సోమవారం 18 జనవరి 2021
Nirmal - Aug 22, 2020 , 00:14:06

ఆయకట్టుకు భరోసా

ఆయకట్టుకు భరోసా

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత, స్వర్ణ, కడెం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. ఈ నదులపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు జలకళ సంతరించుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 16 ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు ఉండగా, వీటి కింద సుమా రు 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లోకి వరద చేరడంతో నిండిపోతున్నాయి. చాలా వరకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా, ఎగువ ప్రాం తం నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నా రు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు సీజన్‌లో కురిసిన భారీ వ ర్షం ఇదే. జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు జలకళ సంతరించుకోగా, వానకాలం, యాసంగిలో సీజన్లలో పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. సాగునీటితో పాటు తాగునీటికీ ఇబ్బందులు తొలగిపోనుండగా, రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండు పంటలకూ..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 16కిపైగా ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 మీడియం ప్రాజెక్టులు, ఒక ఎత్తిపోతల పథకం, ఆనకట్టతో పాటు రెండు భారీ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం 11 ప్రాజెక్టులు, ఒక ఎత్తిపోతల పథకం(ఎల్లంపల్లి-గూడెం), సదర్మాట్‌ ఆనకట్ట ద్వారా పూర్తి స్థాయిలో, మరో మూడు ప్రాజెక్టులతో పాక్షికంగా సాగు నీరందుతున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు, నిర్మల్‌ జిల్లాలో ఎస్సారెస్పీ(సరస్వతి కాలువ), కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులతో పాటు సదర్మా ట్‌ ఆనకట్ట్ట ఉంది. మంచిర్యాల జిల్లాలో ఎల్లంపల్లి (గూడెం ఎత్తిపోతల పథకం), గొల్లవాగు, నీల్వాయి, ర్యాలీవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వట్టివాగు, జగన్నాథపూర్‌, ఎన్టీఆర్‌ సాగర్‌, పీపీరావు ప్రాజెక్టు, కుమ్రంభీం ప్రాజెక్టులున్నాయి. ఉమ్మడి జి ల్లాలో ప్రాజెక్టుల ద్వారా 3,30,362 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 12 మీడియం ప్రాజెక్టుల సామర్థ్యం 21.599 టీఎంసీలు కాగా, ఎల్లంపల్లి సామర్థ్యం 20.175, కడెం ప్రాజెక్టు 7.603 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయి. ఎస్సారెస్పీ సామర్థ్యం 90  టీఎంసీలుకాగా.. సరస్వతీ కా లువ ద్వారా 38 వేల ఎకరాల ఆయకట్టు పారుతున్నది. 

గేట్లు ఎత్తి నీటి విడుదల..

ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో.. గే ట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. సరస్వతీ కాలువ ద్వారా సాగునీరు అందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ప్రస్తుతం 45,271 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరో 20 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టు నిండుతుంది. మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశముంది. మత్తడివాగుకు 160 క్యూసెక్కులు,  సా త్నాలకు 787 క్యూసెక్కులు, స్వర్ణకు 400 క్యూసెక్కులు, గడ్డెన్నవాగుకు 500 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 4301 క్యూసెక్కులు, సదర్మాట్‌కు 15,357 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లికి 56,881 క్యూసెక్కులు, నీల్వాయికి 1100 క్యూసెక్కులు, ర్యాలీవాగుకు 260 క్యూసెక్కులు, ఎన్టీఆర్‌ సాగర్‌కు 205 క్యూసెక్కులు, గొల్లవాగుకు 1526 క్యూసెక్కులు, వట్టివాగుకు 2150 క్యూసెక్కులు, కుమ్రం భీంకు 810 క్యూసెక్కులు, పీపీరావు ప్రాజెక్టుకు 9030 క్యూసెక్కులు, జగన్నాథపూర్‌కు 16110 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా చేరడం, పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.