గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 15, 2020 , 03:43:14

పూర్తి వివరాలతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంపిణీ

పూర్తి వివరాలతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంపిణీ

  • n పాఠశాలలు తెరిచే నాటికి జారీకి సన్నాహాలు
  • n ఉద్యోగోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు చెక్‌
  • n ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం
  • n జిల్లాలో 841 పాఠశాలలు.. 2893 మంది టీచర్లు

 సారంగాపూర్‌ :  841 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2893 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు జారీ చేయనున్నారు. ఫొటో కార్డులను అన్ని రకాల సేవలకు ప్రామాణికంగా తీసుకోనున్నట్లు సమాచారం. కార్డుపై ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం, ఉద్యోగంలో చేరిన తేదీ, ఫోన్‌, ఆధార్‌, పాన్‌కార్డుల నంబర్లు, బ్లడ్‌గ్రూప్‌, గతంలో పని చేసిన ప్రాంతం, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, జీతభత్యాల వివరాలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో సీనియారిటీ ప్రాతిపదికన జరిగే ఉద్యోగోన్నతులు, బదిలీల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

నమోదు ఇలా...

ఉపాధ్యాయులు మందుగా http: rchooedu.teanfana.gov.in/imr వైబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆన్‌లైన్‌ మెనూ క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత టీచర్‌ ఐడీ కార్డు ఇన్ఫోపై క్లిక్‌ చేసి కొత్త పేజీలోకి వెళ్లాలి. ట్రైజరీ ఐడీ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాని నమోదు చేస్తే ఐడీ కార్డు ముద్రించే వివరాలు స్క్రీన్‌పై వస్తాయి. అవి సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. చేర్చాల్సిన వివరాలు ఉంటే నమోదు చేయాలి. బ్లడ్‌గ్రూప్‌, అడ్రస్‌, ఫొటోను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ క్లిక్‌ చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. 

గుర్తింపు కార్డుల జారీ హర్షణీయం..

ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలని నిర్ణయించడం హర్షణీయం. ఈ కార్డులో ఉపాధ్యాయులకు సంబంధించిన పలు వివరాలను పొందుపరుస్తున్నారు. చిరునామా, పనిచేసే ప్రదేశం తదితర అంశాలను తెలియపరుస్తూ ఈ కార్డును జారీ చేయనున్నారు. గతంలో డ్రాయింగ్‌ అధికారులు ఈ కార్డులను ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నందుకు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

-కాలేరి రవీందర్‌, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు, సారంగాపూర్‌

31వరకు గడువు ఉంది..

ఉపాధ్యాయుల గుర్తింపు కార్డులకు సంబంధించి గత సంవత్సరమే వివరాలు సేకరించాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడంతో పాటు కొత్తగా రక్తం గ్రూపు, చిరునామాలను నమోదు చేసుకోవడానికి ఈనెల 31 వరకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎంఈవోలకు సమాచారం అందజేశాం. ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవిద్యాశాఖ నుంచి కార్డులు వస్తే అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.   - పద్మ, జిల్లా సెక్టోరియల్‌ అధికారి, నిర్మల్‌

సెప్టెంబర్‌లో జారీ చేసే అవకాశం..

గతంలో ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు కార్డులు ఇచ్చే వారు. ప్రభుత్వం మొదటి సారిగా ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులు అందజేయనుంది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరుచుకునే నాటికి వీటిని అందజేసేలా ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్‌లో కార్డులు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల డుమ్మాలకు చెక్‌పెట్టేందుకు కూడా కార్డు ఉపయోగపడుతుందని , కార్డుతో స్వైప్‌ చేస్తేనే హాజరు నమోదవుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. logo