బుధవారం 05 ఆగస్టు 2020
Nirmal - Jul 13, 2020 , 00:59:51

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు

నిర్మల్‌ అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ‘మిషన్‌ భగీరథ’ చేపట్టి, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని సిద్ధాపూర్‌లో నిర్మించిన పంప్‌హౌస్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, ఫిల్టర్‌ బెడ్‌ల పని తీరును ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ‘మిషన్‌ భగీరథ’తో దేశానికి సరికొత్త దిశను నిర్దేశించిందన్నారు. అదే స్ఫూర్తితో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ‘జల్‌ స్వప్న’ పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. సిద్ధాపూర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా నిర్మల్‌ పట్టణ ప్రజలకు రక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం ‘హరితహారం’లో భాగంగా ఫిల్టర్‌ బెడ్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, డీఈ సంతోష్‌, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాజీద్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు బిట్లింగ్‌ నవీన్‌, ఎడిపెల్లి నరేందర్‌, నేరెళ్ల వేణు, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.  

పది గంటలకు పది నిమిషాలు..

మంత్రి అల్లోల, తన ఇంటి ఆవరణలో ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. గార్డెన్‌లో మొక్కల మధ్య కలుపు తీసి, గుంతలు తవ్వారు. మొక్కలకు నీరు పట్టారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర జీవితం గడుపాలని సూచించారు. ఇక్కడ రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లా వెంకట్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు ఉన్నారు.

రోడ్డు విస్తరణ పనుల పరిశీలన..

పట్టణంలోని చైన్‌గేట్‌ నుంచి బంగల్‌పేట్‌ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి నాయిడివాడ వరకు కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. రోడ్డు విస్తరణ పనులతో ఏళ్లనాటి సమస్య పరిష్కారమవుతున్నదన్నారు. దీంతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌, ఫౌంటేన్లు, ఆర్చ్‌ల నిర్మాణంతో పట్టణం కొత్త శోభ సంతరించుకుంటున్నదని పేర్కొన్నారు. పనులకు పూర్తి సహకారం అందిస్తున్న పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ధర్మసాగర్‌ వద్ద 140 ఫీట్ల ఎత్తుగల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మంచిర్యాల చౌరస్తా నుంచి బస్టాండ్‌ వరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి, ఫుట్‌పాత్‌లను నిర్మిస్తామని తెలిపారు. పట్టణ ప్రజల కోసం ధర్మసాగర్‌ మినీ ట్యాంక్‌ బండ్‌, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, చెరువు సుందరీకరణ, పార్కు పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే దివ్యానగర్‌ కాలనీలో పార్కులను పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్‌, కౌన్సిలర్లు రామకృష్ణ, మేడారం ప్రదీప్‌, మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు..

నిర్మల్‌ టౌన్‌ : నిర్మల్‌ పట్టణంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లను అందిస్తామని మంత్రి అల్లోల హామీ ఇచ్చారు. పట్టణంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మీ ఆలయ సమీపంలోని నాగనాయిపేట శివారులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కలలుగన్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ఇవ్వాలన్న ఉద్దేశంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎల్లపెల్లి శివారులో నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. నాగనాయిపేట్‌లో కూడా రెండు నెలల్లో వెయ్యి ఇండ్లను పూర్తిచేసి, అర్హులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించి, అధికారులను పూర్తివివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా లోపం లేకుండా చూడాలని, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు సోమేశ్వర్‌, పప్పి, తదితరులు పాల్గొన్నారు. logo