గురువారం 21 జనవరి 2021
Nirmal - Jun 12, 2020 , 02:46:46

కొవిడ్‌-19కు ఎక్కడికక్కడే వైద్య సేవలు

కొవిడ్‌-19కు ఎక్కడికక్కడే వైద్య సేవలు

  • కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారికి స్థానికంగా ట్రీట్‌మెంట్‌
  • లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వస్తే  ఇంట్లోనే ఉంచి పర్యవేక్షణ
  • అత్యవసరం అయితేనే గాంధీ దవాఖానకు తరలింపు
  • నిర్మల్‌లో 40,  భైంసాలో 20 ఐసోలేషన్‌ బెడ్లు సిద్ధం
  • రెండుచోట్ల 17 ఐసీయూ బెడ్లు.. అత్యవసర ఏర్పాట్లు

విశ్వమారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)కు స్థానికంగానే చికిత్స అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఆయా జిల్లాల్లోనే స్థానిక ఏరియా దవాఖానల్లో చికిత్స అందిస్తారు. అత్యవసరమైతేనే హైదరాబాద్‌కు తరలిస్తారు. జిల్లాలో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదై ఎలాంటి లక్షణాలు లేని వారికి ఆయా ఏరియా దవాఖానల్ల్లో చికిత్స అందిస్తున్నారు. ఇకపై పూర్తిస్థాయిలో చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఇందుకోసం నిర్మల్‌లో 40, భైంసాలో 20 ఐసోలేషన్‌ బెడ్లు సిద్ధం చేశారు. 17 ఐసీయూ బెడ్లు కూడా ఏర్పాటు చేశారు.

 నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాలో ఇప్పటివరకు 36 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గతంలో 20 మందికి పాజిటివ్‌ రాగా.. తాజాగా ముంబయి, హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 16 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. గతంలో 20 మందికి గాంధీ దవాఖానలో చికిత్స చేయగా.. వారందరికీ తగ్గి ఇళ్లకు చేరుకున్నారు. దీంతో నిర్మల్‌  కరోనా రహిత జిల్లాగా మారింది. అనంతరం ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 10 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిన ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో నిర్మల్‌లోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం అనుమానం ఉన్న వారికి, కరోనా లక్షణాలు కన్పించిన వారికి స్థానికంగా వైద్యులు, దవాఖానకు వెళ్లిన వారిలో అనుమానం, లక్షణాలుంటే పరీక్షలు చేస్తున్నారు. రోజు రక్త నమూనాలు సేకరించి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు పంపుతున్నారు. ఏ రోజు శాంపిళ్లకు ఆ రోజు నివేదికలు వస్తున్నాయి. తాజాగా గురువారం రోజున తొమ్మిది మంది శాంపిళ్లను పరీక్షల కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు పంపించారు.

ఎక్కడికక్కడే ఏర్పాట్లు..జిల్లాలో ఇకపై స్థానికంగానే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్సలు అందిస్తారు. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాక లక్షణాలు లేకుంటే ఎవరి ఇండ్లలో వారినే 14 రోజులపాటు ఉంచి పర్యవేక్షిస్తారు. వీరు ప్రత్యేక గదిలో ఉండి మంచి పౌష్టికాహారంతోపాటు రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. 14 రోజులపాటు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండేలా చూస్తారు. రోజు వైద్య ఆరోగ్య సిబ్బంది సందర్శించి పరీక్షలు నిర్వహిస్తారు. పరిస్థితిని బట్టి పరీక్షలను బట్టి ఆసుపత్రికి పంపిస్తారు. లక్షణాలు లేకుండా పరిస్థితి అదుపులో ఉంటే ఇంట్లోనే ఉంచి 14 రోజుల పాటు పర్యవేక్షించాక మళ్లీ పరీక్షలు చేస్తారు.

నెగిటివ్‌ వచ్చే వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక కరోనా అనుమానిత లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం ఉంటే పరీక్షలు చేశాక పాజిటివ్‌ వచ్చిన వారికి ఆయా ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి నిర్మల్‌, భైంసాలోని ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తారు. ఇందుకోసం నిర్మల్‌ ఏరియా ఆసుపత్రిలో 40 ఐసోలేషన్‌ బెడ్లు, భైంసా ఏరియా ఆసుపత్రిలో 20 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యవసరమైన చికిత్స అందించాల్సి వస్తే ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు. నిర్మల్‌లో 12 ఐసీయూ బెడ్లు, భైంసాలో 5 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం నిర్మల్‌లో కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి చికిత్స అందిస్తుండగా.. అవసరం బట్టి నిర్మల్‌, భైంసా ఏరియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించనున్నారు. ఎవరికైనా తీవ్రత పెరిగి అత్యవసరం అనుకుంటే వెంటిలేటర్లపై చికిత్స అందించాల్సి వస్తే అలాంటి వారిని గాంధీ దవాకానకు రెఫర్‌ చేస్తారు.

స్థానికంగా చికిత్సకు అన్ని ఏర్పాట్లు..

జిల్లాలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి స్థానికంగానే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశాం. పాజిటివ్‌ నిర్ధారణ అయి లక్షణాలు లేకుంటే ఇంట్లోనే 14 రోజులు ప్రత్యేక గదిలో ఉంచి పర్యవేక్షిస్తాం. కరోనా నిర్ధారణతోపాటు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ఇకపై నిర్మల్‌, భైంసా ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తాం. పెషెంట్‌ పరిస్థితి విషమిస్తే అత్యవసరమైతే తీవ్రతను బట్టి గాంధీ దవాఖానకు పంపుతాం. జిల్లాలో ఐసోలేషన్‌ బెడ్లతోపాటు ప్రత్యేక చికిత్స కోసం ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌ అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆరు పాజిటివ్‌ కేసులు ఉండగా.. వారికి ఎలంటి లక్షణాలు లేవు. వారికి స్థానికంగానే నిర్మల్‌ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఆయా గ్రామాల్లో, మండలాల్లో పీహెచ్‌సీ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అనుమానం ఉన్నవారిని, లక్షణాలు ఉన్నవారిని పరీక్షల కోసం పంపుతున్నారు. వీరి రక్తనమూనాలు సేకరించి రిమ్స్‌ ఆసుపత్రికి పంపిస్తున్నాం. ఏరోజుకారోజు నిర్ధారణ నివేదికలు వస్తున్నాయి. వాటి ప్రకారం.. చికిత్స చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-దేవేందర్‌రెడ్డి, నిర్మల్‌ ఏరియా పర్యవేక్షకులు.

హోం ఐసోలేషన్‌లో పాటించాల్సినవి..

