాళన చోటు చేసుకుంది. ప్రభుత్వ దవాఖానలపై రోగులకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో జలుబు, జ్వరానికి కూడా ప్రైవేట్‌ దవాఖానల గడప తొక్కేవారు. వేలకువేలు బిల్లులు కట్టి జేబులు ఖాళీ చేసుకునేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మామూలు అనారోగ్య పరిస్థితి నుంచి శస్త్ర చికిత్సల వరకూ ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు సైతం వైద్యం అందుతున్నది. చిన్నారుల నుంచి మొదలు పండు ముసలి వరకూ అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రైవేట్‌ను తలదన్నేలా, చిన్నారులను ఆకట్టుకునేలా గోడలపై బొమ్మలు, ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలు పెంచుతూ రోగులకు, వారి బంధువులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నారు.

ఏరియా దవాఖానలో పెరుగుతున్న సేవలు..

ప్రభుత్వ ఏరియా దవాఖానలో మెరుగైన వైద్యసేవలు అందుతున్న విషయాన్ని తెలుసుకున్న రోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతిరోజూ 250 మంది రోగులు ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితుల ఆధారంగా రోజుకు 40-50 మంది రోగులు ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ అవుతున్నారు. 

అందుబాటులో ఉన్నవి..

ఏరియా ఆసుపత్రిలో పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. సర్జికల్‌, ఆర్థో, ఆరోగ్యశ్రీతో పాటు కార్డియాలజీ, యూరాలజీ సేవలు తప్ప మిగతా వాటికి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. రోగుల స్థితిని బట్టి వైద్య, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. 25 మంది వైద్యులు రోగుల సేవలో తరిస్తున్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. అత్యవసర సేవల కోసం 10 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ మూడు, ఈసీజీ, డయాలసిస్‌, బ్లడ్‌బ్యాంక్‌, డిజిటల్‌ ఎక్స్‌రే సదుపాయాలున్నాయి.  

కొవిడ్‌, సాధారణ రోగులకు ప్రత్యేకంగా..

కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ ఏరియా దవాఖానలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందనే అపోహ కొందరిలో ఉంది. దీంతో కొందరు రోగులు ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్తూ వేలాది రూపాయలు వృథాగా ఖర్చు చేసుకుంటున్నారు. ఏరియా ఆసుపత్రిలో మామూలు రోగులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో, అదే వార్డుల్లో ప్రస్తుతం అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ రోగులకు ప్రత్యేకంగా ఆసుపత్రి కుడి వైపు భాగంలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా రోగులకు, ఇతరులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. 

24 గంటల పాటు సేవలు.. 

కరోనా వైరస్‌ కారణంగా ఏండ్ల తరబడి రోగుల నుంచి జబ్బుల పేరుతో దోపిడీకి గురిచేసిన పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆపద సమయంలో సేవలు అందించలేదు. లాక్‌డౌన్‌ సమయంలో తమ వైద్యశాలలన్నింటినీ పూర్తిగా మూసేశారు. దీంతో ప్రైవేట్‌ వైద్యానికి రోగులు స్వస్తి పలికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పరీక్షలు చేసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలను సైతం అందిస్తున్నారు.


logo