గురువారం 28 జనవరి 2021
Nirmal - Jul 16, 2020 , 02:39:25

‘ముసురు’కుంది..

‘ముసురు’కుంది..

  •  ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగావర్షం  
  •  సగటు 33.1 మిల్లీ మీటర్లు 
  •  చెరువుల్లోకి చేరుతున్న నీరు
  •  పరవళ్లు తొక్కుతున్న కనకాయ జలపాతం

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ  : వానకాలం  ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో క్రమంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం 33.1 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలోనే రైతులు పత్తి, కంది, సోయాబీన్‌ పంటలు వేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరుగుతున్నాయి. జిల్లాలో వానకాలం సగటు వర్షపాతం 1100 మిల్లీమీటర్లు పడాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టులో భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటి వరకు 345 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 342.1 మిల్లీ మీటర్లు నమోదైంది. బోథ్‌, బజార్‌హత్నూర్‌ మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా, జైనథ్‌, బేల, నార్నూర్‌, ఇంద్రవెల్లి,ఆదిలాబాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, మావల, తలమడుగు, బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లో సాధారణ వర్షపాతం,  భీంపూర్‌, గుడిహత్నూర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు పడుతుండగా ఈ వర్షం పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఉండటంతో భూమిలో తేమశాతం పెరుగుతుందని పంటల ఎదుగుదల బాగుంటుందని రైతులు తెలిపారు.   తాంసిలో 80 మిల్లీమీటర్లు  

జిల్లాలో బుధవారం 33.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాంసి మండలంలో అత్యధికంగా 80 మిల్లీ మీటర్లు కురిసింది. ఇంద్రవెల్లిలో 71 మిల్లీ మీటర్లు, జైనథ్‌లో 67.3 మి.మీ, బజార్‌హత్నూర్‌లో 51.2 మి.మీ, బోథ్‌లో 48.4 మి.మీ, నేరడిగొండలో 43.3 మి.మీ, మావలలో 34.8 మి.మీ, ఇచ్చోడలో 32. 7 మి.మీ, ఆదిలాబాద్‌ లో 32.6 మి.మీ, సిరికొండలో 281 మి.మీ, భీంపూర్‌లో 24.5 మిల్లీమీటర్లు నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నేరడిగొండ మండలం కుంటాల, బోథ్‌ మండ లం పొచ్చెర, బజార్‌హత్నూర్‌ మండలం కనకాయ జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలోని సాగునీటి వనరుల్లోకి నీరు చేరుతున్నది. పలు ప్రాంతాల్లో  వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో క్రమంగా కురుస్తున్న వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

తాంసిలో భారీ వర్షం..

తాంసి : మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో వర్షపు నీరు నిలిచింది. గ్రామ సమీపంలోని అలుగు పొంగిపొర్లడంతో పంటపొలాల్లోకి వరద చేరింది. సమీప పొలాలను తహసీల్దార్‌ సంధ్యారాణి, సర్పంచ్‌ కృష్ణ పరిశీలించారు. 

నార్నూర్‌ : నార్నూర్‌,గాదిగూడ మండలాల్లో బుధవారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు వర్షం కురిసింది. కల్వర్టులపై వరద ప్రవాహాన్ని జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ పరిశీలించారు. 

భైంసా : పట్టణంలో బుధవారం మధ్యాహ్నం గంటపాటు భారీ వర్షం కురిసింది. కిసాన్‌గల్లీ, పురాణాబజార్‌, మార్కెట్‌ ఏరియా, బస్టాండ్‌ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ఈ సీజన్‌లో ఇదే పెద్ద వర్షమని , పంటలకు ఊతమిచ్చినట్లయిందని రైతులు  చెబుతున్నారు. రోడ్లపై వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఎడతెరిపి లేకుండా ..

భీంపూర్‌:  భీంపూర్‌ మండలంలో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆదిలాబా ద్‌- కరంజి(టి) రూట్‌లో సెంటర్‌ సాంగ్వి, ధనో రా వాగులు ఉప్పొంగడంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర సరిహద్దు గ్రామాలు గుబ్‌డి, అంతర్గాం, వడూర్‌, గొల్లఘడ్‌, తాంసి(కే) రేవుల వద్ద పెన్‌గంగ ప్రవాహం కనువిందు చేస్తున్నది. 

జలాశయాల్లోకి వరద..

జైనథ్‌ : మండలంలోని సాత్నాల ప్రాజెక్టుతో పాటు లక్ష్మీపూర్‌ రిజర్వాయర్లకు వరద చేరుతోంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద చేరుతున్నది. దీంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది.  

రాబోయే ఐదు రోజులు మోస్తరు వర్షం

ఏఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీధర్‌ చౌహాన్‌

తాంసి :మూడు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురుస్తున్నాయని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీధర్‌ చౌహాన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 21-23 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం తేమ 83-89 శాతం, మధ్యాహ్నం తేమ 57-73 శాతం వరకు ఉండనుందని పేర్కొన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 12-20 కిలో మీటర్ల వేగంతో వీయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. 


logo