సోమవారం 03 ఆగస్టు 2020
Nirmal - Jul 13, 2020 , 00:47:11

కరోనా నుంచి కోలుకుని ఇంటికి క్షేమంగా వెళ్తున్న బాధితులు

కరోనా నుంచి కోలుకుని ఇంటికి క్షేమంగా వెళ్తున్న బాధితులు

గొంతు గరగర అంటుందా? ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా? ఓళ్లు వేడిగా ఉందా? కరోనా సోకిందని భయపడుతున్నారా? పరేషాన్‌ కాకండి.. ప్రైవేటు దవాఖానకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకండి.. సర్కారు దవాఖానల్లో ప్రైవేట్‌కు దీటుగా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చాలా మంది కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారు. 

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విశ్వమారి కరోనా వైరస్‌పై బాధితులు విజయం సాధిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఇంటిబాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 331 మందికి కరోనా సోకగా.. 229 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పిస్తూ చికిత్స అందిస్తున్నారు. 24 గంటలపాటు ప్రత్యేక వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న బెడ్లు, ప్రత్యేక వార్డులు, ఐసీయూ వంటి సదుపాయాలు కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనోధైర్యాన్ని నింపుతూ.. బలవర్ధకమైన పోషకాహారం అందిస్తున్నారు. చాలా మంది కోలుకుని ఇంటికి క్షేమంగా వెళ్తుండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 229 మంది సర్కారు దవాఖానల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 102 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. మర్కజ్‌తోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వారికి మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సుమారు 50 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరికి గాంధీ దవాఖానలో చికిత్స అందించగా.. కోలుకుని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వారితో ప్రైమరీ కాంటాక్టు అయిన వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌తోపాటు ముంబై, భీవండి, నాగ్‌పూర్‌, పుణె తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వారిని కలిసిన సుమారు 67 మందికి కరోనా సోకింది. ఈ కేసులు మే నెలలో ఎక్కువగా నమోదయ్యాయి. వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. తర్వాత కూడా హైదరాబాద్‌, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జూన్‌ నెల నుంచి రిమ్స్‌తోపాటు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.

మెరుగైన వసతులు.. పౌష్టికాహారం.. 

ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని రిమ్స్‌తోపాటు ప్రతి జిల్లా కేంద్రంలోని దవాఖానల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి ఏరియా దవాఖానలతోపాటు భైంసాలోనూ ప్రత్యేక వార్డులు, ఐసీయూ బెడ్లను అందుబాటులో ఉంచారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఇక్కడ ఐసోలేషన్‌ చేసి.. తర్వాత గాంధీ ఆస్పత్రికి పంపేవారు. తెలంగాణ సర్కారు స్థానిక దవాఖానల్లో సౌకర్యాలు కల్పించి చికిత్స అందిస్తున్నది. నాలుగు జిల్లాల్లో సర్కారు దవాఖానలు కేటాయించింది. ఇందులో చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించింది. బెడ్లు, ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు, వెంటిలేటర్ల సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఇక్కడే వైద్యం అందిస్తున్నారు. అత్యవసరమైతే గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా బాధితులు నాలుగు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు గాంధీ ఆస్పత్రిలో మైరుగైన వైద్యం, పౌష్టికాహారం, వసతులు కల్పించారని.. చికిత్స పొంది కోలుకున్న వారు పేర్కొంటున్నారు. ఎలాంటి భయం, ఆందోళన కలుగకుండా వైద్యులు ఎంతో మనోధైర్యం నింపారని.. ఎంతో బాగా చూసుకున్నారని చెబుతున్నారు.

దవాఖాన్ల ఏర్పాట్లు మంచిగ చేసిన్రు

జైనూర్‌ : ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లి మార్చి 19న మా ఊరికి వచ్చిన. 31న ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌కు తీసుకపోయిన్రు. అక్కడ 23 రోజులు ఉన్న. పరీక్షలు చేసిన్రు. ఏప్రిల్‌ 23న కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తోలుకపోయిన్రు. గాంధీ దవాఖానలో 19 రోజులు ఉన్న. డాక్టర్లు మంచిగ చికిత్స చేసిన్రు. మందులు కూడా ఇచ్చిన్రు. టైమ్‌కి టిఫిన్లు, భోజనం పెట్టిన్రు. ఉన్నన్ని రోజులు మంచిగ చూసుకున్నరు. మళ్లా టెస్టులు చేస్తే నెగెటివ్‌ వచ్చింది. మే 13న డిశ్చార్జి చేసిన్రు. ఇంటికి వచ్చిన. 14 రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్లలే. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న. కరోనాపై కొందరు పుకార్లు పుట్టిస్తన్రు. గవర్నమెంట్‌ దవాఖాన్లళ్ల మంచిగ ఏర్పాట్లు చేసింది. ఏం భయం లేదు.
-షేక్‌ ఖాజా, పోచ్చంలొద్ది

జైనూర్‌ : ప్రార్థనల కోసమని ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు పోయిన. మార్చి 19 తారీఖు జైనూర్‌కు వచ్చిన. మార్చి 31న ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకపోయిన్రు. అక్కడ 12 రోజులు ఉన్న. రోజూ పరీక్షలు చేసిన్రు. ఏప్రిల్‌ 12 తారీఖు నాడు కరోనా వచ్చిందని చెప్పిన్రు. గాంధీ దవాఖానకు పోయిన. డాక్టర్లు ప్రతి రోజు పరీక్షించి మందులిచ్చిన్రు. టైమ్‌కి భోజనం పెట్టిన్రు. పొద్దుగాల 8 గంటలకు టిఫిన్‌ ఇచ్చేటోళ్లు. ఓ రోజు ఇడ్లి, ఇంకో రోజు ఉప్మా, బోండా ఇట్లా రోజుకో టిఫిన్‌ వచ్చేది. 10 గంటలకు పాలు, బిస్కెట్లు, మధ్యాహ్నం భోజనం పెట్టేది. అన్నంతో పాటు పప్పు,  పెరుగు పెట్టిన్రు. తిన్నంక రెండు అరటి పండ్లు కూడా ఇచ్చేటోళ్లు. నాలుగింటికి పాలు ఇచ్చేటోళ్లు. బాదం, కిస్మిస్‌, అంజీ ర, ఖర్జూర, మోసంబి పండ్లు ఇచ్చిన్రు. మళ్ల రాత్రి కూడా అన్నం పెట్టేటోళ్లు. అక్కడ ఉన్నన్ని రోజులు ఎలాంటి బాధ లేకుండా మంచిగ చూసుకున్నరు. మే 11 తారీఖు రిపోర్టుల్లో నెగెటివ్‌ వచ్చిందని డిశ్చార్జి చేసిన్రు. సర్కారోళ్లు పట్టించుకుంట లేరు అని బయట వట్టిగనే చెబుతున్రు. అదంతా వట్టిదే. సౌకర్యాలు మంచిగున్నయ్‌. సర్కారుకు సలాం..      - సయ్యద్‌ అలీ, జైనూర్‌logo