మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jul 30, 2020 , 23:49:34

సదర్మాట్‌కు సాగునీరు

సదర్మాట్‌కు సాగునీరు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ద్వారా సదర్మాట్‌ ఆనకట్టకు ఆగస్టు 1 నుంచి నీటిని  వదలనున్నారు. ఇప్పటికే జూలై 24 నుంచి వారబందీ విధానంలో సరస్వతీ కాలువ ద్వారా నీటిని ఇస్తున్నారు. సదర్మాట్‌ ఆనకట్ట కోసం సరస్వతీ కాలువ ద్వారా లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ నుంచి వాగులోకి వదులుతారు. అక్కడి నుంచి గోదావరిలోకి నీరు వెళ్లి.. ఈ నీరంతా సదర్మాట్‌ ఆనకట్టకు చేరుతుంది. ఆనకట్ట నుంచి ఆయకట్టుకు నీరు అందుతుంది.    

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : రేపటి నుంచి ఆగస్టు 8 వరకు సరస్వతీ కాలువ ద్వారా సదర్మాట్‌ ఆనకట్టకు నీటిని వదిలి.. తర్వా త వడ్యాల్‌ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ మూసేస్తారు.  తర్వాత 8 రోజు ల పాటు వారబందీ విధానంలో సరస్వతీ కాలువ ఆయకట్టుకు సాగునీటిని ఇస్తారు. ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కాలువ ద్వారా వానకాలానికి సరిపడా సాగు నీటిని.. అక్టోబర్‌ నెలాఖరు వరకు నిరంతరాయంగా విడుదల చేస్తారు. జూలై 24న ఎస్సారెస్పీ నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా సరస్వతీ కాలువకు నీటిని విడుదల చేశారు. ముందుగా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. తర్వాత 600 క్యూసెక్కులకు, ప్రస్తుతం 800 క్యూసెక్కులకు నీటి విడుదల పెంచి ఇస్తున్నారు.

సాగుకు ఢోకా లేదు..

సరస్వతీ కాలువ కింద 35,753 ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానకాలం సీజన్‌కు సంబంధించి అక్టోబర్‌ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల వారబందీ పద్ధతిలో కొనసాగనున్నది. ప్రస్తుతం సరస్వతీ కాలువ ఆయకట్టు రైతులు వరినాట్లు వేస్తుండగా.. కొందరు భూమిని దున్ని సిద్ధం చేసుకు న్నారు. సదర్మాట్‌ ఆనకట్ట కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానకాలం సీజన్‌లో ఆయకట్టుకు సరిపడా నీటిని వదులుతారు. సరస్వతీ కాలువ ఆయకట్టు మాదిరిగానే.. సదర్మాట్‌ ఆనకట్టకు అక్టోబర్‌ నెలాఖరు వరకు వారబందీ పద్ధతిలో 7 రోజులపాటు నీటిని విడుదల చేస్తామని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం ఆశించిన మేర నీటి నిల్వలుండగా.. తాజాగా వరద కాలువను కాళేశ్వరం జలాలతో నింపడంతో నిర్మల్‌ జిల్లాలో ఆయకట్టు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.

ప్రధాన కాలువలకు నీరు..

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90. 313 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,074.8 అడుగుల (38. 773 టీఎంసీలు) మేర నీటి నిల్వలున్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1048.90 అడుగుల (5.609 టీఎంసీలు) నీటిమట్టంతో డెడ్‌ స్టోరేజీలో ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 3,097 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఎస్సారెస్పీ నుంచి తాగు, సాగునీటి అవసరాలకు 8,477 క్యూసెక్కు ల నీరు అవుట్‌ ఫ్లోగా ఉంది. ప్రస్తుతం కాకతీయ కాలువకు 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 350 క్యూసెక్కులు, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకానికి 540 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతల పథకానికి 405 క్యూసెక్కుల నీరు ఇస్తుండగా.. మరో 430 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నది. ఇక మిషన్‌ భగీరథ పథకానికి జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు కలిపి 152 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 16.85 టీఎంసీల వరకు వరద ఎస్సారెస్పీలోకి వచ్చి చేరింది.logo