సరస్వతీ కాలువకు సాగు నీరు

నిర్మల్, నమస్తే తెలంగాణ : ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి శుక్రవారం సరస్వతీ కాలువకు సాగునీరు విడుదల చేయనున్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం ఆశించిన మేర నీటి నిల్వలు ఉన్నాయి. కాళేశ్వరం జలాలతో తాజాగా వరద కాలువను నింపడంతో నిర్మల్ జిల్లాలో ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. నిర్మల్ జిల్లాకు ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కాలువ ద్వారా 35,753 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉండగా.. తాజాగా వానకాలంలో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. జిల్లాలోని సోన్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ మండలాలకు సరస్వతీ కాలువ ద్వారా సాగు నీరు అందుతున్నది. ఎస్సారెస్పీ పూర్తి మట్టం 1091అడుగులు (90. 313 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1073.6 అడుగులు (36.528 టీఎంసీలు) మేర నీటి నిల్వలున్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1048.40 అడుగుల (5.347 టీఎంసీలు) డెడ్ స్టోరేజీలో నీటి నిల్వలున్నాయి.
పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు..
వరద కాలువను కాళేశ్వరం జలాలతో నింపడంతో.. ప్రస్తు తం ప్రాజెక్టులో ఉన్న నీరు ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సరిపోనుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 7,446 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. అంతే మొత్తంలో నీరు అవుట్ ఫ్లోగా ఉంది. ఇప్పటికే కాకతీయ, లక్ష్మి కాలువలకు నీరు విడుదల చేస్తుండగా.. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగునీరు ఇస్తున్నారు. ప్రస్తుతం కాకతీయ కాలువకు 5వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 350 క్యూసెక్కు లు, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 720 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతల పథకానికి 270 క్యూసెక్కుల నీరు ఇస్తుండగా.. మరో 412 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నది. ఇక మిషన్ భగీరథ పథకానికి జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కలిపి 152 క్యూసెక్కుల నీరు ఇస్తున్నా రు. ఎగువ ప్రాంతం నుంచి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 10.13 టీఎంసీల వరకు వరద ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిం ది. ఈ సారి ఎస్సారెస్పీలోకి క్రమంగా వరద వస్తుండగా.. కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీని నింపనున్నారు.
అక్టోబరు వరకు సాగునీరు..
నేడు (శుక్రవారం) సరస్వతీ కాలువకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా నీటి ని విడుదల చేయనున్నారు. వారబందీ పద్ధతిలో నీరు ఇవ్వాలని నిర్ణయించగా.. ముందుగా 300 క్యూసెక్కులను వదిలి.. రైతుల అవసరాన్ని బట్టి 800 క్యూసెక్కుల వరకు పెంచనున్నా రు. నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు అక్టోబర్ నెలాఖరు వరకు సాగునీరు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆయకట్టు పరిధిలో బోర్ల కింద కొందరు నార్లు పోయగా.. మరికొందరు నాట్లు వేస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో సగానికిపై నీరు నిల్వ ఉంది. ఇక్కడ వరినాట్లు వేస్తున్నారు. కొందరు నార్లు సిద్ధంగా చేసుకుంటున్నారు. కాలువ కింద నార్లు పోసిన వారు నాట్లకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయం లో సాగునీరు విడుదల చేయడంతో రైతులకు ఉపయోగకరంగా మారనుంది.
సరస్వతీ కాలువకు వారబందీ పద్ధతిలో సాగునీరు..
వానకాలం పంటల కోసం సరస్వతీ కాలువ కింద ఉన్న ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి వారబందీ పద్ధతిలో శుక్రవారం నీటిని విడుదల చేస్తాం. ముందస్తు సాగుతో కాలువ నీటితో రైతులకు ప్రయోజనం ఉంటుంది. రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అక్టోబరు వరకు 35,753 ఎకరాల చివరి ఆయకట్టు నీరు విడుదల చేస్తాం.
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
తాజావార్తలు
- అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ కృషి
- నిరుపేదలకు భరోసా సీఎంఆర్ఎఫ్
- ముగ్గులు తెలంగాణ సంస్కృతిని చాటుతాయి
- వైభవంగా గట్టు మైసమ్మ జాతర
- వయోవృద్ధులసంక్షేమానికి ప్రభుత్వం కృషి
- యువత సేవలు అభినందనీయం
- ఆర్టీసీ ప్రతిష్టను మరింత పెంచాలి
- కార్యకర్త కుటుంబానికి అమాత్యుడి అండ
- 20 ఏండ్ల తర్వాత.. ఒక వేదికపై..
- సబ్బండవర్గాలకు సమన్యాయం