సోమవారం 18 జనవరి 2021
Nirmal - Aug 12, 2020 , 02:58:05

ఎనిమిదేళ్లుగా అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వాసురెడ్డి

ఎనిమిదేళ్లుగా అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వాసురెడ్డి

  • తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు   n ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
  • కలెక్టర్ల చేతుల మీదుగా పలు అవార్డులు   n ఏకలవ్య ఫౌండేషన్‌ ద్వారా రైతులకు శిక్షణ

సోన్‌ : నిర్మల్‌ మండలం చిట్యాల్‌ గ్రామానికి చెందిన పన్నాల వాసురెడ్డికి గ్రామ సమీపంలో ఆరున్నరెకరాల భూమి ఉంది. ఇందులో బావి, బోరు ఉండడంతో సాగు చేస్తున్నాడు. ఈ భూమి స్వభావాన్ని బట్టి సేంద్రియ సాగు చేయాలనుకున్నాడు. 2013లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రాంతంలో నిర్వహించిన సేంద్రియ సాగు క్షేత్రస్థాయి ప్రదర్శనకు వెళ్లాడు. అక్కడి రైతులు సాగు చేస్తున్న సేంద్రియ విధానం ఆయనను ఆకట్టుకున్నది. తిరిగి వచ్చిన తర్వాత నాలుగు ఆవులు, రెండు బర్రెలు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసి వినియోగిస్తున్నాడు. ఆవుల మూత్రాన్ని తెగుళ్ల నివారణకు ఉపయోగిస్తున్నాడు. ఆవు మూత్రంలో 17 రకాల ఔషధ గుణాలు ఉంటాయి. పంటకు చీడ పీడలు ఆశించినా డ్రిప్‌ ద్వారా పంట మొక్కలకు అందిస్తున్నాడు. దీంతో పంటలకు ఎలాంటి తెగుళ్లు సోకకపోగా.. అధిక దిగుబడులు వస్తున్నాయి.

యేటా పంట మార్పిడి..

తనకున్న ఆరున్నర ఎకరాల్లో సంప్రదాయ పంటలతోపాటు వాణిజ్య పంటలను వేస్తున్నాడు. ముఖ్యంగా పత్తి, మక్క, వరి, పసుపు, కందులు, నువ్వులు సాగు చేస్తున్నాడు. యేటా పంట మార్పిడి పద్ధతులను అవలంబిస్తున్నాడు. ఒకే పంటను వేయడంతో పంట దిగుబడి తగ్గే అవకాశముందని చెబుతున్నాడు. గతేడాది వానకాలంలో ఎకరంన్నరలో పత్తి వేయగా, పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ. 10 వేల పెట్టుబడి పెడితే.. రూ.50 వేల ఆదాయం వచ్చింది. రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేయగా రూ.30 వేల పెట్టుబడి అయింది. 46 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. బియ్యం పట్టించి అమ్మితే రూ.1.50 లక్షల దాకా ఆదాయం సమకూరింది. రెండెకరాల్లో పసుపు, మక్క వేయగా, పెట్టుబడి రూ.50 వేలు అయింది. రూ.1.32 లక్షల ఆదాయం వచ్చింది. ఈ యేడాది తనకున్న ఆరున్నర ఎకరాల్లో ఎకరం వరి, ఎకరం పసుపు, ఎకరం కంది, రెండెకరాల్లో పత్తి, మిగతా ఎకరన్నరలో నువ్వులు, కూరగాయలు సాగు చేస్తున్నాడు.

పంట విత్తుకోవడానికి ముందే.. 

విత్తనాలు వేయడానికి ముందే సేంద్రియ ఎరువును భూమిలో చల్లి కలియదున్నుతాడు. ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తినప్పటి నుంచి పూత, కాత దశ వరకు కూడా సేంద్రియ ఎరువును వాడుతున్నాడు. పంటకు సోకిన తెగుళ్ల నివారణకు ఆవు మూత్రం, పుల్ల పెరుగు, ఆవుపేడ, బెల్లం, శనగ పిండి వంటి పదార్థాలతో ఎరువులను తయారు చేసి పంట ఎదుగుదలను బట్టి వినియోగిస్తున్నాడు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వినియోగించడం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు వస్తాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకంతో భూసారం తగ్గిపోవడమేగాక పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని పేర్కొంటున్నాడు. ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల రైతులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలుపుతున్నాడు.

ఉమ్మడి జిల్లాలో ఉత్తమ రైతుగా అవార్డులు

రైతు వాసురెడ్డి సేంద్రియ సాగు చేయడమే గాక.. పది మందికి తెలియాలనే సంకల్పంతో మాస్టర్‌ ట్రైనర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సేవలను గుర్తించిన ఏకలవ్య ఫౌండేషన్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రిసోర్స్‌ పర్సన్‌గా ఎంపిక చేసింది. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 5 వేల మంది రైతులకు సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఇందులో ఆదిలాబాద్‌, బెల్లంపల్లి, ఉట్నూరు, జైనూర్‌, తాండూర్‌, ఇంద్రవెల్లి, బోథ్‌, గుడిహత్నూర్‌, నేరడిగొండ, భైంసా, ఖానాపూర్‌, కడెం మండలాల రైతులకు సేంద్రియ సాగు విధానంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. ఉత్తమ రైతుగా ఎంపికై పలువురు కలెక్టర్ల చేతుల మీదుగా మూడు సార్లు అవార్డులు అందుకున్నాడు. సేంద్రియ సాగు ద్వారా 46 క్వింటాళ్ల వరిని పండించి ‘బెస్ట్‌ రైస్‌' అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 42 క్వింటాళ్ల నార్మల్‌ థర్మలిక్‌ దిగుబడి సాధించి ఉత్తమ రైతు అవార్డును సొంతం చేసుకున్నాడు.

సేంద్రియ సాగుతో లాభాలు.. 

ఎనిమిదేళ్లుగా సేంద్రియ సాగు చేస్తున్నా. మంచి దిగుబడి వస్తున్నది. పెట్టుబడి కూడా తక్కువే. మంచి లాభాలు పొందవచ్చు. ఆవు మూత్రం, పేడ, జీవామృతం తదితర వాటిని వాడి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నా. పంటల సాగులో వాడుతున్నా. ఆరున్నర ఎకరాల్లో పంట మార్పిడి పద్ధతి అవలంబిస్తున్నా. సేంద్రియ వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఏకలవ్య ఫౌండేషన్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నా. చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

- పన్నాల వాసురెడ్డి, రైతు, చిట్యాల్‌