మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nirmal - Aug 10, 2020 , 22:59:13

‘భువన్‌'తో అక్రమాలకు చెక్‌!

‘భువన్‌'తో అక్రమాలకు చెక్‌!

  • మున్సిపాలిటీల్లో అందుబాటులోకి కొత్త యాప్‌ 
  • ఇండ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాల వివరాలు నమోదు
  • భవనాల రూపురేఖల చిత్రాలు నిక్షిప్తం  
  • బల్దియాలకు అదనపు ఆదాయం
  • సెప్టెంబర్‌ వరకు సమాచార సేకరణ

బల్దియాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు సర్కారు నడుంబిగించింది. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా భువన్‌ యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని ఇండ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో నమోదు చేయనున్నది. సర్కారు కార్యాచరణ మేరకు మున్సిపల్‌ యంత్రాంగం సిద్ధమైంది. ఈ యాప్‌ ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించడంతోపాటు అదనపు ఆదాయం సమకూరనున్నది.        

- భైంసా

ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్‌, బైంసా, ఖానాపూర్‌, నిర్మల్‌, మంచిర్యాల, మందమర్రి, కాగజ్‌నగర్‌, బెల్లం పల్లి, చెన్నూర్‌, నస్పూర్‌, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మున్సి పాలిటీలు ఉన్నాయి. వీటిలో మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భువన్‌ యాప్‌ను రూ పొందించింది. కట్టడాల సమగ్ర సమాచారాన్ని సేకరిం చి శ్లాబుల ప్రకారం పనులు చేపట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ప్రతి భవనాన్ని 360 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తా రు. ఇందులోని వివరాల ఆధారంగా ఏ భవనానికి ఎంత ఆస్తిపన్ను, నల్లాచార్జీలు వసూలు చేయాలో నిర్ణయించి సంబంధిత కేటగిరీలో చేర్చుతారు. ఆయా భవంతులపై అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, సెల్‌టవర్లు ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటారు.

సమకూరనున్న అదనపు ఆదాయం..

పట్టణాల్లో నివసిస్తున్న జనాభాకు అనుగుణంగా బల్దియాలకు ఆదాయం సమకూరడం లేదు. ముఖ్యంగా ఆస్తి, నల్లా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అయితే  పన్నుల మదింపు సక్రమంగా జరుగకపోవడం తో సర్కారు ఆదాయానికి దండిగా గండి పడుతున్నట్టు గుర్తించింది. పాత పద్ధతిలోనే పన్నుల వసూలు చేయడంతో గృహసముదాయాలను వ్యాపార అవసరాలకు వినియోగించినా అందుకు అదనపు పన్నులు చెల్లించడం లేదు. అలాగే ఆస్తి పన్ను పరిధిలోకి రాని అక్రమ నిర్మాణాలను గుర్తించి, పన్ను విధించేందుకు గతంలో సరైన వ్యవస్థ లేదు. ఇలాంటి అనేక లోసుగులకు ఈ యాప్‌తో తెరపడనున్నది. 

సెప్టెంబర్‌ 10లోగా సమాచారం సేకరించాలి

సెప్టెంబర్‌ 10వ తేదీలోగా సమాచారం సేకరించాలని మున్సిపాలిటీలను ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక సిబ్బంది నియామకం, శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో నివాసానికి సంబంధించి 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వైశాల్యం, నల్లా కనెక్ష న్లు, విద్యుత్‌ మీటర్లు, భవంతులపై అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, సెల్‌టవర్‌ ఇతర వివరాలన్నింటినీ పొందుపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఆయా భవంతులు వ్యాపార, వాణిజ్య సముదాల  వివరాలు తీసుకోనున్నారు. విద్యుత్‌శాఖ నుంచి మీట  ర్లు, వాణిజ్యశాఖ నుంచి వ్యాపార అనుమతులు, ప్లానిం గ్‌ విభాగం నుంచి భవనాల వివరాలు సేకరిస్తారు. 


logo