గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 07, 2020 , 03:53:24

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

  • n బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
  • n వీసీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • n పాల్గొన్న నిర్మల్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్లు, వైద్యాధికారులు

నిర్మల్‌ టౌన్‌/ఎదులాపురం : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా వైరస్‌ నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా వైద్య ఆరో గ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు గుర్తించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లో వృద్ధులు, చిన్న పిల్లలకు వైరస్‌ సోకకుండా చైతన్యం చేయాలని సూచించారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలని, వైద్యులతో తగు కౌన్సెలింగ్‌ అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు నిరాదరణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించి, త్వరితగతిన ఫలితాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ దవాఖానలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కౌన్సెలింగ్‌తో పాటు మెడికల్‌ కిట్‌ అందించాలని సూచించారు. కొత్త పరీక్షా కేం ద్రాల ఏర్పాటు కోసం తగు వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. చికిత్స కోసం వైద్యులు, సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ప్రతిపాదిస్తే, అనుమతులు ఇస్తామని వెల్లడించారు. జిల్లా ఏరియా దవాఖానలు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కరోనా చికిత్సకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు తగు ప్రొఫార్మాలో సమర్పించాలన్నారు. ఐసొలేషన్‌ కిట్లు, అందించిన మందుల వివరాలకు సంబంధించిన సర్క్యూలర్‌, ప్రొటోకాల్‌పై నిబంధనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ జిల్లాలో ఇప్పటి వరకు వైరస్‌ వ్యాప్తి గురించి తెలుసుకున్న మంత్రి, నివారణ చర్యలపై మరింత వ్యూహాత్మకంగా సమష్టి కృషితో ముందుకెళ్లాలని సూచించారు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. లక్షణాలున్న అనుమానితులకు పరీక్షలు చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి మెడికల్‌ కిట్‌ అందించడంతో పాటు వైద్యుల పర్యవేక్షణ ఉంటున్నదని తెలిపారు. జిల్లాలో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, రోజుకు 40 నుంచి 50 మందికి చేస్తున్నట్లు చెప్పారు. 10 ఐసొలేషన్‌ కేంద్రాలు గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రెండు కేంద్రాల్లో 100 పడకలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రిమ్స్‌లో ప్రస్తుతం 120 పడకలు ఉన్నాయన్నారు. 183 వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిమ్స్‌ డైరెక్టర్‌ తెలిపారు. రూ.5.52 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారులు వసంత్‌రావు, నరేందర్‌ రాథోడ్‌, ప్రత్యేకాధికారి కార్తిక్‌, జిల్లా ఏరియా దవాఖాన వైద్యులు దేవేందర్‌తో పాటు వైద్యులు పాల్గొన్నారు. 


logo