గురువారం 21 జనవరి 2021
Nirmal - Jul 24, 2020 , 23:46:57

ఉమ్మడి జిల్లాకు ఏడు అంబులెన్స్‌లు

ఉమ్మడి జిల్లాకు ఏడు అంబులెన్స్‌లు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ఆదర్శవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ దవాఖానలకు ఆరు అంబులెన్స్‌లను ఇస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కూడా అదే బాటలో నడిచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రత్యేక అంబులెన్స్‌లు తమ సొంత డబ్బులతో సమకూరుస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు కరోనా ప్రత్యేక అంబులెన్స్‌లు ఏడు ఇస్తామని ప్రకటించగా.. ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నాలుగు, విప్‌ బాల్క సుమన్‌ మూడు ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కో అంబులెన్సుకు రూ.25 లక్షల వరకు వ్యయం అవుతుండగా.. ఏడు అంబులెన్సులకు రూ.1.75కోట్ల వరకు ఖర్చు కానుంది. వీటిని ప్రభుత్వ దవాఖానలకు అందజేయనుండగా, వీటిలో అన్ని సౌకర్యాలతో కరోనా టెస్టులు చేసే వీలుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మినీ దవాఖానలుగా వీటిని ఉపయోగించనున్నారు. ప్రతి అంబులెన్స్‌లో అత్యవసర మందులతో పాటు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. వీటిలో టెస్టులు కూడా చేయడానికి అవసరమైన సిబ్బంది ఉండేలా చూడనున్నారు. మంత్రి కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని, తాము కూడా అంబులెన్సులు ఇస్తామని ప్రకటించినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో వీటిని అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కో అంబులెన్స్‌ విలువ రూ.25లక్షల వరకు ఉండగా, ఉ మ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తాను అందించే నాలుగు అంబులెన్సులకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతుందన్నారు.


logo