గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 15, 2020 , 23:28:25

మోయతుమ్మెద వాగులో టిప్పర్‌ బోల్తా

మోయతుమ్మెద వాగులో  టిప్పర్‌ బోల్తా

  • l ప్రాణాలతో బయటపడ్డ క్లీనర్‌
  • l హెలికాప్టర్‌తో గంట సేపు గాలింపు
  • l ఫలించని అధికారుల ప్రయత్నాలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ/కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సిద్దిపేట-హన్మకొండ రహదారి బస్వాపూర్‌ సమీపంలోని నిర్మించిన బ్రిడ్జిపై నుంచి తెల్లవారు జామున 2:30గంటల ప్రాంతంలో కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు ఇసుక తీసుకెళ్తున్న టిప్పర్‌(టీఎస్‌02యూబీ1836) వరద ఉధృతికి బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ క్లీనర్‌ కొయ్యల ధర్మాజి (34) చాకచక్యంగా లారీపైకి ఎక్కడంతో స్థానికులు తాళ్ల సహాయంతో రక్షించారు. డ్రైవర్‌ ముడిమాకుల శంకర్‌(37) సీటులో నుంచి పైకి వచ్చే సమయంలో ఆలస్యం కావడంతో వరద ఉధృతి పెరిగి వాగులో కొట్టుకుపోయాడు. 

వెంటనే స్పందించిన మంత్రి హరీశ్‌రావు

విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ కొక్కుల కీర్తి సురేశ్‌ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మంత్రి.. సహాయక చర్యలు చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిని ఆదేశించారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో పాటు హెలికాప్టర్‌ను పంపించారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌, ఏసీపీ మహేందర్‌, ఆర్డీవో జయచంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేకున్నారు. వాగులోవరద ఉధృతి పెరిగి డ్రైవర్‌ శంకర్‌ మునిగిపోయే స్థితికి చేరడంతో కాపాడే ప్రయత్నం ముమ్మరం చేశారు. వెంటనే స్థానిక యువకుల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది తాళ్లతో రబ్బర్‌ ట్యూబ్‌, జాకెట్‌ను శంకర్‌ చిక్కుకున్న స్థలానికి చేరుకునేలా పంపించారు. పంపిన ట్యూబ్‌, జాకెట్‌ శంకర్‌కు చేరుకోవడంతో రెండువైపులా నుంచి పంపిన తాళ్లను లాగారు. ఈ ప్రయత్నంలో కొద్దిదూరం వచ్చిన శంకర్‌.. ప్రమాదవశాత్తూ ట్యూబ్‌, జాకెట్‌ నుంచి జారిపోయాడు. అప్పుడే సంఘటనా స్థలం చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోటు, గజ ఈతగాళ్లతో శంకర్‌ జారిపోయిన ప్రదేశాన్ని గాలించారు. ఇంతలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న రక్షణ శాఖ హెలికాప్టర్‌ గాలించింది. అయినా శంకర్‌ జాడ దొరకకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాగా, డ్రైవర్‌ శంకర్‌ది మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం అని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ శంకర్‌కు భార్య విజయ, కూతురు ఉషారాణి, కుమారుడు అనుశర్మ ఉన్నారు. మూడు నెలల క్రితమే శంకర్‌ కూతురి వివాహం చేసినట్లు బంధువులు తెలిపారు.

ఏం జరిగిందంటే..

కాళేశ్వరం నుంచి తొమ్మిది ఇసుక టిప్పర్లు శుక్రవారం రాత్రి సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌కు బయలు దేరాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ సమీపంలోని మోయతుమ్మెద వాగు శనివారం తెల్లవారుజామున 2:30గంటల వద్దకు వచ్చాయి. అప్పటికే వాగుపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఉధృతి కొంచెం ఉండడంతో మొదట నాలుగు టిప్పర్లు వాగు దాటాయి. ఐదో లారీని శంకర్‌ దాటిస్తుండగా, వరద ఉధృతికి టిప్పర్‌ బోల్తా పడింది. టిప్పర్‌లో ఉన్న క్లీనర్‌ ధర్మాజీ చాకచక్యంగా టిప్పర్‌ టాప్‌పైకి ఎక్కాడు. అప్పటికే వాగు ఉధృతి పెరగడంతో డ్రైవర్‌ శంకర్‌ కొట్టుకుపోయాడు. ఈ ఘటనతో మిగతా డ్రైవర్లు అప్రమత్తమై, బస్వాపూర్‌ గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు చేరుకొని, మొదట క్లీనర్‌ను తాళ్ల సహాయంతో కాపాడారు.

ఆరుగంటలకు పైగా మృత్యువుతో పోరాటం

వరద ఉధృతికి లారీలో నుంచి శంకర్‌ కొట్టుకుపోతుండగా, అతనికి తుమ్మ చెట్టు తగిలింది. దానిని ఆసరా చేసుకొని శంకర్‌ ఆరు గంటలకు పైగా మృత్యువుతో పోరాడాడు. అప్పటి వరకు స్థానిక నాయకులు, గ్రామస్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అతన్ని ఒడ్డుకు చేర్చలేకపోయారు. విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి హరీశ్‌రావుకు విన్నవించగా, ఆయన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు, అధికారిక యంత్రాంగం కాపాడే ప్రయత్నం చేసినా, చివరికి శంకర్‌ మృత్యుఒడికి చేరాడు.

క్షణక్షణం ఉత్కంఠ..

ప్రత్యేక బృందాలు టిప్పర్‌ డ్రైవర్‌ శంకర్‌ను కాపాడేందుకు ట్యూబులు, తాళ్లు వదిలాయి. శంకర్‌ ట్యూబ్‌ను అందుకోవడం.. అప్పుడే జారి పోవడం.. శంకర్‌ ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు క్షణక్షణం ఉత్కంఠం రేపాయి. చివరికి శంకర్‌ నీళ్లలోనే శ్వాస విడిచాడు.


logo