మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nirmal - Aug 05, 2020 , 01:58:55

సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి

సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి

  • n జిల్లాలో పనులను వేగవంతం చేయండి
  • n కరోనా వ్యాప్తిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
  • n మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • n జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
  • n అమాత్యుడికి రాఖీ కట్టిన అధ్యక్షురాలు, జడ్పీటీసీలు

నిర్మల్‌ టౌన్‌ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో జిల్లాలోని అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, సంక్షేమ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌ శాఖల్లో అభివృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో డిసెంబర్‌ చివరి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో థర్డ్‌లైన్‌ పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో కరోనా విజృంభించకుండా ప్రత్యేక చర్య లు తీసుకోవాలని, వైరస్‌ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు వేదికల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. శ్మశాన వాటికలు, డంప్‌యార్డులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, శిశు సంక్షేమశాఖలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందేలా చూడాలని సూచించారు. దసరా నాటికి డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి, అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, జడ్పీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, స్థాయీ సంఘాల సభ్యులు జీవన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, లోలం కళావతి, శారద, జమునాబాయి, కో ఆప్షన్‌ సభ్యులు సుభాష్‌రావు, రఫీక్‌ అహ్మద్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మంత్రికి రాఖీ కట్టిన అధ్యక్షురాలు..

సమావేశానికి హాజరైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి జడ్పీ అధ్యక్షురాలితోపాటు జడ్పీటీసీలు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు శారద, జమునాబాయి, కొత్తపల్లి గంగామణి తదితరులు పాల్గొన్నారు. 


logo