సోమవారం 25 జనవరి 2021
Nirmal - Aug 02, 2020 , 23:57:55

సంప్రదాయాల తీజ్‌

సంప్రదాయాల తీజ్‌

గిరిజన యువతుల ప్రత్యేక పండుగ

గోపికల వేషధారణల్లో శ్రీకృష్ణుడికి పూజలు

తండాల్లో తొమ్మిది రోజుల పాటు ఆట, పాటలతో సందడి 

తయ్యొందత్తయ్యొం.. తయ్యొందత్తయ్యొం.. పాటలతో ఇక లంబాడీ తండాలు మార్మోగనున్నాయి. నేటి నుంచి తీజ్‌ సంబురాలు ప్రారంభం కానుండగా, తొమ్మిది రోజుల పాటు వాడవాడలా వైభవంగా సాగనున్నాయి. యువతులు ప్రత్యేక వస్త్రధారణతో తీజ్‌ బుట్టలను తలపై పెట్టుకొని చేసే నృత్యాలు వారి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రధానంగా పెళ్లీడు యువ తులు, కొత్తగా లగ్గం చేసుకున్న మహిళలు పుట్టింటికి వచ్చి ఈ వేడుకలు జరుపు కోవడం ఆనవాయితీ.       

తీజ్‌ ఉత్సవాల పేరుతో యువతులు నిర్వహించుకునే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. రాఖీ పౌర్ణమికి ముందు వచ్చే అమావాస్య రోజున  యువతులు గ్రామాల సమీపంలోని పంటచేలనుంచి మట్టిని తీసుకువస్తారు. వెదురుతో అల్లిన బుట్టల్లో మట్టిని వేసి గోధుమలు అలుకుతారు. ఈ గోధుమలు రాఖీపౌర్ణమి నాటికి మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఎదిగిన విధంగా ఇల్లు అభివృద్ధి చెంది పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని, గ్రామం  సుఖశాంతులతో ఉంటుందని వారి నమ్మకం. రాఖీపౌర్ణమి పండుగకు సోదరులకు రాఖీలు కట్టి మరుసటి రోజు నుంచి ప్రారంభించే తీజ్‌ ఉత్సవాలు శ్రీ కృష్ణ జన్మాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. ఈ ఉత్సవాలను గ్రామంలోని యువతులు, కొత్తగా పళ్లై అత్తవారింటికి వెళ్లిన మహిళలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ ఆచార సంప్రదాయాల ప్రకారం పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. తీజ్‌ బుట్టలను తలపై పెట్టుకుని ప్రత్యేక వస్ర్తధారణతో చేసే నృత్యాలు ఆకట్టుకుంటాయి. గ్రామంలోని యువతులు ఒక చోట చేరి చేసే సంప్రదాయ నృత్యాలు వారి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. గ్రామంలోని పెద్దలు చెప్పిన విధంగా పండుగ ఆచార వ్యవహారాలను నేటితరం యువతీ యువకులు నేర్చుకుని పాటిస్తున్నారు. 350 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆచారం నేటికీ అలాగే కొనసాగుతున్నది. చివరి రోజున గ్రామంలో అన్నదానం చేస్తారు. గ్రామసమీపంలోని వాగుల్లో తీజ్‌లను నిమజ్జనం చేస్తారు. తీజ్‌ల్లో వేసిన గోధుమ నారును ప్రతి ఇంటికీ పంపిణీ చేసి మిగిలిన మొలకలను నీటి ప్రవాహంలో వదిలేస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమితో తీజ్‌ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల తర్వాత గోకులాష్టమి పండుగ మథుర, లంబాడా తండాల్లో ఘనంగా జరుగుతుంది. పెళ్లి వయస్సున్న యువతులకు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయనేది మరో నమ్మకం. 

గోపికలుగా యువతులు..

