సోమవారం 18 జనవరి 2021
Nirmal - Aug 01, 2020 , 00:34:20

నారు మడులు లేకుండానే వరి సేద్యం

నారు మడులు లేకుండానే వరి సేద్యం

ఖానాపూర్‌ రూరల్‌ : ఇప్పటి వరకు ఒకే రకమైన పంట పండించి దిగుబడి వచ్చీ రాక ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నియంత్రిత పంటల సాగుపై దృష్టి మళ్లించడంతో కొంత ఊరట లభించింది. దీంతో రైతాంగమంతా నియంత్రిత పంటల సాగుపై మొగ్గు చూపుతున్నది. ఇదే క్రమంలో నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎరొబిక్‌ వరి సాగు విధానంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.  

వరి సాగు అప్పుడలా.. ఇప్పుడిలా..

గత సంవత్సరం వరకు వరి సాగు చేయడంలో మొదట దుక్కి దున్నడం, నారు మడులు తయారుచేయడం, ట్రాక్టర్‌ సహాయంతో కేజ్‌వీల్స్‌తో తొక్కించడం, పొలం మడులు సరిచేయడం, గొర్రు కొట్టి నాట్లు వేయడం వంటి ప్రక్రియలు అయ్యేది. దీంతో రైతులకు అధిక పెట్టుబడి, శ్రమ ఉండేది. ఇప్పుడు నీటి లభ్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎరొబిక్‌ సాగు విధానం కొత్త రూపును అందుకుంది. మొదటిసారి దుక్కి దున్నిన తర్వాత ట్రాక్టర్‌తో రొటవేటర్‌ వేయించి నేరుగా వరి విత్తనాలను విత్తడం ప్రారంభిస్తారు. ఈ పద్ధతిన ఎకరానికి 10 నుంచి 12 కేజీల బస్తా విత్తనాలు విత్తుతారు. ఎలాంటి పం ట తెగుళ్ల బారిన పడకుండా కచ్చితత్వమైన దూరం 15 సెంటీమీటర్లు పాటిస్తూ విత్తనాలను వేస్తారు. ఇలా వేసిన పంట అతి తొందరగా వృద్ధి చెందుతూ ప్రతి గింజా మొలకెత్తుతుంది. వరి మొక్క ఏపుగా పెరిగి తనకు తాను పొషణ చేసుకుంటుంది. ఎరొబి క్‌ వరి పంట సాగు విధానంలో కలుపు యాజమా న్యం తప్పా అతిగా శ్రమ ఉండదని అధికారులు పే ర్కొంటున్నారు. అతిగా పంట ఎరువులు వాడకుండానే మామూలు ఎరువులతో పంట వృద్ధి చెందుతుం ది. ఈ పంట సాగుకు రైతులు పెట్టుబడి తక్కువగా పెట్టి ఆదాయం ఎక్కు వఆర్జించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎరొబిక్‌ వరి సాగు విధానంలో ఎల్లప్పుడూ నీటితడి ఉండకుండా పొడి గా ఉంటుంది. పంట కోతకు వచ్చే సమయానికి (హార్వేస్టర్‌) కోత యంత్రాలకు  సైతం సులభంగా పంట తీసే వీలుంటుంది. ఈ విధానంలో వరి పంట నేలకు ఒరిగే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. 

ఎరొబిక్‌ వరి సాగు విధానంలో నీటి లభ్యత శాతం తక్కువ మోతాదులో ఉండే ప్రాంతాలకు ప్రత్యేకం దీని ద్వారా ఎక్కువగా ఆదాయం సమాకూరుతుంది. ఈ సాగు మండలంలోని పాత తర్లపాడ్‌, పాత ఎల్లాపూర్‌ గ్రామాల్లో సమారు ఐదెకరాల వరకు చేస్తున్నారు. రైతులు ఎరొబిక్‌ వరి సాగు విధానంలో శ్రద్ధ చూపితే ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తాం. ఈ పద్ధతిలో ఎకరానికి మూడు క్వింటాళ్ల ధాన్యం అధికంగా పండించవచ్చు. - ఆసం రవికుమార్‌, ఖానాపూర్‌ ఏవో