సోమవారం 18 జనవరి 2021
Nirmal - Aug 21, 2020 , 02:14:47

ముంచెత్తిన వాగులు, వంకలు

ముంచెత్తిన వాగులు, వంకలు

  • n వారం రోజులుగా కురుస్తున్న వర్షం     
  • n      n మత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటలు
  • n నిండుకుండల్లా ప్రాజెక్టులు       n స్వర్ణ, కడెం, గడ్డెన్నన వాగు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల

నిర్మల్‌, నమస్తే తెలంగాణ/బోథ్‌/బాసర/కడెం/ సారంగాపూర్‌/భైంసా/దస్తురాబాద్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వారం నుంచి ఏకధాటిగా వానపడుతున్నది. వాగులు, వంకలను ముంచెత్తుతున్నది. ముసురు వీడకపోవడంతో పాటు చలిగాలులకు జనజీవనం స్తంభిస్తున్నది. మొత్తంగా గోదావరి జలకళను సంతరించుకున్నది. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆయా చోట్ల పంటలు నీటమునిగాయి. బోథ్‌ మండలంలో గురువారం 65.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్‌(బీ), మందబొగుడ, చింతల్‌బోరి, మర్లపెల్లి వాగులు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, సోయా, కంది పంటల్లోకి నీరు చేరింది. పొచ్చెర జలపాతం వద్ద ప్రవాహం ఎక్కవగా ఉంది. బాసర వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. స్థానికంగా, మహారాష్ట్ర నుంచి 85 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం 67.154 టీఎంసీల నిల్వ ఉండగా, 89,656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతున్నది. కడెం జలాశయానికి 19,956 క్యూసెక్కుల వరద వస్తున్నది. 6.788 నీటి నిల్వ ఉండగా, మూడు వరదగేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 18,251 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. 1.440 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 12,181 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. నాలుగు గేట్లు ఎత్తి, 12,416 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. భైంసా మండలంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 3వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. కాగా, రెండు గేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 358 మీటర్లుగా ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో గోదావరి జలకళను సంతరించుకున్నది. గూడెం-రాయపట్నం బ్రిడ్జిపై వాహనదారులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రాజెక్టును మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వరద పోటెత్తింది. ఉధృతంగా ప్రవహిస్తున్నది. బెజ్జూర్‌ మండలకేంద్రానికి సమీపంలోని గొల్లబాయి చెరువు మత్తడి దుంకుతున్నది. చేపల వేట కోసం జాలరులు సందడి చేశారు. పెంచికల్‌పేట మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలోని కొండెంగ లొద్ది జలపాతం కనువిందు చేస్తున్నది. సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి నీరు జాలువారుతున్నది. దస్తురాబాద్‌ మండల కేంద్రానికి సమీపంలోని కడెం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు రెండు చుక్కల దుప్పులు పడ్డాయి. గమనించిన స్థానిక యువకులు, పోలీసులు తాళ్ల సాయంతో వాటిని కాపాడారు. కడెం అటవీ శాఖ కార్యాలయంలో చికిత్స అందించి, అడవిలో వదిలివేస్తామని ఎఫ్‌ఆర్వో అని తెలిపారు.