గురువారం 21 జనవరి 2021
Nirmal - Jul 17, 2020 , 00:24:23

నెరవేరనున్న కల

నెరవేరనున్న కల

  • కార్పొరేట్‌ హంగులతో 30 పడకల దవాఖాన 
  • నార్నూర్‌, గాదిగూడ మండలాలవాసులకు మెరుగైన వైద్యం
  • రూ.3.80 కోట్లతో నిర్మాణం.. త్వరలో ప్రారంభానికి సిద్ధం..

నార్నూర్‌ : ఏజెన్సీలోని గ్రామీణులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి రానున్నది. ప్రైవేట్‌కు దీటుగా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నార్నూర్‌ మండల కేంద్రంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించింది. ఈ నెల15న ప్రారంభోత్సవాన్ని నిర్వహించాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే ప్రారంభం కానున్నది. మండల కేంద్రంలో రూ.3.80 కోట్లతో నూతన భవన నిర్మాణానికి ఏప్రిల్‌ 18, 2016లో శంకుస్థాపన చేశారు. నూతన హంగులతో సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆకర్షనీణీయంగా తీర్చిదిద్దారు. ఏండ్ల కల నెరవేరనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దవాఖాన ప్రారంభంతో మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో పాటు ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌కు వెళ్లే దూరభారం తీరనుండడంతో మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణ కష్టాలు తీరుతాయి..

మాది గాదిగూడ మారుమూల మండలం. మండలవాసులు అనారోగ్యం బారిన పడితే పీహెచ్‌సీల్లో సరైన సౌకర్యాలు లేక అత్యవసర పరిస్థితుల్లో ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌ దవాఖానలకు తరలిస్తారు. దాదాపు 80 కిలో మీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. నార్నూర్‌లో దవాఖాన త్వరలో ప్రారంభిస్తే ప్రయాణ కష్టాలు తీరుతాయి. దవాఖానను నిర్మించిన సర్కారుకు రుణపడి ఉంటాం.

- ఆత్రం ఇంద్రభాన్‌, గాదిగూడ మండలం

సంతోషంగా ఉంది..

మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన నూతన భవనం నిర్మించడం సంతోషంగా ఉంది. రెండు మండలాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.80 కోట్లతో భనవం నిర్మించింది. ఈ నెల 15న ప్రారంభించాలని సిద్ధమయ్యాం. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

- బానోత్‌ గజానంద్‌ నాయక్‌, సర్పంచ్‌ (నార్నూర్‌)logo