శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nirmal - Aug 15, 2020 , 03:43:11

పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

  • n మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • n జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మితో కలిసి కౌట్ల(కె) పంచాయతీ భవనం ప్రారంభం 
  • n నిర్మల్‌లో గిరిజనులకు పరికరాలు, వస్తువుల అందజేత

సోన్‌ : పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దాంతోనే పచ్చదనం, పరిశుభ్రత, ప్రజల మౌలిక అవసరాలతో అభివృద్ధి పథంలో నిలుస్తున్నాయన్నారు. మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ సర్కారు చిన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి, ప్రతి నెలా నిధులు మంజూరుచేస్తున్నదన్నారు. ఇప్పటికే విడుదలైన నిధులతో గ్రామాల్లో శ్మశానవాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, మురుగుకాలువలు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, విద్యుత్‌ తీగల మరమ్మతులు, తదితర పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్‌, నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొంగరి నర్మద, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌రెడ్డి, మంజులాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

దాతల సహకారం...

కౌట్ల(కె) గ్రామానికి చెందిన వీ హన్మంతరెడ్డి పంచాయతీ భవనం ప్రహరీ నిర్మాణానికి రూ.2 లక్షలు, సురేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి రూ.15 వేల చొప్పున విరాళం అందించారు. కాగా, మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నిధులను గ్రామంలో అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు తెలిపారు.

గిరిజనుల అభ్యున్నతికి కృషి..

నిర్మల్‌ టౌన్‌ : గిరిజనుల అభ్యున్నతికి ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వారిలో జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని మంత్రి అల్లోల అన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పరికరాలు, వస్తువులను పంపిణీ చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 18 మందికి రూ.12 లక్షలతో మంజూరైన తోపుడుబండ్లను జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ ఆశ్రమ పాఠశాలలో లబ్ధిదారులకు అందజేశారు. అలాగే సబ్సిడీపై మంజూరైన కుట్టు మిషన్లు, పిండి గిర్నీ, ఇతర వస్తువులను ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్నదన్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఐటీడీఏ పీఏ భావేశ్‌మిశ్రా, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, పీహెచ్‌వో రమణ, ఐటీడీఏ డీడీఎం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


logo