గురువారం 22 అక్టోబర్ 2020
Nirmal - Aug 09, 2020 , 01:37:39

వీధి వ్యాపారానికి ఆర్థిక భరోసా

వీధి వ్యాపారానికి ఆర్థిక భరోసా

నిర్మల్‌ అర్బన్‌ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య, వర్తకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు ఐదు నెలలుగా వ్యాపారాలు సక్రమంగా జరుగకపోవడంతో ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో, ఆ తర్వాత వ్యాపారాలు సరిగా నడవకపోవడంతో ఇన్నా ళ్లు పెట్టుబడికి దాచి ఉంచిన డబ్బులను ఇంటి అవసరాలకు ఖర్చు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం వ్యాపారం చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గ్రహించిన ప్రభుత్వాలు రుణాలు అందించేందుకు ముందుకొచ్చాయి. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల వరకు  రుణాలు అందిస్తున్నారు.  

ఉమ్మడి జిల్లాలో 19,131 మంది వీధి వ్యాపారుల గుర్తింపు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వీధి వ్యాపారుల రుణాల కోసం ఈ నెల 6వ తేదీ వరకు మొత్తం 36,367 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 19,131 మందిని గుర్తించారు. ఇప్పటివరకు 1,041 మందికి రూ.10 వేల రుణాలను అందజేశారు. నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల పరిధిలో ఐకేపీ అధికారులు కొన్ని రోజులుగా సర్వే నిర్వహించారు. ఇందులో వీధి వ్యాపారులు చేసుకునే వారిని గుర్తించారు.  

ఐకేపీ ఆర్పీల సర్వే..

నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారులను గుర్తించేందుకు ఐకేపీ ఆర్పీలు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో ఐకేపీ సిబ్బంది వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో నమోదైన వివరాల ప్రకారం రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే, వారి వివరాలను పరిశీలించి బ్యాంకు ఖాతా ఆధారంగా రుణాలను అందజేస్తున్నారు. ప్రతిరోజూ ఆయా మున్సిపాలిటీల్లో సిబ్బంది సర్వే నిర్వహిస్తూ అన్ని రకాల వీధి వ్యాపారాలు చేసే వారిని గుర్తిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 5,222 మంది ఉన్నట్లు గుర్తించగా, రోజూ చేపట్టే సర్వేతో వీధివ్యాపారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

రుణాలు సక్రమంగా చెల్లిస్తే..

ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారుల్లో పలువురికి రూ.10 వేల రుణాలను అందజేశారు. ఈ రుణాలను అతి తకక్కువ వడ్డీతో 12 నెలల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. వడ్డీ 11 శాతం ఉండగా.. ప్రతి నెలా సక్రమంగా వాయిదా చెల్లించిస్తే 7శాతం వడ్డీ తగ్గింపు ఉండగా.. కేవలం 4 శాతం మాత్రమే చెల్లించే అవకాశం ఉండనుంది.logo