గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 13, 2020 , 01:54:45

వర్షాలు అనుకూలం.. పంటలు ఆశాజనకం

వర్షాలు అనుకూలం.. పంటలు ఆశాజనకం

  • n  రైతులకు కలిసివస్తున్న కాలం
  • n  ఏపుగా పెరుగుతున్న పంటలు
  • n  పత్తిలో పింక్‌బౌల్   ప్రమాదం లేకుండా చర్యలు
  • ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో ఈ ఏడాది రైతులు నియంత్రిత సాగు విధానాన్ని అవలంబిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో  5,71,416 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగువుతున్నాయి. పత్తి నాలుగు లక్షల ఎకరాలు, కంది 71,511, సోయాబీన్‌ 93 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలున్నాయి. జిల్లాలో రైతులు ఏటా వానకాలం సీజన్‌లో జూన్‌ మొదటి, రెండో వారంలో విత్తనాలు వేస్తారు. ఈ ఏడాది సైతం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా పంటకాలం జాప్యం కాకుండా సీజన్‌లో వేసే పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలను సీజన్‌ ప్రారంభంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని దుకాణాల్లో పత్తి, ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచారు. దీంతో రైతులకు సకాలంలో విత్తనాలు వేసుకునే అవకాశం లభించింది. పంటల సాగులో భాగంగా అవసరమైన ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెల వారీగా పంపిణీ చేయాల్సిన ఎరువులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఫర్టిలైజర్‌ దుకాణాల్లో అందుబాటులో ఉంచారు.

ఏపుగా పంటలు..

జిల్లాలో పంటల సాగుకు అవసరమైన వానలు పడుతుండడంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పత్తి, కంది, సోయాబిన్‌ పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. సీజన్‌లో ఇప్పటి వరకు 544.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదుకావడంతో పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు అంటున్నారు. నల్లరేగడి నెలలు ఉండడంతో ముసురుతో కూడిన వానలు పంటలకు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ఆగస్టు నెలలో పత్తి పంటకు పింక్‌బౌల్‌ ప్రమాదం ఉండడంతో వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎకరానికి ఆరు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పింక్‌బౌల్‌ వస్తే ఉపయోగించడానికి వేప నూనెను అధికారులు దుకాణాల్లో సిద్ధంగా ఉంచారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలో పంటలను పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సీజన్‌లో పంటలు ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.logo