మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Aug 02, 2020 , 01:38:09

సైకిల్‌కు క్రేజ్‌..

సైకిల్‌కు క్రేజ్‌..

గతంలో ఇంటికొక సైకిల్‌ ఉండేది.. దానిపైనే ఎంత దూరమైనా వెళ్లి వచ్చే వారు. దీంతో సైకిల్‌ తొక్కిన వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇంటికొక బండి ఉంది.. ఎటు పోవాలన్నా దానిపైనే వెళ్తున్నారు. ప్రస్తుతం  కరోనా పుణ్యా మాని మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో సైకిళ్లకు క్రేజ్‌ వచ్చింది. పాఠశాలలు లేకపోవడం.. ఇంట్లో సెల్‌ఫోన్లతో గంటల తరబడి ఉంటుండడంతో తల్లిదండ్రులు పిల్లలకు సైకిళ్లు కొనిస్తున్నారు. వ్యా యామానికి సైక్లింగ్‌ ఎంతో దోహదపడుతుండడంతో పాటు ఉద యం.. సాయంత్రం స్నేహితులతో కలిసి సైకిల్‌ తొక్కుతూ పిల్లలు ఎంజాయ్‌ చేస్తున్నారు. 

బోథ్‌ : మండలంలోని వివిధ గ్రామాల్లో పోషకులు తమ పిల్లలకు సైకిళ్లు కొనిస్తున్నారు.  మార్కెట్‌లో  రూ .4 వేల నుంచి రూ .10 వేల వరకు వివిధ మోడళ్ల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు ఇచ్చోడ, ఆదిలాబాద్‌, నిర్మల్‌ పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఇప్పుడు కౌఠ(బీ), బోథ్‌, సొనాల, కన్గుట్ట, ధన్నూర్‌ (బీ), కుచ్లాపూర్‌ గ్రామాల్లో చిన్నారులు ఉత్సాహంగా సైకిళ్లు వినియోగిస్తున్నారు. పాఠశాల మైదానం అందుబాటులో ఉన్న వారు దాంట్లో సైక్లింగ్‌ చేస్తున్నారు. వ్యాయామంతో పాటు  శారీరకదారుఢ్యం పెరుగుతుందంటున్నారు. 

బరువు తగ్గడానికి పని కొస్తున్నది...

నేను రోజూ నాలుగైదు గంటల పాటు సైకిల్‌ తొక్కుతున్న. దీంతో బరువు తగ్గడంతో పాటు మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. అందుకే సెల్‌ఫోన్‌ పక్కన పెట్టి స్నేహితులతో కలిసి సరదాగా కొంతదూరం వరకు వెళ్తున్నా. నన్ను చూసి చాలామంది పిల్లలు కూడా సైకిళ్లు కొనుక్కుంటున్నారు.

-ఐ సాత్విక్‌రెడ్డి, 7వ తరగతి, కౌఠ (బీ) 

సెల్‌ఫోన్‌ చేతిలో ఉండేది...

సైకిల్‌ లేనప్పుడు నిత్యం చేతిలో సెల్‌ఫోన్‌ ఉండేది. గంటల తరబడి గేమ్స్‌ ఆడేవాడిని. నాన్న సైకిల్‌ కొనివ్వడంతో ఫోన్‌ మీద ధ్యాస పోయింది. ఏ పని చెప్పినా సైకిల్‌పై వెళ్లి చేసుకొని వస్తున్నా. స్నేహితులతో కలిసి నిత్యం సైక్లింగ్‌కు వెళ్తున్నా. 

-వై శ్రీకర్‌రెడ్డి, 7వ తరగతి , కౌఠ (బీ)