సోమవారం 18 జనవరి 2021
Nirmal - Jul 20, 2020 , 00:27:14

సాగు జోరు.. ఆయకట్టుకు నీరు..

సాగు జోరు.. ఆయకట్టుకు నీరు..

ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు ఎగువ, పరీవాహక ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతున్నది.. వానకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో.. ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పంటల సాగుకు ఇక ఢోకా లేకుండా పోనున్నది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల కింద రైతులు వరితో పాటు వివిధ రకాల పంటలు వేశారు. ఈ క్రమంలో స్వర్ణ ప్రాజెక్టు నీటిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 22న సదర్మాట్‌, 24న ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కాలువ కింద ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. కడెం ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్‌ఫ్లో ఉండగా.. పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు..!     - నిర్మల్‌, నమస్తే తెలంగాణ

 నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాలో ఎస్సారెస్పీ (సరస్వతీ కా లువ), కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సదర్మాట్‌ ఆనికట్‌ (ఆనకట్ట) ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. వానకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో రైతులు ప్రాజెక్టుల కింద ఇప్పటికే నార్లు పోయ గా.. బోర్లు, బావుల కింద నాట్లు కూడా వేస్తున్నారు. బోరు, బావుల తో నీరు పూర్తిగా సరిపోని పరిస్థితి ఉండగా.. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల్లో కొన్నింటికి ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలో గతంలోనే 30 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉండగా.. తాజాగా మహారాష్ట్రతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కు రుస్త్తున్న వర్షాలతో ఇన్‌ఫ్లో వస్తున్నది. మిగతా ప్రాజెక్టుల్లోనూ ఉన్న నీటి నిల్వలను నార్లు పోసేందుకు, నాట్లు వేసేందుకు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. సారంగాపూర్‌ మండలం స్వర్ణ ప్రాజె క్టు నీటిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విడుదల చేశారు. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 1183 అడుగులు (1.4847 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1172 అడుగుల (0.593 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. స్వర్ణ ఆయకట్టు 12 వేల ఎకరాలు ఉండగా.. వానకాలంలో సాగునీరు అందించనున్నారు.

సదర్మాట్‌, కడెం కింద 17 వేల ఎకరాల ఆయకట్టు..

మరోవైపు సదర్మాట్‌ ఆనికట్‌ కింద ఖానాపూర్‌, కడెం మండలాల్లో 17 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సదర్మాట్‌ పూర్తిస్థాయి మట్టం 7.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 7.2 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు ఈ నెల 22 నుంచి సాగునీరు విడుదల చేయనున్నారు. మరో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న కడెం నారాయణరెడ్డి ప్రా జెక్టు కింద 68 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ద్వారా కడెం, దస్తురాబాద్‌, జన్నారం, దండేపల్లి మండలాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 700 అడుగులు (7.603 టీ ఎంసీలు) కాగా.. ప్రస్తుతం 687.775 అడుగుల (4. 820 టీఎంసీలు) మేర నీరుంది. ఎగువ ప్రాంతం నుంచి కేవలం 445 క్యూసెక్కుల వరద మాత్రమే ఇన్‌ఫ్లోగా వస్తున్నది. ప్రాజెక్టులోకి ఆశించిన మేర ఇన్‌ఫ్లో లేకపోవడంతో.. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద, వర్షపునీరు, ప్రాజెక్టులో నీటి మట్టం ఆధారంగా.. ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. భైంసా పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ప్రాజెక్టు కింద వరినాట్లు లేవు. ముందస్తుగా యాసంగి పంటలకు, చెరువులు నింపేందుకు నీరు విడుదల చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 1176.5 అడుగులు (1.852టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1170.96 అడుగుల (1.084 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. 

24న సరస్వతీ కాలువకు నీటి విడుదల..

ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ఆశించిన మేర నీటి నిల్వలు ఉండడం.. తాజాగా వరద కాలువను కాళేశ్వరం జలాలతో నింపడంతో జిల్లాలో సరస్వతీ కాలువ ఆయకట్టుకు ఇక ఢోకా లేకుండా పోయింది. నిర్మల్‌ జిల్లాలో సరస్వతీ కాలువ ద్వారా 38,800 ఎకరాల ఆయకట్టుకు.. సోన్‌, నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌ మండలాలకు సాగునీరు అందుతున్నది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి మట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1073.3 అడుగులు (35.890 టీఎంసీలు) మేర నీటి నిల్వలున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి జూన్‌ 1 నుంచి 7.92 టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రస్తుతం 4069 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తున్నది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1048.30 అడుగుల (5.306టీఎంసీలు) నీటి మట్టంతో డెడ్‌ స్టోరేజీలో ఉన్నది. మరోవైపు వరద కాలువను కాళేశ్వరం జలాలతో నింపడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు ఆయకట్టుకు సరిపోనుంది. దీంతో సోమవారం నుంచి కాకతీయ, లక్ష్మీ కాలువలకు నీరు విడుదల చేస్తుండగా.. ఈ నెల 24న సరస్వతీ కాలువకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. వారబందీ పద్ధతిలో నీరివ్వాలని నిర్ణయించగా.. ముందుగా 300 క్యూసెక్కులను వదిలి.. రైతుల అవసరాన్ని బట్టి 800 క్యూసెక్కుల వరకు పెంచనున్నారు. బోర్ల కింద నాట్లు వేస్తుండగా.. ఈ నీటితో పూర్తిస్థాయిలో సాగు కానుంది. ఈ కాలువ కింద 33 చెరువులు ఉండగా.. వీటిని యాసంగిలో నింపారు. ప్రస్తుతం వీటిలో సగానికిపైగా నీటి నిల్వలుండగా.. ఆయకట్టులో సాగుకు వినియోగించుకునే అవకాశముంది.