బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jul 30, 2020 , 02:32:13

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు నామకరణం

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు నామకరణం

నిర్మల్‌ జిల్లాలోని సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగు నీరందించే ప్యాకేజీ-27కు లక్ష్మీనర్సింహస్వామి ఎత్తిపోతల పథకంగా.. ముథోల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్యాకేజీ-28కు శారదాదేవి ఎత్తిపోతల పథకంగా పేర్లు పెట్టారు. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ జీవో జారీ చేశారు. కాగా.. పనుల్లో వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మాణ పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులతోపాటు సాగునీటి పారుదలశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. - నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునర్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఎస్సారెస్పీ నుంచి నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాలకు ప్యాకేజీ-27, 28 ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పనులు నడుస్తున్నాయి. ఎస్సారెస్పీపై ఆధారపడిన మరో లక్ష ఎకరాలకు కూడా అదనపు నీరు అందుబాటులో ఉండనుంది. నిర్మల్‌ నియోజకవర్గం దిలావర్‌పూర్‌ మండలం కాల్వలో లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉండగా.. ప్యాకేజీ-27 ఎత్తిపోతల పథకానికి లక్ష్మీనర్సింహస్వామి పేరు పెట్టారు. ముథోల్‌ నియోజకవర్గం బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువుదీరగా.. ప్యాకేజీ-28 ఎత్తిపోతల పథకానికి శారదాదేవి పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చకచకా పనులు.. లక్ష ఎకరాలకు సాగునీరు.. 

కాళేశ్వరం ప్యాకేజీ-27లో భాగంగా నిర్మల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులకు రూ.714 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ.447.34 కోట్లు ఖర్చు చేయగా.. 65 శాతం పనులు పూర్తయ్యాయి. పంపుహౌస్‌, టన్నెల్‌, ప్రధాన కాలువ పనులు పూర్తి కాగా.. ఈ యేడాది చివరి వరకు సాగునీరు ఇవ్వనున్నారు. ఈ ప్యాకేజీ కింద సుమారు 99 గ్రామాలకు సాగునీరు అందనుంది. దోని గాం, స్వర్ణ ప్రాజెక్టులతోపాటు నిర్మల్‌ పరిధిలోని గొలుసుకట్టు చెరువులను నింపి.. ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ప్యాకే జీ-28 ద్వారా ముథోల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పనులకు రూ.486.67 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.235.35 కోట్లు ఖర్చు చేయగా.. 40 శాతం పనులు పూర్తయ్యాయి. పంపు హౌస్‌, ప్రధాన కాలువ నిర్మాణాలు  చేపట్టారు. ఈ ప్యాకేజీ ద్వారా 54 గ్రామాలకు సాగునీరు అందనుంది.

ఇప్పటికే స్మితాసబర్వాల్‌,  శ్రీధర్‌రావు దేశ్‌పాండే పనుల పరిశీలన

నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్యాకేజీ పనులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. ఈ పనుల్లో వేగం పెంచి.. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మాణ పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులతో పాటు సాగునీటి పారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష కూడా చేశారు. గతంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌.. ఇటీవల సీఎంవో ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల ప్రగతిని పరిశీలించారు. 


logo