బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

- ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
- రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- ఆలయ ఆవరణ, ట్రిపుల్‌ఐటీలో మొక్కలు నాటిన అమాత్యుడు, ఎమ్మెల్యే, కలెక్టర్
- రెవెన్యూ గెస్ట్‌హౌస్ ప్రారంభం
- ముథోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘హరితహారం’
బాసర : బాసర సరస్వతీ క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బాసరలో సోమవారం మంత్రి పర్యటించారు. ముందుగా ట్రిపుల్ఐటీ కళాశాల ఆవరణలో ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నా టారు. అనంతరం కళాశాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నాటిన మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ సమతౌల్యత కోసం ప్రభుత్వం ‘హరితహారం’ చేపట్టిందని, రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతం పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో 180 కోట్లకు పైగా మొక్కలు నాటామని, ఆరో విడుతలో 30కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉందని వివరించారు. బాసర ట్రిపుల్‌ఐటీలో మొత్తం 50వేల మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటి వరకు 30 వేలు నాటామని అధికారులు మంత్రికి చెప్పగా, మిగతా మొక్కలు నాటి లక్ష్యం పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా నుంచి విద్యార్థులకు కళాశాలలో 10 లోపు సీట్లు మాత్రమే వస్తున్నాయని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి స్థానిక కోటా కింద వంద సీట్లు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఏవో రాజేశ్వర్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అమ్మవారి సన్నిధిలో..
అనంతరం ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, శాలువాతో సన్మానించి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. బాసర ఆలయం.. ఆదాయం(ఏడాదికి రూ.18 కోట్లతో)లో రాష్ట్రంలోనే మూడోస్థానంలో ఉందని పేర్కొన్నారు. బాసర క్షేత్ర అభివృద్ధికి ఇప్పటికే రూ.50కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ పూర్తయ్యాక పనులు ప్రారంభించి, మరో రూ.50కోట్లు కూడా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం రూ. 5 కోట్లతో ఆలయ పరిసరాల్లో ఉన్న ఐదు అతిథి గృహాలపై మరో అంతస్తు, షెడ్లు, వ్యాస గుహకు వెళ్లే దారిలో షెడ్డు, ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి టెండర్లు ముగిశాయని తెలిపారు. వచ్చే శ్రావణ మాసంలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే గర్భగుడిని వెడల్పు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సరస్వతీ మాత మాత్రమే భక్తులకు కనిపిస్తున్నారని, లక్ష్మి అమ్మవారిని భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతున్నారన్నారు. యాదగిరి గుట్ట తరహాలో రూ.2.50 కోట్లతో కృష్ణ శిలలతో నిర్మిస్తామని, ఇందుకు శృంగేరి పీఠాధిపతులు కూడా అనుమతి ఇచ్చారని వెల్లడించారు. అనంతరం పీవీ నరసింహారావు.. ఇక్కడికి వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో వచ్చారని పేర్కొన్నారు. మహానుభావుడు పీవీ ఇక్కడే అక్షరాభ్యాసం చేసుకున్నారని, 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతారని ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
రెవెన్యూ గెస్ట్ హౌస్ ప్రారంభం..
అనంతరం ఆలయం వద్ద నూతన రెవెన్యూ గెస్ట్‌హౌస్‌ను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ప్రారంభించారు. అనంతరం అతిథి గృహంలో మొక్కలు నాటారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటున్నదని, అందుకే గెస్ట్‌హౌస్ నిర్మించినట్లు చెప్పారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీవో రాజు, నాయకులు రాంకిషన్‌రెడ్డి, బా శెట్టి రాజన్న, సర్పంచ్ లక్ష్మణ్‌రావు, రమేశ్, సుధాకర్‌రెడ్డి, జిడ్డు మల్లయ్య, బల్గం దేవేందర్, మల్కన్న యాదవ్, తహసీల్దార్ శివప్రసాద్, అధికారులు, సిబ్బంది, నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘హరితహారం’..
ముథోల్ : ‘హరితహారం’లో భాగంగా ముథోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకు పచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, తహసీల్దార్ లోకేశ్వర్ రావు, ఏఎస్పీ శ్రీనివాస్‌రావు, ముథోల్ ఎంపీపీ ఆయేషా, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌గౌడ్, ముథోల్ సర్పంచ్ రాజేందర్, ఎంపీడీవో సురేశ్ బాబు, నాయకులు సురేందర్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, సమీఉల్లాఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్‌తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత