సోమవారం 18 జనవరి 2021
Nirmal - May 28, 2020 , 06:12:08

కరోనా కట్టుదిట్టం

కరోనా కట్టుదిట్టం

  • ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌-19 నియంత్రణకు చర్యలు
  •  గతంలో 49 కేసులు వారందరికీ పూర్తిగా నయం.. 
  •  తాజాగా 34 మంది  వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌
  •  అనుమానం ఉన్న వారికి రక్త పరీక్షలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 52 కేసులు నమోదు కాగా.. ఇందులో నలుగురు చనిపోయారు. మిగతా 48 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. లక్షణాలు ఉన్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. అలాగే బుధవారం నిర్మల్‌ జిల్లాలో ఏడుగురి శాంపిళ్లను పరీక్షల కోసం పంపించారు. తాజాగా లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట్‌ గ్రామానికి చెందిన వలస కార్మికుడికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 

 నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు దాదాపు సత్ఫలితాలను ఇచ్చాయి. మార్చి నెలాఖరు నుంచి ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఎక్కువగా మార్కజ్‌ వెళ్లి వచ్చిన వారే ఉన్నారు. వారి ద్వారా వారి కుటుంబసభ్యులు, సన్నిహితులకు కూడా కరోనా సోకింది. మరోవైపు గల్ఫ్‌ దేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 86 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వీటిలో గతంలోనే మార్కజ్‌, ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, వారి ద్వారా వారి బంధువులు, సన్నిహితులకు 52 మందికి మొత్తం కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో నిర్మల్‌ జిల్లాలో 23 రాగా.. ముగ్గురు చనిపోయారు. మిగతా 20 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొంది వ్యాధి నయమై డిశ్చార్జి అయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఒకరికి వ్యాప్తి చెందగా.. చనిపోయారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏడు కేసులు, ఆదిలాబాద్‌ జిల్లాలో 21 కేసులు నమోదు కాగా.. వీరంతా చికిత్స తీసుకోవడంతో వ్యాధి నయమైంది. దీంతో నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేకపోవడం, కొత్తగా కేసులు నమోదుకాకపోవడంతో కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించారు. తాజాగా కొన్ని రోజుల నుంచి ముంబై, ఇతర ప్రాంతాలు, హైదరాబాద్‌ నుంచి వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో వీరిలో కొందరికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. 

ముంబై, పుణె, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేస్తున్నారు. రక్తనమూనాలు తీసి పరీక్షలు చేస్తుండగా.. ఇందులో కొందరికి పాజిటివ్‌ వచ్చింది. 

34 మంది వలస కార్మికులకు పాజిటివ్‌

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 34 మంది వలస కార్మికులు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 29 మంది, నిర్మల్‌ జిల్లాలో ముగ్గురు, ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులకు పాజిటివ్‌ వచ్చింది. వీరందరినీ హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు పంపించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు 34 మందికి కరోనా పాజిటివ్‌ ఉండగా.. వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపడుతుండగా.. అనుమానం ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు సరిహద్దుగా మహారాష్ట్ర ఉండటంతో వలస కార్మికులపై ఎక్కువగా దృష్టి పెట్టారు.

నిర్మల్‌ జిల్లా బాసర నుంచి మొదలుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు వరకు నాలుగు జిల్లాలకు గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదులకు సరిహద్దున మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.  మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని క్వారంటైన్‌లో పెడుతున్నారు. నాలుగు జిల్లాలోని ఆయా చెక్‌పోస్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి నిశీతంగా పరిశీలిస్తున్నారు. నిర్మల్‌ జిల్లా బిద్రెల్లి, బెల్తరోడా, సిర్పెల్లి.. ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌, లక్ష్మిపూర్‌.. ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి.. మంచిర్యాల జిల్లా అహేరి చెక్‌పోస్టుల్లో పటిష్ట బందోబస్తు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీరందరినీ 14 రోజులపాటు హోం క్వారంటైన్‌ చేయగా.. బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లాలో ఏడుగురికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఇందులో ఇద్దరు హైదరాబాద్‌ నుంచి రాగా.. మిగతా వారు స్థానికులే. జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారికి ముందస్తుగా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట్‌ గ్రామానికి ముంబై నుంచి వలస కార్మికుడు వచ్చాడు. ఈ నెల 24న కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో అతనితోపాటు అతని నలుగురు కుటుంబ సభ్యులను బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించినట్లు వైద్యాధికారి ప్రసాద్‌ పేర్కొన్నారు.