సోమవారం 18 జనవరి 2021
Nirmal - Jun 16, 2020 , 01:29:26

రియల్‌ ఎస్టేట్‌ టు వ్యవసాయం

రియల్‌ ఎస్టేట్‌ టు వ్యవసాయం

 వినూత్న సాగుకు శ్రీకారం చుట్టిన రైతు అంజయ్య

n ఎకరంలో 2 వేల డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల పెంపకం

n ఒక్కో పోల్‌కు నాలుగు చొప్పున..n రెండు, మూడు నెలల్లో చేతికి పంట

n 25 యేండ్ల వరకు దిగుబడిn మార్కెట్‌లో మంచి డిమాండ్‌

n సీజన్‌ను బట్టి కిలోకు రూ.150-రూ.500 వరకు ధర

n ఐదో యేట నుంచి ఏడాదికి మూడుసార్లు దిగుబడి

n ఏడాదికి రూ.15 లక్షల ఆదాయం

మంచిర్యాల జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన దెబ్బటి అంజయ్య, తన తండ్రి నాగయ్య బాటలో వ్యవసాయం చేయాలని నిర్ణయించు కున్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వదిలి కోటపల్లి మండలం లింగన్నపేటలో ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వినూత్నంగా పంటలు సాగు చేయాలనుకొని యూ-ట్యూబ్‌ ద్వారా డ్రాగన్‌ ప్రూట్‌ గురించి తెలుసుకు న్నాడు. ఆంధ్రా, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు వెళ్లి సాగు చేస్తున్న విధానం, వస్తున్న లాభాలు గురించి రైతులను అడిగి తెలుసుకున్నాడు. అంజయ్యకు ఆరు ఎకరాల భూమి ఉండగా మొదట ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును మొదలు పెట్టాడు.  - కోటపల్లి 

సాగు ఇలా..

గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరు జిల్లా గురిజాల మండలం పులిపాడు నుంచి 2000 డ్రాగన్‌ ఫ్రూట్‌ (అమెరికన్‌ బ్యూటీ, సీ అండ్‌ రెడ్‌) మొక్కలు తీసుకొచ్చి నాటాడు. వాటికి సహాయంగా కాంక్రీట్‌ పోల్స్‌ ఏర్పాటు చేశాడు. ఒక్కో పోల్‌కు నాలుగు మొక్కల చొప్పున నాటాడు. పోల్స్‌కు పైన వృత్తాకారంలో ఉన్న టైర్లను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టాడు. ఎకరానికి 500 పోల్స్‌ను ఏర్పాటు చేశాడు. 8 నుంచి 10 అడుగుల దూరం వ్యత్యాసం ఉంచాడు. ఒక్కో పోల్‌కు రూ.300 చొప్పున 500 పోల్స్‌కి రూ. లక్షా 50 వేలు, ఒక్కో మొక్కకు రూ. 70 చొప్పున రూ.లక్షా 40 వేలు ఖర్చు చేశాడు. ఒక్కో పోల్‌పై ఏర్పాటు చేసిన టైర్‌, రాడ్‌కు కలిపి రూ.100 చొప్పున.. రూ.50 వేలు వెచ్చించాడు. వేసవిలో ఎండ నుంచి మొక్కలను రక్షించుకునేందుకు షెడ్‌ నెట్‌ అవసరం ఉండగా, నెట్‌ కోసం రూ.లక్షా 50 వేలు, పోల్స్‌ కోసం రూ.లక్ష, రాడ్‌, బైండింగ్‌ వైర్‌కు రూ.లక్ష వరకు ఖర్చు వచ్చింది. నీరు పెట్టడం, సేంద్రియ ఎరువులు ఇతర పనుల కోసం రూ. మరో లక్ష ఖర్చు అవుతాయి. మొదటి సంవత్సరంలో ఎకరానికి రూ. 6 నుంచి రూ.7 లక్షల వరకు పెట్టుబడి కానున్నది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో డ్రాగన్‌ ఫ్రూట్‌ను నాటగా, ఇంకో రెండు నెలల్లో పంట చేతికి రానున్నది.

మార్కెట్‌లో మంచి డిమాండ్‌..

మొదటి ఏడాది పంట దిగుబడి టన్ను వరకు రానున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో డ్రాగన్‌ ఫ్రూట్‌ ధర రూ. 150 వరకు పలుకుతున్నది. ఈ లెక్కన రూ.1.5 లక్షల ఆదాయం సమకూరనున్నది. ఇక రెండో పంట వచ్చే మే, జూన్‌ మధ్యలో వస్తుందని రైతు చెబుతున్నాడు. రెండో యేట 2 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముండగా, రూ.2 లక్షల 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం రానున్నది. 

25 యేండ్ల వరకు దిగుబడి..

