సోమవారం 03 ఆగస్టు 2020
Nirmal - Jul 13, 2020 , 00:43:23

పచ్చిరొట్ట సాగుతో ప్రయోజనాలు అనేకం

పచ్చిరొట్ట సాగుతో ప్రయోజనాలు అనేకం

దస్తురాబాద్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది రైతులు పంటలకు రసాయనిక ఎరువులను విరివిగా వాడుతున్నారు. దీంతో ఖర్చులు పెరగడమే కాకుండా భూసారం దెబ్బతింటున్నది.భూ సార పరిరక్షణకు పచ్చిరొట్ట పైర్లు దోహదం చేస్తాయి. భూమి సారవంతంగా మారుతుంది. వరి పంట వేసే ముందు రైతులు అధిక దిగుబడి వచ్చేందుకు జీలుగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వరితో పాటు ఇతర పంటల సాగుకుముందు జీలుగ వేయడం వల్ల దిగుబడి రావడానికి దోహదపడుతుంది.రసాయనిక ఎరువుల వాడకంతో దిగుబడి తగ్గుతుంది. దీంతో సేంద్రియ పద్ధతుల్లో భూసారం పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, పెసర, జనుము విత్తనాలను ఎక్కువగా వాడాలి. పచ్చిరొట్ట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం సబ్సిడీపై విత్తనాలను రైతులకు ఇప్పటికే అందజేసింది.

జీలుగతో ఉపయోగాలెన్నో..

పంట సాగుకు ముందు భూమిలో పచ్చిరొట్ట వేసుకోవాలి. మొక్కలు పెరిగిన తర్వాత కలియ దున్నితే భూమి సారవంతం అవుతుంది. పంటకు కావాల్సిన పోషక పదార్థాలు నిల్వ ఉంచుకొనే శక్తి పెరుగుతుంది. దీంతో మొక్కల్లోని వేర్లకు గాలి, నీరు, పోషకాలు బాగా అందుతాయి. పంట నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. మొక్కలకు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా దోహదపడుతాయి . ఆమ్ల, క్షార గుణాలు ఉండడంతో పంట దిగుబడి వస్తుంది. సూక్ష్మ పోషకాలైన జింక్‌, ఇనుము, కాల్షియం వంటివి సమృద్ధిగా అందుతాయి. జీలుగ పంట వేసిన రైతులు దాదాపు రసాయనిక ఎరువులు తగ్గించవచ్చు. పచ్చిరొట్ట పైర్లు అయిన జీలుగ, జనుము, పెసర, అపరాల జాతికి చెందిన పంటలను సాగు చేస్తే సహజ సిద్ధమైన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం పంటలకు అందేలా చేయడంతో భూసారం పెరుగుతుంది. 

అధికంగా పోషకాలు అందుతాయి..

పచ్చిరొట్ట సాగు చేయడంతో భూసారం పెరిగి పంటకు మంచి పోషకాలు లభిస్తాయి. జీలుగ సాగు చేసిన వారు యూరియాను తగ్గించి, పొటాష్‌ను ఎక్కువగా వాడాలి. పచ్చిరొట్ట పైర్లను కలియదున్నడంతో నేలకు కావాల్సిన సేంద్రియ పదార్థం లభిస్తుంది. నేల భౌతిక, రసాయనిక లవణాలు మెరుగవుతాయి. ఎరువులను కలియదున్నిన వెంటనే నాట్లు వేయకూడదు. పూర్తిగా మురిగిన తర్వాత లేదా వారం రోజులకు వేస్తే బాగుంటుంది.  - వినోద్‌, ఇన్‌చార్జి ఏవో, దస్తురాబాద్‌ 


logo