తీజ్‌ ఉత్సవాల్లో యువతులను గోపికలుగా భావిస్తారు. పెళ్లికాని యువతులు మంచి భర్తలు రావాలని శ్రీకృష్ణున్ని వేడుకున్నట్లుగా ఉత్సవాల తీరు ఉంటుంది. సంబురాల్లో యువతులు పాడేపాటలు, ఆడే ఆటలు గోపాలున్ని కొలుస్తూ.. మంచి భర్తను ప్రసాదించమని కోరుకున్నట్లుగా ఉంటాయి. ఉత్సవాలు ఘనంగా జరిగితే తమ గ్రామంలో అన్ని శుభకార్యాలు జరుగుతాయని వారి నమ్మకం. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున తీజ్‌ పండుగ ముగుస్తుంది. ముగింపు రోజున యువతులు గోపికలుగా అలంకరించుకుంటారు. తమ గ్రామాల సమీపంలో నీరు పారుతూ ఉంటే సెలయేరులో తీజ్‌లను వదిలిపెడుతారు. గోపికలుగా అవతారం ఎత్తి శ్రీకృష్ణున్ని పూజించడం మథుర, లంబాడా తండాల్లో ఆనవాయితీగా వస్తున్నది. పెళ్లికాని యువతులు, కొత్తగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లిన వారు జరుపుకునే ఈ పండుగలో గ్రామ పెద్దలు సూచించిన విధంగానే ఉత్సవాలు నిర్వహిస్తారు.  పెద్దవాళ్లు పాటలు పాడుతూ, ఆడుతూ యువతులకు నేర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రతి మథుర, లంబాడా తండాలోని యువతి తప్పకుండా పాల్గొనాలి. తమ ఆచారం ప్రకారం తీజ్‌ ఆటలు ఆడుతూ పాటలు పాడాల్సి ఉంటుంది. తమ గ్రామంలో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా పెద్దలు అంచనా వేయడానికి ఉత్సవాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు కూడా ఈ ఉత్సవాలు చూసేందుకు వస్తారు. ఇలాంటి సందర్భంలోనే తమ గ్రామంలోని అమ్మాయిలకు మంచి పెళ్లి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉంటాయి. 

మూడు శతాబ్దాల చరిత్ర.. 

350 ఏళ్లకు పూర్వం మహారాష్ట్రలోని జగదాంబా దేవత పూజల్లో భాగంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలుస్తున్నది. యుక్తవయస్సులో ఉన్న జగదాంబాదేవికి పెళ్లి కాకపోవడంతో ఈ ఆచారాన్ని పాటించినట్లు బంజారా పెద్దలు కథలుగా చెబుతారు. జగదాంబా దేవి గ్రామంలో పెళ్లికాని యుక్తవయస్సున్న అమ్మాయిలతో కలిసి ఈ తీజ్‌ను ప్రారంభిం చిందని  చెబుతారు. తొమ్మిది రోజులపాటు లంబాడా, మథుర తండాల్లో ప్రత్యేకంగా యువ తులతోనే జరిగే ఈ ఉత్సవాలతో గిరిగ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. దీంతోపాటు శ్రావణ మాసంలో ఇతర పండుగలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పండుగలకోసం వచ్చే బంధువులతో గ్రామాలు కళకళలాడుతాయి. పెళ్లి సంబంధాలు కలుపుకు నేందుకు ఈ తీజ్‌ ఉత్సవాలు ఒక మంచి సందర్భంగా వీరు భావిస్తారు. అందుకే యువతు లతోనే ప్రత్యేకంగా పండుగ జరుపుకొంటారనే కథనం ప్రాచుర్యంలో ఉంది. వర్షాలు ప్రారంభమై వ్యాధులు వ్యాపించే ఈ తరుణంలో గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు పండుగ నిర్వహిస్తే ఉత్తేజం కలిగి అందరూ హుషారుగా ఉంటారని, దేవతలను కొలవడంతో గ్రామాల్లోకి వ్యాధులు రావని మరో కథనం ఉన్నది. 


logo