మొక్క నాలుగు సంవత్సరాల వరకు పెరుగుతుంది. ఐదో యేట నుంచి 25 యేండ్ల వరకు.. యేటా మూడు విడుతలు పంట చేతికి రానున్నది. యేటా ఎకరానికి 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు. టన్నుకు తక్కువలో తక్కువ రూ.లక్ష వరకు ధర పలికినా.. యేడాదికి ఎకరం పంట ద్వారా రూ.15 లక్షల వరకు ఆదాయాన్ని సులభంగా పొందవచ్చు. పంటను నాటిన నాలుగేళ్లలోపే రైతు పెట్టిన పెట్టుబడి చేతికి రానుండగా, మిగతా 20 యేండ్ల పాటు ఎలాంటి ఖర్చు లేకుండా ఏడాదికి ఎకరానికి రూ.15 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

పండ్లు, మలబార్‌ వేప పెంపకం

ఎకరంలో డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు మిగతా ఐదెకరాల్లో మలబార్‌ వేపతో పాటు పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. తైవాన్‌ జామ, సీతాఫలం మొక్కలతో పాటు కలప అవసరాల కోసం ఉపయోగించే మలబార్‌ వేపను సాగు చేస్తున్నాడు. మలబార్‌ వేపకు ఎలాంటి చీడ పీడలు ఆశించే అవకాశం లేకపోవడం, ఒకసారి నాటి వదిలేస్తే ఐదు నుంచి పదేళ్ల తర్వాత ఆదాయం పొందే అవకాశముంది. మలబార్‌ వేపను ఫ్లైవుడ్‌ తయారీ, బిల్డింగ్‌ మెటీరియల్‌, కర్రబొగ్గు, వంట చెరుకులతో పాటు ఇతర అవసరాలకు వాడుతారు. వీటిలో అంతర పంటగా 1000 మొక్కల వరకు తైవాన్‌ జామ, సీతాఫలం మొక్కలను నాటగా, ఏడాది కాకముందే కాయలు కాస్తున్నాయి. తైవన్‌ జామ ఏడాదికి రెండు సార్లు కాతకు రానుండగా, టన్నుకు రూ.40 వరకు పలకనున్నది. ఒక్కో జామ చెట్టు 10 నుంచి 15 కిలోల వరకు కాత కాయనుండగా, కిలోకి రూ.40 నుండి 70 చొప్పున విక్రయించుకోవచ్చు. సీతాఫలం రెండేండ్ల నుంచి కాత ప్రారంభం కానున్నది. ఈ పంట అన్‌ సీజన్‌ అయిన డిసెంబర్‌ తర్వాత కాత ప్రారంభం కానున్నది. అన్‌ సీజన్‌లో దొరికే సీతాఫలం కిలోకి రూ.50 నుంచి 80 వరకు విక్రయించుకోవచ్చు.

అనేక ప్రయోజనాలు..

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు రానున్నాయి. మొక్క ప్రారంభంలోనే కాస్త శ్రమ, శ్రద్ద, పెట్టుబడి పెడితే 25 యేండ్ల వరకు రైతులు సిరులు పండించుకునే అవకాశం ఉంది. ఈ పంటకు చీడ పీడల బాధ అంతగా ఉండదని, నీటి వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుందని రైతు అంజయ్య చెబుతున్నాడు. ఈ పండుకు బ్లడ్‌ షుగర్‌ను తగ్గించే లక్షణం ఉంది. ఇది తింటే మలబద్ధకం సమస్య ఉండదు. ఎముకలను గట్టి పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

మొత్తం డ్రాగన్‌ఫ్రూట్‌ వేస్తా..

రైతులు ఒకే రకమైన పంటలు పండించి నష్టపోయే కన్నా.. డిమాండ్‌ ఉన్న పంటలనే వేసుకుంటే బాగుంటుంది. మొదట మామిడి పంట వేద్దామనుకున్న. ఐదేళ్ల తర్వాత పంట చేతికొచ్చే అవకాశముండడంతో విరమించుకున్న. తక్కువ సమయంలో ఎక్కువ పంట, ఎక్కువ ఆదాయం వచ్చే పంట కోసం చూస్తే డ్రాగన్‌ ఫ్రూట్‌ మేలు అనిపిం చింది. లింగన్నపేట డ్రాగన్‌ ప్రూట్‌ సాగుకు అనుకూలంగా ఉండడంతో మొదలు పెట్టాను. మొదట ఎకరం భూమిలో ఈ పంట వేసిన. మిగతా భూమిలో మలబార్‌ వేప వేసిన. డ్రాగన్‌ ప్రూట్‌ మరో రెండు మూడు నెలల్లో కాతకు వస్తుంది. మలబార్‌ వేప పంట చేతికి రాగానే మొత్తం డ్రాగన్‌ ప్రూట్‌ వేయాలనుకుంటున్న. ఇప్పటి వరకు పెట్టుబడి రూ.7 లక్షల దాకా అయ్యింది. ఈ పంట వేసేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మొక్కలు ఇస్తా. - అంజయ్య, రైతు