శనివారం 23 జనవరి 2021
Nirmal - Jul 30, 2020 , 02:47:26

చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

కడెం : కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని రైతులకు మంచిర్యాల, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, అజ్మీరా రేఖానాయక్‌ హామీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జలాశయం నీటి విడుదలపై ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం సమావేశం నిర్వహించారు. రైతులు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు బుధవారం నుంచి ప్రధాన (ఎడమ) కాలువకు 250 క్యూసెక్కులు, కుడి కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్‌ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉన్నందున ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురిసి, ఇన్‌ఫ్లో పెరిగితే ప్రధాన కాలువకు నీటి విడుదలను పెంచాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరద వచ్చే అవకాశం ఉన్నదని, రెండు మూడురోజుల్లో నీటి విడుదల పెంచాలన్నారు. ఈ కాలువ ద్వారా చివరి ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీ-42 వరకు నీరు అందేలా చూడాలని తెలిపారు. అనంతరం నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో ‘హరితహారం’లో భాగంగా ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. సమావేశంలో కడెం, దస్తురాబాద్‌, జన్నారం ఎంపీపీలు అలెగ్జాండర్‌, సింగరి కిషన్‌, మదాటి సరోజన, ఆయకట్టు ఈఈ రాజశేఖర్‌, డీఈలు భోజదాసు, గణేశ్‌, జేఈ రాజు, తహసీల్దార్‌ నరేందర్‌, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు రఫీక్‌హైమద్‌, నాయకులు లక్ష్మణ్‌, గౌసొద్దీన్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులున్నారు. 


logo