మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Aug 06, 2020 , 02:40:12

బాసర అభివృద్ధే ధ్యేయం

బాసర అభివృద్ధే ధ్యేయం

  • n బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులు
  • n ఇంకా ఇచ్చేందుకైనా సీఎం కేసీఆర్‌ రెడీ..
  • n మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • n అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • n అమ్మవారికి ప్రత్యేక పూజలు
  • n సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

బాసర : బాసర క్షేత్రం అభివృద్ధే ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అమ్మవారి సన్నిధిలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ శరత్‌ పాఠక్‌ మంత్రిని సన్మానించి, ప్రసాదం అందజేశారు. ఆలయంలో నూతనంగా చేపట్టే పలు అభివృద్ధి పనులను మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే బాసర క్షేత్రం కోసం రూ.50 కోట్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మరిన్ని నిధులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ.5.70 కోట్లతో భక్తులు విడిది చేసేందుకు షెడ్లు, ఆలయం చుట్టూ ప్రహరీ, అతిథి గృహం నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే రూ.రెండున్నర కోట్లతో గర్భగుడి విస్తరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు యాదగిరిగుట్టలో ఉపయోగించిన కృష్ణ శిలలతో ఈ పనులు చేస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రావడం లేదని తెలిపారు. బాసరకు వచ్చేందుకు భక్తులకు వీలుగా హైదరాబాద్‌ నుంచి రోడ్డు, రైల్వే మార్గం కూడా ఉన్నదన్నారు. జన్కంపేట్‌ నుంచి రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, పూర్తయితే భక్తులకు ఇబ్బందులుండవని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి త్వరగా వీడిపోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట నిర్మల్‌ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు సాగరబాయి, జడ్పీటీసీలు లోలం శ్యాంసుందర్‌, బాసర సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, ఈవో వినోద్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ శరత్‌పాఠక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, నాయకులు బాశెట్టి రాజన్న, సావ్లీ రమేశ్‌, బల్గం దేవేందర్‌ తదితరులు ఉన్నారు. 

చేపట్టే అభివృద్ధి పనులు..

బాసర ఆలయంలో రూ.5.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ.మూడున్నర కోట్లతో ప్రస్తుతం ఉన్న ఆరు అతిథి గృహాలపై మొదటి అంతస్తు నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 25 ఏసీ గదులు ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ అతిథి గృహం పక్క నుంచి లడ్డూ కౌంటర్‌ వరకు, గోశాల నుంచి వ్యాస గృహం వరకు, వ్యాస మహర్షి ఆలయం ఎదుట రూ. కోటి 20 లక్షలతో షెడ్లను నిర్మించనున్నారు. అలాగే రూ.90 లక్షలతో ఆలయ ప్రహరీ, రూ.6.85 లక్షలతో గోదావరి వద్ద శివాలయం ఎదుట షెడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత..

రవీంద్రాపూర్‌ కాలనీకి చెందిన సోయబ్‌కు మంజూరైన రూ.20 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును మంత్రి ఐకే రెడ్డి అందజేశారు. ఆయన వెంట మైనార్టీ నాయకులు సయ్యద్‌ అలీ, ఫసీ, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు తదితరులున్నారు.