  1. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్యులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. 
  2. రోగికి కేటాయించిన గదిలోనే ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే మాస్క్‌ ధరించాలి. దగ్గినపుడు రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డు పెట్టుకోవాలి.
  3. రుమాలు తడిసినట్లయితే పాలిథీన్‌ కవర్‌లో వేసుకోవాలి. టిష్యూ పేపర్‌ మూతగల చెత్తబుట్టలో వేయాలి. గోరువెచ్చని నీరు రోజుకు కనీసం రెండు లీటర్లు తాగాలి.
  4. రోగికి ప్రత్యేకంగా మరుగు దొడ్డి ఏర్పాటు చేయాలి. వెళ్లినపుడల్లా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. వాడిన మరుగుదొడ్డిని, తాకిన పరికరాలను శుభ్రం చేయాలి.
  5. రోగి తన గదిని తానే శుభ్రం చేసుకోవాలి. అలా చేయలేనపుడు సేవలు అందించే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగుల మందు లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ లీటర్‌కు మూడు స్పూన్ల చొప్పున వేస్తూ కావాల్సినన్ని లీటర్లు తయారు చేసుకోని గదిని శుభ్రం చేసుకోవాలి.
  6. ఇంటిలో వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, ఇతర అస్వస్థతలు ఉన్న వారి నుంచి రోగి కనీసం రెండు మీటర్లు దూరంగా ఉండాలి.
  7. పొగతాగడం ఆపేయాలి. దీని ఊపిరితిత్తులపై మరింత ప్రభావం చూపి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. 
  8. రోగి వాడిన వస్తువులను ఇతరుల వస్తువులతో కలపరాదు. బెడ్‌ షీట్లు, రుమాలు, టవల్‌, వేడి నీటిలో రసాయనాలు వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఉతికిన తర్వాత ఎండలో ఆరవేయాలి. రోగి వాడిన మాస్క్‌ లేదా గుడ్డ బ్లీచింగ్‌లో 20-30 నిమిషాలు నానబెట్టి ఉతకాలి.
  9. రోగి వైద్యుల సలహా మేరకు మందులు తప్పనిసరిగా వాడాలి. రోజు జ్వరం పరిశీలించాలి. తీవ్రమైతే వెంటనే వైద్యులకు ఫోన్‌ చేసి చెప్పాలి. దగ్గు, గొంతు నొప్పి, చాతిలో నొప్పి లేదా నొక్కినట్లు ఉండడం, పెదాలు, ముఖం నీలం రంగులోకి మారడం, తికమక పడటడం, లేవలేక పోవడం, విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడితే వెంటనే ప్రభుత్వ ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స పొందాలి.
  10.  రోగి సేవకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
  11. మూడు పొరల మాస్క్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. మాస్కు ముందు భాగాన్ని ముట్టుకోకుండా, పైకి కిందకి కదపకుండా ఉండాలి. అరగంటకి మించి వాడరాదు. వాడిన మాస్కులను ప్రతి రోజూ కాల్చి వేయాలి. 
  12. రోగికి సేవలు అందిస్తున్నపుడు కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకొద్దు. సేవలు అందించిన తర్వాత చేతులను సబ్బు నీటితో 40-60 సెకన్ల పాటు కడుక్కోవాలి. 
  13. ఆహారం తినేటపుడు, మరుగుదొడ్డి వాడిన తర్వాత వెంటనే సబ్బుతో నీటిని 40-60 సెకన్ల వరకు కడుక్కోవాలి. 
  14. రోగి శరీరం నుంచి వచ్చే చెమట, నోటి నుంచి వచ్చే ఉమ్మి, ముక్కు నుంచి కారే నీటిని తాకవద్దు. ఒకవేళ తాకాల్సి వస్తే వెంటనే సబ్బుతో 40-60 సెకన్ల వరకు చేతులను శుభ్రంగా కడుక్కుని పైకెత్తి గాలికి ఆరబెట్టాలి.
  15. రోగి ఉన్న గదిలో ఏ వస్తువూ ముట్టుకోకూడదు. రోగి వాడిన బెడ్‌ షీట్స్‌, టవల్స్‌, పల్లెం, గిన్నెలు, గ్లాసులు వేరుగా పెట్టాలి. వీటిని ముట్టుకున్నా వెంటనే చేతులు కడుక్కోవాలి. రోగి వాడిన ఏ వస్తువునైనా 30 నిమిషాలు వేటి నీటిలో ఉంచిన తర్వాత శుభ్రం చేసి వాడుకోవచ్చు.
  16. రోగికి ఆహారం, ఇతర అవసరాలను కేటాయించిన గదిలోనే ఉంచండి. రోగి వాడిన వస్తువులు, బట్టలు శుభ్రపర్చేటపుడు మూడు పొరల మాస్కులు ధరించాలి. 
  17. రోగిని రోజూ గమనించాలి. జ్వరం, ఇతర లక్షణాలు పెరిగినట్లతే హెల్ప్‌లైన్‌, టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలి.
  18. సామూహికంగా తీసుకోవాల్సినవి.. 
  19. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులున్న ప్రాంతంలో ఉండే వారు భయపడవద్దని వైద్యులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుని కుటుంబాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు.
  20. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. 
  21. అపార్ట్‌మెంట్‌, ప్లాట్స్‌లో ఉంటే కామన్‌ ప్రాంతాన్ని రోజులో రెండు సార్లు పురుగుల మందులతో శుభ్రం చేసుకోవాలి. తరుచూ తాకే మెట్ల, గోడలను లిఫ్ట్‌ బటన్స్‌ పలు మార్లు శుభ్రం చేయాలి.
  22. పాజిటివ్‌ కేసు కుటుంబ సభ్యులు ఇంటిలోనే ఉండే అవకాశం ఉన్నందున ఇతరులకు సోకే అవకాశం ఉండదు. 
  23. మీ చుట్టు పక్కల స్టాంప్‌ వేసిన వారు బయట తిరిగినట్లు కనిపిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. 
  24.  ప్రతిసారి ఇంటి నుంచి బయటికి వెళ్లినపుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తెచ్చిన వస్తువులను కూడా శుభ్రం చేయాలి. 
  25. కొవిడ్‌ సోకిన వ్యక్తులకు సహకరించాలి. వారిని బా ధించకూడదు. కొందరికిఈ లక్షణాలున్నా బయటికి కనిపించవు. సామాజిక దూరం పాటించాలి.


logo